ఏ చిన్న అవకాశం దొరికినా ప్రయాణీకుల రైళ్లను రద్దు చేయటం పరిపాటిగా మారింది. ఇవి కూడా స్వల్ప దూరాల్లో ప్రయణించేవే కావటం గమనించాలి. సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నలకు వచ్చిన సమాధానాలివి. 2022వ సంవత్సరంలో ఆరు నెలల్లో తొమ్మిది వేలకు పైగా రైలు సర్వీసులను రద్దు చేశారు. వాటిలో బొగ్గు రవాణాకు ప్రాధాన్యత ఇచ్చే పేరుతో రద్దు చేసినవి 1,934 ఉన్నాయి. మరో 6,995 రైళ్లను మార్గ మరమ్మతులు, నిర్వహణ పేరుతో రద్దు చేశారు. వీటిలో 3,395 మెయిల్ లేదా ఎక్స్‌ప్రెస్‌లు, 3,600 పాసింజర్లు ఉన్నాయి. సరకు రవాణా లాభసాటి అన్నది తెలిసిందే. ప్రభుత్వం ఆ లాభాలను చూస్తున్నది తప్ప ప్రయాణీకులను గాలికి వదలి వేస్తునది. 2021-22లో రైళ్ల రద్దు, తగినన్ని రైళ్లు లేని కారణంగా కోటీ అరవై లక్షల మంది ప్రయాణించలేదు. విమాన ప్రయాణీకుల పెరుగుదల గురించి చెబుతున్న పాలకులకు రైల్వే ప్రయాణీకులు పెరుగుతున్నారని తెలియదా ?
గరీబ్ కళ్యాణ్ యోజన బియ్యం పథకాన్ని మరో ఐదు సంవత్సరాల పాటు పొడిగించనున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ఒక ఎన్నికల సభలో ప్రకటించారు. ఇదే సమయంలో నవంబరు మూడవ తేదీన అమెరికా న్యూయార్క్ టైమ్స్ పత్రిక 'భారత్ మాదిరి ఎక్కువగా విమానాలను కొనుగోలు చేస్తున్న దేశం మరొకటి లేదు, ఎందుకో ఇక్కడ చూడండి' అనే శీర్షికతో వార్త ఇచ్చింది. చూశారా జనం పట్ల మోడీకి ఎంత శ్రద్ధ ఉందో అని ఉచిత బియ్యం గురించి, విమానాల కొనుగోలులో మనమే టాప్ అంటే పదేళ్లలో మోడీ దేశాన్ని ఎంత అభివృద్ధి చేశారో చెప్పటానికి ఇంతకంటే ఏం కావాలని తబ్బిబ్బు అవుతున్నారు. జనం మీద ఇతర అంశాల్లో లేని ప్రేమ ఉచిత బియ్యం మీద ఎందుకు చూపుతున్నారు? ఐదు రాష్ట్రాల్లో బిజెపికి పరీక్షగా మారిన అసెంబ్లీ, వచ్చే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రాఖీ బహుమతి పేరుతో ఉజ్వల పథక గ్యాస్ సబ్సిడీని 200 నుంచి 400కు పెంచగా, ఇతరులకు రూ.200 రాయితీ ఇచ్చారు. పొయ్యి మీదకు ఐదు కిలోల ఉచిత బియ్యం ఇస్తున్నారు. పొయ్యి కిందకు అవసరమైన గ్యాస్ ధర మోడీ గద్దెనెక్కినపుడు రూ.420 వరకు ఉండగా రూ.1,150కు పెంచారు (రాష్ట్రాలలో ధరల్లో తేడాలు ఉన్నాయి). అంతగా పెంచినపుడు మహిళలు గుర్తుకు రాలేదా? నరేంద్రమోడీ పదేళ్ల ఏలుబడిలో దేశంలో ఆకలి పెరిగింది తప్ప తగ్గలేదన్నది పచ్చి నిజం. 2023 నాటికి అది 125 దేశాలకు గాను 2022లో 121కి 107 కాగా 2023లో 125 దేశాల్లో 111కు దిగజారింది. ఈ సూచికలను ఏనాడూ కేంద్ర ప్రభుత్వం అంగీకరించలేదు, తప్పుల తడక అని చెప్పటం తప్ప...దేశంలో ఆకలి ఎంత ఉందో అసలు లేదో అన్నది కూడా ఇంతవరకు చెప్పలేదు.
