Nov 11,2023 07:15

రైల్వే ప్రమాదాలకు కేంద్ర ప్రభుత్వ విధానాలే ప్రధాన కారణం. కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ విధానాలకు పెద్ద పీట వేస్తున్నది. పర్మినెంట్‌ కార్మికుల స్థానంలో కాంట్రాక్టీకరణ తీవ్రంగా పెరుగుతోంది. దేశవ్యాప్తంగా గతంలో రైల్వే శాఖలో సుమారు 20 లక్షల మంది పర్మినెంట్‌ కార్మికులుండేవారు. నేడు పర్మినెంట్‌ కార్మికుల సంఖ్య 12 లక్షలకు పడిపోయింది. వీరిలో 6 లక్షల మంది కాంట్రాక్ట్‌ కార్మికులే. గతంలో 8,417 రైల్వే ట్రాక్‌లు వుండగా, నేడు 12,734కు పెరిగాయి. ట్రాక్‌ మెయిన్‌టెనెన్స్‌, సిగ్నలింగ్‌ లాంటి కీలక భద్రత విభాగాల్లో కూడా పర్మినెంట్‌ పోస్టులను కేంద్ర ప్రభుత్వం భర్తీ చేయడం లేదు. 1.7 లక్షల భద్రత పోస్టులు నేడు రైల్వేల్లో ఖాళీగా ఉన్నాయి. కంట్రోల్‌ ఆఫ్‌ ఆడిటింగ్‌ జనరల్‌ (కాగ్‌) నివేదిక ప్రకారం రైల్వే భద్రతా నిధులను పక్కదారి పట్టించారని రైల్వే డిపార్ట్‌మెంట్‌పై కాగ్‌ అక్షింతలు వేసింది. అయినా రైల్వే తన తీరు మార్చుకోకపోవడం విచారకరం.

            భారత రైల్వేలు నేడు ప్రమాదాలకు ప్రసిద్ధిగాంచాయి. గత ఆరు మాసాల్లో ఆరు తీవ్ర ప్రమాదాలు జరిగాయి. ఒరిస్సా బాలాసోర్‌ జిల్లాలోని బాహనగర్‌ బజార్‌ రైల్వే స్టేషన్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మూడు రైళ్లు ఢకొీన్నాయి. 296 మంది మృతి చెందారు. 1200 మంది తీవ్రంగా గాయపడ్డారు. విజయనగరం జిల్లా లోని కంటకాపల్లి రైల్వే స్టేషన్‌ వద్ద జరిగిన ప్రమాదంలో మూడు రైళ్లు గుద్దుకున్నాయి. ఇద్దరు లోకో పైలెట్లు, ఒక గార్డుతో సహా 14 మంది మృతి చెందారు. అనేక మంది గాయపడ్డారు. ప్రమాదం జరిగిన అక్టోబర్‌ 29వ తేదీ ఉదయం నుండి ఆటోమేటిక్‌ సిగలింగ్‌ వ్యవస్థ సక్రమంగా పనిచేయడం లేదని గుర్తించినా రైళ్లను నడపాలని అధికారులు నిర్ణయించారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి నుంచే విశాఖపట్నంలోని గోపాలపట్నం నుంచి విజయనగరం రైల్వేస్టేషన్‌ వరకు ఆటోమేటిక్‌ సిగల్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేశారు. ఆటోమేటిక్‌ సిగలింగ్‌లో తరచుగా లోపాలు బయటపడ్డాయి. అయినా నేటికీ లోపాలను పూర్తిగా సరిచేయలేకపోయారని, దీనివల్ల లోకో పైలెట్లకు, స్టేషన్‌ మాస్టర్లకు కూడా గందరగోళ పరిస్థితులు తలెత్తాయని అనేక మంది భావిస్తున్నారు. లోపాలు తలెత్తినా రైళ్లను తిప్పడం ఆపరాదని రైల్వే నియమాల వల్ల రైల్వే అధికారులు ప్రయాణాలు ఆపకుండా రైళ్లను నడిపించారు. ఈ ప్రమాదాలపై జరిగిన దర్యాప్తులన్నీ మసిబూసి మారేడుకాయ చందంగా ఉన్నాయి. చీఫ్‌ రైల్వే సేఫ్టీ కమిషనర్‌, హైపవర్‌ కమిటీ లాంటి కమిటీలను రైల్వే బోర్డు ఒత్తిడి చేసి తమకు అనుకూలంగా రిపోర్టులు తయారు చేయిస్తున్నారు. వీరి దర్యాప్తులన్నీ కార్మికుల మీద నెపం వేస్తున్నాయి. ప్రభుత్వం అసలు కారణాలు పక్కకు పెడుతున్నది. ప్రతి ప్రమాదంలో వాస్తవాలు వెలికితీసి ప్రమాదాలను అరికట్టే తక్షణ చర్యలు చేపట్టే వరకు ఈ దుర్ఘటనలు కొనసాగుతూనే ఉంటాయి. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రైల్వే ప్రమాదాలపై తన తప్పుడు విధానాలను మార్చుకోవాలి.
