Nov 10,2023 07:14

  • ప్రపంచ సైన్సు దినోత్సవ నినాదం

గత 20 సంవత్సరాలుగా, ప్రపంచంలోని అనేక దేశాల్లో, నవంబరు 10వ తేదీని వరల్డ్‌ సైన్స్‌ డే గా జరుపుతున్నారు. ఇది యునెస్కో కార్యక్రమం. శాంతియుత పరిస్థితుల కోసం, సుస్థిర అభివృద్ధి కోసం సైన్స్‌ ఏ విధంగా ఉపయోగపడుతుందో చూడటం దీని ముఖ్య ఉద్దేశం. సైన్సు ముందుకు తెచ్చే నూతన భావనలను, అవగాహనలను ప్రజలలోకి తీసుకుపోవడం కూడా ఇందులో ఉంది. 1999లో హంగేరి రాజధాని బుడాపెస్ట్‌లో మొట్టమొదటి అంతర్జాతీయ సైన్స్‌ కాన్ఫరెన్స్‌ జరిగింది. సాధారణ ప్రజల్లోకి సైన్స్‌ను పెద్ద ఎత్తున తీసుకెళ్లాలని అక్కడ నిర్ణయించుకున్నారు. ప్రతి సంవత్సరం నవంబర్‌ 10ని ప్రపంచ సైన్స్‌ దినంగా జరపాలని 2002లో జరిగిన యునెస్కో కార్యనిర్వాహక సమావేశం, సభ్య దేశాలకు పిలుపునిచ్చింది. అయితే మన దేశంలో దీనికి అంతగా ప్రాచుర్యం లభించలేదు. ఇప్పుడున్న పరిస్థితులలో దీని ప్రాధాన్యతను గుర్తించిన జనవిజ్ఞాన వేదిక, ప్రపంచ సైన్సు దినోత్సవాన్ని రాష్ట్రమంతటా నిర్వహిం చాలని పిలుపునిచ్చింది. ఈ రోజున, స్కూలు స్థాయిలో జరుగుతున్న చెకుముకి సంబరాలతో కలిపి ఈ కార్యక్రమం జరుగుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా నాలుగున్నర లక్షల మందికి పైగా హైస్కూలు విద్యార్థులకు ఈ సందేశం అందించనున్నారు.
 

                                                                           ఈ సారి పిలుపు...

ఈ సంవత్సరం సైన్స్‌ డే సందర్భంగా 'సైన్స్‌ పట్ల నమ్మకం' (ట్రస్ట్‌ ఇన్‌ సైన్స్‌) అనే అంశంపై చర్చ జరగాలని యునెస్కో పిలుపునిచ్చింది. ప్రస్తుతం ఉన్న సామాజిక పరిస్థితులు, ప్రభుత్వ విధానాల నేపథ్యంలో ఈ చర్చ జరగాలని భావించింది. సామాజిక పురోగతి జరగాలంటే సైన్స్‌ మీద నమ్మకం పెట్టాలి. ఆశ్చర్యకరంగా భారతదేశంలో నూటికి 59 మంది ప్రజలు... శాస్త్రవేత్తల పైన, సైన్స్‌ పైన నమ్మకం చూపించారు. ఇంగ్లాండు, జర్మనీ, ఆస్ట్రేలియా లాంటి దేశాలలో కంటే కూడా ఇది ఎక్కువ. 2020లో ఒఇసిడి ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ సైన్స్‌ సర్వే దీన్ని పేర్కొంది. కోవిడ్‌ నేపథ్యంలో జరిగిన ఈ పరిశీలన, ప్రజాసైన్స్‌ ఉద్యమాలకుగల సానుకూల పరిస్థితులను తెలియజేస్తుంది. అయితే సైన్స్‌ పట్ల అపనమ్మకాలను పెంచే ప్రయత్నాలు, ప్రభుత్వ వ్యవస్థల నుండే జరుగుతున్నాయి. ప్రజలలో సైన్సుకున్న ప్రతిష్టను ఆధారంగా చేసుకుని సూడో సైన్స్‌ను సైన్స్‌గా ప్రచారం చేయటానికి పూనుకుంటున్నారు. ప్రజలకు న్న నమ్మకాల ఆధారంగా, ఈ పని చేస్తున్నారు. రుజువుల ఆధారంగా శాస్త్రీయ భావనలను ఓపికగా ప్రజల ముందు పెట్టడమే మనం చేయాల్సింది.
 