భారత్‌కు అదనంగా వెయ్యి విమానాలు కావాల్సి ఉందని 2018 జూన్ మొదటి వారంలో నాటి పౌర విమానయాన శాఖ మంత్రి సురేష్ ప్రభు ప్రకటించారు. మేకిన్ ఇండియాలో భాగంగా విదేశీ కంపెనీలు మన దేశంలోనే తయారు చేస్తాయని కూడా చెప్పారు. రానున్న రెండు దశాబ్దాల్లో భారత్ తమ నుంచి 1,750 కొనుగోలు చేయవచ్చని ఎయిర్ బస్, 2,100 ఆర్డర్లు తమకు రావచ్చని బోయింగ్ కంపెనీ 2017లోనే చెప్పింది. కొత్తగా వెయ్యి విమానాలను కొనుగోలు చేస్తున్నట్లు సంస్థలు ప్రకటించాయి. దీంతో ఎవరికీ పేచీ లేదు. వీటి వలన సామాన్యులకు ఒరిగేదేమిటి? డబ్బున్నోళ్లు ఎక్కుతారు. పెరుగుతున్న రైలు ప్రయాణీకులకు అనుగుణంగా రైళ్లను పెంచాలని నెత్తీ నోరు కొట్టుకుంటున్నా పట్టించుకోలేదు. మూడేళ్లనాటి రైల్వే శాఖ అంచనా ప్రకారం కనీసం ఇరవై వేల రైళ్లు అవసరం కాగా పదమూడు వేలు మాత్రమే ఉన్నాయి. ఏటా వీటిలో ప్రయాణిస్తున్నవారు 2010 నుంచి 2020 వరకు సగటున ఏడాదికి 811 కోట్ల మంది ఉన్నారు. 2010లో 724 కోట్లు కాగా 2020లో 809 కోట్ల మంది ఉన్నారు. తగినన్ని రైళ్లు లేని కారణంగా ప్రయాణీకులు పెరగటం లేదని ఈ అంకెలు వెల్లడిస్తున్నాయి. నూట నలభై కోట్ల మందికి అవసరమైన రైళ్లను గడచిన ఆరు సంవత్సరాల్లో ఎనిమిది వందలు మాత్రమే పెంచారు. 2022-23 సంవత్సరరలో దేశంలో విమాన ప్రయాణీకులు 37.7 కోట్లు కాగా వారిలో విదేశీయులు 5.9 కోట్ల మంది ఉన్నారు. వీరి కోసం ఈ ఒక్క ఏడాదే వెయ్యి విమానాలు కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించారు. పోనీ అవి ప్రైవేటు సంస్థలు అనుకుందాం, రైళ్లను పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? అసలు సంగతేమంటే జనాలకు అచ్ఛే దిన్ అని చెప్పిన మోడీ కరోనా పేరుతో రద్దు చేసిన పాసింజరు రైళ్లను, రాయితీలను ఇంతవరకు పునరుద్ధరించలేదు. వాటి మీద ఒక నిర్దిష్ట ప్రకటన కూడా లేదు. అనేక పాసింజర్లను ఎక్స్‌ప్రెస్‌లుగా మార్చి ప్రయాణీకుల నుంచి జేబులు కొల్లగొడుతున్న సంగతి తెలిసిందే. తక్కువ ఖర్చుతో ప్రయాణించే రైళ్ల బదులు వందే భారత్‌లను ప్రవేశపెట్టేందుకు మాత్రమే శ్రద్ధ చూపుతున్నారు. హైస్పీడు, బుల్లెట్ రైళ్లు వాటికోసం మార్గాల నిర్మాణం గురించి చూపుతున్న శ్రద్ధ సామాన్య జన అవసరాల మీద లేదు. భారత్ విమానాల కొనుగోలు గురించి గొప్పగా రాయటం మోడీని మునగ చెట్టు ఎక్కించే యత్నం తప్ప మరొకటి కాదు.