             రైల్వే ప్రమాదాలకు కేంద్ర ప్రభుత్వ విధానాలే ప్రధాన కారణం. కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ విధానాలకు పెద్ద పీట వేస్తున్నది. పర్మినెంట్‌ కార్మికుల స్థానంలో కాంట్రాక్టీకరణ తీవ్రంగా పెరుగుతోంది. దేశవ్యాప్తంగా గతంలో రైల్వే శాఖలో సుమారు 20 లక్షల మంది పర్మినెంట్‌ కార్మికులుండేవారు. నేడు పర్మినెంట్‌ కార్మికుల సంఖ్య 12 లక్షలకు పడిపోయింది. వీరిలో 6 లక్షల మంది కాంట్రాక్ట్‌ కార్మికులే. గతంలో 8,417 రైల్వే ట్రాక్‌లు వుండగా, నేడు 12,734కు పెరిగాయి. ట్రాక్‌ మెయిన్‌టెనెన్స్‌, సిగలింగ్‌ లాంటి కీలక భద్రత విభాగాల్లో కూడా పర్మినెంట్‌ పోస్టులను కేంద్ర ప్రభుత్వం భర్తీ చేయడం లేదు. 1.7 లక్షల భద్రత పోస్టులు నేడు రైల్వేల్లో ఖాళీగా ఉన్నాయి. కంట్రోల్‌ ఆఫ్‌ ఆడిటింగ్‌ జనరల్‌ (కాగ్‌) నివేదిక ప్రకారం రైల్వే భద్రతా నిధులను పక్కదారి పట్టించా రని రైల్వే డిపార్ట్‌మెంట్‌పై కాగ్‌ అక్షింతలు వేసింది. అయినా రైల్వే తన తీరు మార్చుకోక పోవడం విచారకరం.
           గతంలో 50 కిలోమీటర్ల స్పీడుతో పరిగెత్తే రైళ్లు నేడు 130 కిలోమీటర్ల వేగంతో పరుగెడుతున్నాయి. కానీ స్పీడుకు తగిన విధంగా రైల్వే ట్రాక్‌ నిర్వహణ లేదు. కాంట్రాక్టర్లు తూ.తూ. మంత్రంగా మెయిన్‌టెనెన్స్‌ చేస్తున్నారు. మనుషులకు బదులు యాంత్రీకరణ శరవేగంగా పెరిగింది. సాంకేతిక అభివృద్ధి కారణంగా బుల్లెట్‌ ట్రైన్లు, వందేభారత్‌లు ప్రవేశపెడుతున్నామని కేంద్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటున్నది. ప్రతి వందేభారత్‌ ట్రైన్‌ను ప్రధానమంత్రే ఆన్‌లైన్‌లో ప్రారంభోత్సవం చేస్తున్నారు. అదే సమయంలో పెరుగుతున్న సాంకేతిక నైపుణ్యానికి తగినట్లుగా లోకో పైలెట్లకు శిక్షణ ఇవ్వడం లేదు. వాల్తేరు డివిజన్‌లో ఒక్కరోజు మాత్రమే ట్రైనింగ్‌ ఇస్తారు.