                                                            శాస్త్రీయ విద్య-ప్రజల వద్దకు సైన్స్‌

సైంటిఫిక్‌ లిటరసీ, ఓపెన్‌ సైన్స్‌ అనే రెండు భావాలను యునెస్కో ప్రచారం చేస్తోంది. రోజువారీ జీవిత కార్యకలాపాలలో సరైన నిర్ణయం తీసుకోవడానికి అవసరమైన శాస్త్రీయ భావనలను, పద్ధతులను తెలుసుకోవటమే శాస్త్రీయ విద్య అనొచ్చు. అలాగే సామాజిక సాంస్కృతిక ఆర్థిక జీవితంలో పాలు పంచుకోవడానికి అవసరమైన శాస్త్ర విజ్ఞానాన్ని కలిగి ఉండటం కూడా. సమాజంలో బలమైన శాస్త్రీయ విద్య ఉండాలంటే మన స్కూళ్లలో, కాలేజీలలో ఒక నాణ్య మైన సైన్సు బోధన జరగాలి. సైన్స్‌ అంటేనే పరిశీలనలు, ప్రయోగాలు. కానీ నేడు సైన్స్‌ అంటేనే ర్యాంకులు, గ్రేడ్లు, మార్కులుగా మారిపోయింది. అందుకే మౌలిక పరిశోధనా రంగంలో వెనకబడి పోయాం.
           యునెస్కో ముందుకు తెచ్చిన మరొక భావన-ఓపెన్‌ సైన్స్‌. సైన్సు కానీ, సైన్సు పరిశోధనలు కానీ రహస్యంగా ఉండాల్సిన అవసరం లేదని ఇది చెబుతుంది. సైన్స్‌కు సంబంధించిన నిర్ణయాలలో, సాధారణ ప్రజల ప్రయోజనాలు, భాగస్వామ్యం ఉండాలని చెబుతుంది. కానీ ప్రస్తుతం సైన్స్‌ దశను, దిశను కార్పొరేట్‌ శక్తులు నియంత్రిస్తున్నాయి. ఒక ఉత్పత్తి శక్తిగా, శాస్త్ర పరిశోధనలు కార్పొరేట్ల గుప్పెట్లో ఉన్నాయి. కాబట్టి ఓపెన్‌ సైన్స్‌ భావనను మరింత విస్తృతం చేసి, శాస్త్ర సాంకేతిక ఫలితాలు ప్రజలందరికీ చెందేట్టుగా ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌, బయో టెక్నాలజీ లాంటి శాస్త్రాలలో విప్లవాత్మకమైన మార్పులు వస్తున్న నేటి తరుణంలో ఓపెన్‌ సైన్స్‌ భావనను అందరూ ప్రచారంలో పెట్టాలి. ఇప్పుడు జన విజ్ఞాన వేదిక చేస్తున్న శాస్త్ర ప్రచార ఉద్యమం ఇందుకు ఉపయోగపడుతుంది.
 

                                                                        దేశవ్యాప్త ప్రచార ఉద్యమం

జన విజ్ఞాన వేదిక, ఆల్‌ ఇండియా పీపుల్స్‌ సైన్స్‌ నెట్‌వర్క్‌ ఈ నెల ఏడవ తేదీ నుండి వచ్చే ఫిబ్రవరి 28 దాకా పెద్ద ఎత్తున రాష్ట్రంలోనూ, దేశంలోనూ ఈ సైన్స్‌ ప్రచార ఉద్యమాన్ని చేపడుతున్నాయి. అందులో భాగంగానే ప్రపంచ సైన్స్‌ దినోత్సవాన్ని కూడా నిర్వహిస్తున్నాయి. సూడో సైన్స్‌, సైన్సు వ్యతిరేక ధోరణులకు ప్రభుత్వ వ్యవస్థలలోనే ప్రేరణ, ప్రోత్సాహం దొరుకుతున్న సందర్భంలో... అసలుసిసలు సైన్స్‌ భావాలను, ఆలోచనా పద్ధతులను వివిధ రూపాలలో ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. జీవ పరిణామం, పదార్థం, చరిత్ర గమనం లాంటి శాస్త్రీయ అంశాల బోధనను బలహీనపరిచే ప్రయత్నాలను చూస్తున్నాం. ఒక విధంగా ఇవన్నీ శాస్త్రీయ దృక్పథాన్ని బలహీన పరిచేందుకు చేస్తున్న ప్రయత్నాలే. వీటికి బలమైన సమాధానం సైన్స్‌ ద్వారా, ప్రజా ఉద్యమాల ద్వారా ఇవ్వాలి.

/ వ్యాసకర్త జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు /
డా|| గేయానంద్‌

geyanand