ఒక్కసారిగా వెయ్యి విమానాలను కొనుగోలు చేస్తే అసలు అవి నిండే అవకాశం ఉందా? ప్రస్తుతం దేశంలో ఇరవై ప్రయాణాలు రైల్లో చేస్తే ఒకటి విమానంలో జరుగుతున్నట్లు అంచనా. విమానం కంటే రైల్లో మొదటి తరగతి చార్జీలను ఎక్కువగా నిర్ణయించి జనాలను విమానాలవైపు వెళ్లేట్లు చేస్తున్నారు. ఇది ప్రైవేటు సంస్థలకు లబ్ధి చేకూర్చే వైఖరి తప్ప మరొకటి కాదు. ఎయిర్ ఇండియాను స్వాధీనం చేసుకున్న టాటా గ్రూపు కొత్తగా 470 విమానాలను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. మరో సంస్థ ఇండిగో మరో ఐదు వందలు కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. తక్కువ ఖర్చుతో ప్రయాణించే విమానాల ద్వారా రద్దీ పెంచుకొని లబ్ధి పొందేందుకు అవి చూస్తున్నాయి. ప్రభుత్వం కూడా గత తొమ్మిది సంవత్సరాల్లో 74గా ఉన్న విమానాశ్రయాలను 148కి పెంచింది, 2030 నాటికి 230కి పెంచుతామని చెబుతున్నారు. ఇది తమ ఘనతగా అధికార బిజెపి ప్రచారం చేసుకుంటున్నది. ఇదే మాదిరి రైలు ప్రయాణీకులకు అవసరమైన ఖర్చు, వేగంగా ప్రయాణించే మార్గాలకు ప్రభుత్వం ఖర్చు పెట్టిందా అంటే లేదు. వందేభారత్ రైళ్లు కూడా పూర్తి వేగంతో నడవటంలేదు. రెండు వందల కిలోమీటర్లకు పైగా తిరిగే అన్ని పాసింజరు రైళ్లను ఎక్స్‌ప్రెస్‌లుగా మార్చటంతో దేశంలో ఐదు వందలకు పైగా రైళ్లు సామాన్యులకు దూరమయ్యాయి. అనేక గ్రామాల్లో ఉన్న రైల్వే స్టేషన్లలో రైళ్లను ఆగకుండా చేశారు. ఈ కారణంగా కలసి వచ్చిన సమయం గురించి చెప్పకుండా వేగం పెంచి ప్రయాణీకులకు మేలు చేసినట్లు చెప్పారు. ఎక్స్‌ప్రెస్‌లుగా మార్చినందున గతంతో పోలిస్తే ప్రతి ప్రయాణీకుడి మీద 20 నుంచి 60 రూపాయల వరకు అదనపు భారం పడింది. దీనికి తోడు ఎక్స్‌ప్రెస్ రైళ్లలో సాధారణ స్లీపర్ కోచ్‌లను తగ్గించి ఎసి కోచ్‌లను పెంచారు. సీట్లు దొరక్క అనివార్యంగా అదనపు చార్జీలు చెల్లించాల్సి వస్తున్నది. వృద్ధులు, మహిళలకు ఇస్తున్న ప్రయాణ రాయితీలను రద్దుచేశారు. టిక్కెట్ల రిజర్వేషన్, రద్దు చార్జీలను విపరీతంగా పెంచి మరో రూపంలో జేబులును కొల్లగొడుతున్నారు. పేరుకు చార్జీలను పెంచలేదనటం తప్ప కరోనా తరువాత పరోక్షంగా మోపిన భారం మామూలుగా లేదు. రద్దీ ఉన్న మార్గాలలో ఏళ్ల తరబడి ప్రత్యేక రైళ్ల పేరుతో నడుపుతూ జనం దగ్గర అదనపు చార్జీలను వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. వాటినే సాధారణ రైళ్లుగా ఎందుకు నడపరు? ప్రయాణీకుల రైళ్ల నిర్వహణ గిట్టుబాటు కావటం లేదంటూ ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వ పెద్దలు చెబుతుంటారు. ఆ లెక్కలకు ఆధారం ఏమిటో తెలియదు. ప్రతి ప్రయాణీకుడి నుంచి కేవలం 47 శాతమే వసూలు చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతున్నది. సామాన్యులకు విమానాలను అందుబాటులోకి తేవాలనే పేరుతో అవి నడిచేందుకు అవసరమైన ఇంథనం మీద రాయితీలు ఇస్తున్నారు. మరోవైపు రాష్ట్రాల్లో ప్రజా రవాణా సంస్థల బస్సులకు ఎలాంటి ఇంథన సబ్సిడీలు లేవు. సరకు రవాణాకు ఎలాంటి రాయితీ లేదు. కేంద్ర ప్రభుత్వం ప్రయాణీకులకు 2019-20లో ఇచ్చిన సబ్సిడీ మొత్తం రూ.59,837 కోట్లు. సగటున ముందే చెప్పుకున్నట్లు ఏడాదికి ప్రయాణీకులు 811 కోట్లు, అంటే ఒక్కో ప్రయాణం మీద ఇస్తున్న రాయితీ రూ.73.78 మాత్రమే. ఈ మాత్రానికే అంతా దోచిపెడుతున్నట్లు గుండెలు బాదుకుంటున్నారు. నాసిరకం భోజనం, టిఫిన్లు, టీ, కాఫీలకు ప్రయాణీకులు చెల్లిస్తున్న మొత్తాలతో బేరీజు వేస్తే జనమే అధికంగా చెల్లిస్తున్నట్లు స్పష్టం అవుతుంది. ప్రభుత్వ రంగంలోని రవాణా వ్యవస్థలు అయ్యే ఖర్చును మాత్రమే రాబట్టాలి తప్ప లాభాలు తేవాలని చూడటమే తప్పు. ఆ లాభం కూడా సామాన్యుల నుంచి మరో రూపంలో వసూలు చేస్తున్నదే.
