ఢిల్లీతో పాటు, జాతీయ రాజధాని ప్రాంతం (నేషనల్ క్యాపిటల్ రీజియన్-ఎన్‌సిఆర్)లో వాయు కాలుష్యం ఆందోళనకర రీతిలో పెరుగుతుండటం కలవరం కలిగిస్తోంది. కొద్దిరోజుల క్రితం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ స్కేల్‌పై 500 పాయింట్లకు గానూ 400 పాయింట్ల ప్రమాదకర స్థాయిని దాటి కాలుష్యం నమోదైంది. ఈ నెల 2వ తేది అంతకుముందు రోజుతో పోలిస్తే 68 శాతం పెరిగి 2.5 మైక్రాన్ల పరిమాణానికి కణ కాలుష్యం (పర్టిక్యులేట్ మేటర్-పిఎం) చేరింది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన సురక్షిత ప్రమాణం కంటే 30 రెట్లు ఎక్కువ! ఆ తరువాత రోజుల్లో కూడా కొంచెం అటు, ఇటుగా ఈ స్థాయి కాలుష్యం కొనసాగుతూనే ఉంది. ఫలితంగా పెద్ద సంఖ్యలో ప్రజానీకం ఆస్థమా, ఎలర్జీలతో పాటు అనేక రోగాల బారిన పడుతున్నారు. రోడ్లన్నీ పొగతో నిండిపోవడంతో, ఊపిరాడని పరిస్థితి నెలకొంది. మాస్కులు లేనిదే రోడ్ల మీదకు రాలేని పరిస్థితి నెలకొంది. ఈ సీజన్‌లో సహజంగా ఉండే పొగమంచుకు కాలుష్యం తోడు కావడంతో ఈ పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో దాదాపు ఏడు సంవత్సరాల తరువాత దేశ రాజధాని నగరంలో పాఠశాలలను మూసివేశారు. అనేక కార్యాలయాలు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అమలు చేస్తున్నాయి. ఈ విపత్తును కూడా రాజకీయం చేయడానికి ప్రయత్నించడం, ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వంపై విమర్శలు కురిపించడం మోడీ ప్రభుత్వ దిగజారుడు తనానికి పరాకాష్ట! దీంతో జోక్యం చేసుకున్న సర్వోన్నత న్యాయస్థానం వాయు కాలుష్యాన్ని రాజకీయ పోరుగా మార్చవద్దని సూచించాల్సి వచ్చింది.
దేశ రాజధానిలో ఈ సమస్య ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చేందేమి కాదు. వాయు కాలుష్యంపై ఢిల్లీ ప్రజానీకం రెండు దశాబ్దాలకు పైగా పోరాటం చేస్తున్నారు. సుప్రీంకోర్టు కూడా అనేకసార్లు జోక్యం చేసుకుంది. అయినా, ఈ సమస్యను అధిగమించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే పంజాబ్, హర్యానా తో పాటు ఢిల్లీ పరిసరాల్లో ఉన్న అనేక రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగలబెట్టడమే ఈ సమస్యకు ప్రధాన కారణమని సుప్రీంకోర్టు తాజాగా అభిప్రాయపడింది. దీనిని తక్షణం ఆపాలని రాష్ట్రాలను ఆదేశించింది. గతంలోనూ ఈ దిశలో సూచనలు చేసినా అవి అమలు కాకపోగా, ఈ ఏడాది పంజాబ్‌లో పంట వ్యర్థాలను దగ్ధం చేయడం 740 శాతం మేర పెరిగినట్లు అంచనా! పంట కోసిన 10 నుండి 14 రోజుల్లోనే రబీ పంట వేయాల్సి ఉండటంతో మరో మార్గం లేదని రైతులు అంటున్నారు. ఢిల్లీలో కాలుష్యం పెరగడానికి ఇతర కారణాలు కూడా ఉన్నాయి. స్థానిక పరిశ్రమల్లో సహజవాయువును మాత్రమే వినియోగించాలని గతంలో జారీ చేసిన ఆదేశాలు పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. వ్యక్తిగత వాహనాల వినియోగం సాధ్యమైనంత మేర తగ్గించాలని, ప్రజా రవాణా వ్యవస్థను గణనీయంగా పెంచాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలు పూర్తిస్థాయిలో అమలు కాలేదు. 2005-06లో ప్రతి వెయ్యి మందికి 317గా ఉన్న వ్యక్తిగత వాహనాల సంఖ్య 2020-21 నాటికి 655కి చేరింది. 2021-22లో వీటి సంఖ్య తగ్గిందని, ప్రతి వెయ్యి మందికి 472 వాహనాలు మాత్రమే ఉన్నాయని ప్రభుత్వం ప్రకటించింది. వ్యక్తిగత వాహనాలు తగ్గితే ప్రజా రవాణా వ్యవస్థను వినియోగించే వారి సంఖ్య పెరగాలి కదా! కానీ, అలా జరగలేదు. తాజా ఆర్థిక సర్వే ప్రకారం ప్రజా రవాణా వ్యవస్థను వినియోగించే ప్రయాణీకుల సంఖ్య 2017-18తో పోలిస్తే 2022-23 నాటికి 48 శాతం తగ్గింది! వీరంతా ఏ వాహనాల్లో తిరుగుతున్నారో అర్ధం కాని స్థితి! ప్రజా రవాణా వ్యవస్థలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచాలన్న సుప్రీం ఆదేశాలు కూడా ఇంత వరకు పూర్తిస్థాయిలో అమలు కాలేదు. 30 శాతం ఢిల్లీ నగరంలో నగరపాలక సంస్థ సేవలు అందకపోవడంతో చెత్తను ఎక్కడపడితే అక్కడ తగలబెడుతున్నారంటే విస్మయం కలగకమానదు.
సమస్యకు కారణమౌతున్న వరిపంట స్థానంలో తృణధాన్యాల వంటి సాంప్రదాయ పంటలను సాగుచేస్తామని, వాటికి కనీస మద్దతు ధర చెల్లించేలా చర్యలు తీసుకోవాలంటూ పంజాబ్ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోవాలని అత్యున్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సమిష్టి చర్యల ద్వారానే కాలుష్య నియంత్రణ సాధ్యమవుతుందన్న అంశాన్ని కేంద్రం గుర్తించాలి. పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించడంతో పాటు, కాలుష్య నియంత్రణకు ఢిల్లీ ప్రభుత్వం తీసుకునే చర్యలకు అవసరమైన సహాయ సహకారాలు అందించే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే! ఎక్కడికక్కడ ప్రజలను చైతన్యవంతం చేసి, వారిని కూడా ఈ కృషిలో భాగస్వాములను చెయ్యాలి. అప్పుడే కాలుష్య భూతంపై విజయం సాధ్యమవుతుంది.