           కంటకాపల్లి ప్రమాదంలో రాయగడ పాసింజర్‌ లోకో పైలెట్‌కు ఒక్కరోజు కూడా శిక్షణ ఇవ్వలేదు. దక్షిణ రైల్వేలో మూడు రోజులు ట్రైనింగ్‌ ఇస్తారు. మూడు రోజులు కూడా ఏ మాత్రం చాలవని లోకో పైలెట్లు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ప్రాథమిక ట్రైనింగ్‌ రెండు సంవత్సరాలు ఉండేది. నేడు ఒక సంవత్సరానికి తగ్గించారు. ట్రైనింగ్‌ లేకుండా నేను పని చేయనని ''ఎస్పీ మౌర్యా'' అనే లోకో పైలెట్‌ యాజమాన్యానికి లేఖ పెట్టాడు. యాజమాన్యం అతన్ని 118 రోజులు సస్పెన్షన్‌లో ఉంచి తర్వాత ఉద్యోగం నుండి తొలగించింది. యాజమాన్యం ఇటువంటి కక్షపూరిత చర్యలకు పాల్పడుతున్నది. లోకో పైలెట్లను బెదిరించి పని చేయిస్తున్నది. ఏదైనా ఒక ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగితే పై అధికారులు, సూపర్‌వైజర్లు వెంటనే జోక్యం చేసుకుని తక్షణ చర్యలు చేపబడతారు. కానీ రైలు నడిపే లోకో పైలెట్‌కు అటువంటి సహాయం ఏమీ ఉండదు. తగినంత సిబ్బంది లేరనే పేరుతో ట్రైనింగ్‌ కుదించడం ప్రభుత్వ తీవ్ర తప్పిదం. లోకో పైలెట్లు 14 గంటల నుండి 26 గంటల వరకు డ్యూటీలో ఉంటున్నారని ప్రభుత్వ గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఈస్ట్‌కోస్ట్‌ రైల్వేలో 40 శాతం మంది లోకో పైలెెట్లు 14 గంటలు డ్యూటీ చేస్తున్నారని యాజమాన్యమే ప్రకటించింది. సెల్‌ఫోన్‌లో యాజమాన్యానికి నిరంతరం అందుబాటులో ఉండాలి. ఎప్పుడు డ్యూటీకి రమ్మంటే అప్పుడు పరుగులు తీయాలి. ఇంత పని ఒత్తిడిలో లోకో పైలెట్లతో ఎక్కువ పని గంటలు చేయించడం సరైన పద్ధతి కాదు. భద్రత, ప్రాధాన్యత పక్కన పెట్టి అన్ని పనులు కాంట్రాక్టర్లకు అప్పగించడం వల్ల భద్రత మంటగలిసిపోతున్నది.
            భారతదేశ రవాణా రంగంలో రైల్వేలు అద్వితీయమైన పాత్ర పోషించాయి. ప్రపంచంలోనే అతి చౌకగా ప్రయాణికులను గమ్యాలకు చేరవేస్తున్నాయి. సరుకుల రవాణాలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రజల ప్రయాణంలో 47 శాతం రాయితీలిస్తున్నాయి. ఇప్పటి వరకు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఉంది. సామాన్యులకు అందుబాటులో ఉన్న పాసింజర్‌ రైళ్లు ఎత్తేయడం, చిన్న స్టేషన్లు మూసేయడం, వృద్ధుల రాయితీ తీసివేయడం, లాభాల కోసమే రైళ్లను నడపడం...నేడు కేంద్ర ప్రభుత్వ లక్ష్యంగా మారింది. లాభాలే పరమావధిగా మారాయి. దీనిలో భాగంగానే భద్రత కూడా తీవ్రంగా లోపించింది. దేశంలో 400 రైల్వే స్టేషన్లను, దాని చుట్టూ ఉన్న లక్షల కోట్ల విలువ చేసే స్థలాలను కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నం పూర్తిగా సఫలం కాలేదు. దీనితో రైల్వేలను ముక్కలు ముక్కలుగా చేసి ''నేషనల్‌ మోనిటైజేషన్‌ ఆఫ్‌ పైప్‌లైన్‌'' పేరుతో అనేక విభాగాలను కార్పొరేట్లకు ఇవ్వడానికి ప్రయత్నిస్తోంది. ప్రైవేట్‌కు ఇచ్చే ముందు బడ్జెట్‌లో రూ.లక్షల కోట్లు రైల్వేలకు కేటాయించి వారికి అప్పగించడం అన్యాయం. రైల్వేలను అంతర్జాతీయ స్థాయికి అభివృద్ధి చేస్తామని చెబుతూ రైల్వేస్టేషన్లలో పాసింజర్లు 5 నిమిషాల కంటే అదనంగా నుంచోవడానికి కూడా రాబోయే కాలంలో నిరాకరిస్తారు. ఆటోలు, ప్రైవేట్‌ టాక్సీలతో సహా రైల్వేస్టేషన్లలో ఉండటానికి అనుమతించరు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్లలో గంట దాటితే కారుకు రూ.500 వసూలు చేస్తున్నారు. ప్లాట్‌ఫారమ్‌ టికెట్‌ రేట్లు ఆకాశాన్నంటుతాయి. రానున్న కాలంలో ఇలాంటి మార్పులెన్నో రానున్నాయి. అన్నింటిని మించి భద్రతా చర్యలు అభివృద్ధి కావాలి. ప్రాణ భయంతో రైలెక్కే పరిస్థితి ఉండరాదు. కేంద్ర ప్రభుత్వ విధానాలు మారినప్పుడే అది సాధ్యం.

/ వ్యాసకర్త సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి /
సి.హెచ్‌.నర్సింగరావు

narsingarao