ఏ చిన్న అవకాశం దొరికినా ప్రయాణీకుల రైళ్లను రద్దు చేయటం పరిపాటిగా మారింది. ఇవి కూడా స్వల్ప దూరాల్లో ప్రయణించేవే కావటం గమనించాలి. సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నలకు వచ్చిన సమాధానాలివి. 2022వ సంవత్సరంలో ఆరు నెలల్లో తొమ్మిది వేలకు పైగా రైలు సర్వీసులను రద్దు చేశారు. వాటిలో బొగ్గు రవాణాకు ప్రాధాన్యత ఇచ్చే పేరుతో రద్దు చేసినవి 1,934 ఉన్నాయి. మరో 6,995 రైళ్లను మార్గ మరమ్మతులు, నిర్వహణ పేరుతో రద్దు చేశారు. వీటిలో 3,395 మెయిల్ లేదా ఎక్స్‌ప్రెస్‌లు, 3,600 పాసింజర్లు ఉన్నాయి. సరకు రవాణా లాభసాటి అన్నది తెలిసిందే. ప్రభుత్వం ఆ లాభాలను చూస్తున్నది తప్ప ప్రయాణీకులను గాలికి వదలి వేస్తునది. 2021-22లో రైళ్ల రద్దు, తగినన్ని రైళ్లు లేని కారణంగా కోటీ అరవై లక్షల మంది ప్రయాణించలేదు. చివరి క్షణాల్లో వారెంత ఇబ్బంది పడి ఉంటారో ఊహించుకోవాల్సిందే. విమా న ప్రయాణీకుల పెరుగుదల గురించి చెబుతున్న పాలకులకు రైల్వే ప్రయాణీకులు పెరుగుతున్నారని తెలియదా ?
ఒక విశ్లేషణ ప్రకారం 2019లో మన దేశంలో తలసరి విమాన సీట్లు 0.13 కాగా చైనాలో 0.52, అమెరికాలో 3.03 ఉన్నాయి. స్టాటిస్టా సంస్థ వెల్లడించిన సమాచారం ప్రకారం 2021లో ఆయా దేశాల్లో నమోదైన విమాన సంస్థల వద్ద ఉన్న వివరాల ప్రకారం అమెరికాలో ప్రయాణీకులు 66.615 కోట్లు, చైనాలో 44.03, ఐరోపా సమాఖ్యలో 25.169, రష్యాలో 9.685, మన దేశంలో 8.396 కోట్ల మంది ఉన్నారు. మన హైదరాబాద్ కంటే తక్కువగా అంటే 70 లక్షల 52 వేల మంది ఉన్న ఐర్లండ్‌లో 7.047 కోట్ల మంది ఉన్నారు. ఈ అంకెలు వాస్తవాలను ప్రతిబింబించవు. ఉదాహరణకు మన దేశంలో ఇండిగో సంస్థ బ్రిటన్-రష్యా మధ్య విమానాలను నడిపితే వాటిలో ఎక్కే ప్రయాణీకులను కూడా మన దేశ ఖాతాలోనే వేస్తారు. రానున్న రోజుల్లో దేశంలోని మధ్య తరగతి జనాలు ఇంకా పెరుగుతారనే అంచనాతో కొత్తగా విమానాలను కొనుగోలు చేసేందుకు పూనుకున్నారు. మిగతా దేశాల వద్ద ఇప్పటికే ఎక్కువ ఉన్నాయి. అందువలన ఏ దేశమూ కొననన్ని విమానాలను మనం కొంటున్నామని ఎవరైనా అంటే మనకు మనమే జబ్బలను చరుచుకోవాల్సిన అవసరం లేదు.
ఎం. కోటేశ్వరరావు