Nov 12,2023 07:20

            'చీకటి వెలుగుల రంగేళీ/ జీవితమే ఒక దీపావళి/ మన జీవితమే ఒక దీపావళి/ అందాల ప్రమిదల/ ఆనంద జ్యోతుల/ ఆశలు వెలిగించు దీపాలవెల్లి' అంటాడు సినీకవి ఆత్రేయ. ఆబాలగోపాలాన్ని అలరించే ఈ పాట దీపావళిని మన కళ్లముందు ఆవిష్కరింపజేస్తుంది. జీవితమంటే వెలుగు మాత్రమే కాదు...చీకటి కూడా వుంటుందని బోధిస్తుంది. చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా కూడా దీపావళి నిలుస్తుంది. అలాగే...చీకటి తర్వాత వెలుగు తప్పక వస్తుందన్న ఆశలను కళ్లలో మతాబుల్లా వెలిగిస్తుంది. మిరుమిట్లు గొలిపే దీపకాంతుల ఆనందహేళి... సామరస్యతకు ప్రతీక... ఈ వెలుగుల దీపావళి. దీపావళి అంటే- దీపాల వరుస అని అర్థం. శోభాయమానంగా వెలిగే ప్రమిదల వరుసలు, చిటపటమంటూ వెలుగులు చిమ్మే కాకర పువ్వొత్తులు, తెల్లని కాంతులు వెదజల్లే మతాబులు... ఎన్నెన్ని వెలుగులో... జన జాగృతిని చైతన్యవంతం చేసే ఎన్నెన్ని కాంతులో ఈ దీపావళిని జనరంజకం చేస్తాయి. అసలు భారతీయ సంస్కృతిలోనే పండుగలకు ఒక ప్రత్యేకత వుంది. ప్రజల జీవన విధానంలో యాంత్రికతను పక్కన పెట్టి తమ వారందరితో సంతోషంగా గడపడమనే ప్రక్రియలోనే ఎన్నెన్నో అనుబంధాలు పెనవేసుకొని వుంటాయి. 'దివ్వెల కాంతులు, వెల్గుల భ్రాంతులు, తేజము నిండగ నెల్లెడలన్‌/ రివ్వున జువ్వలు, రవ్వల రువ్వులు, రిక్కలు పొంగగ నింగి పయిన్‌/ దవ్వుల, దాపుల, సవ్వడి, సందడి దద్దరిలంగను నల్దిశలున్‌/ నవ్వుల పువ్వులు, తియ్యని బువ్వలు నల్వురు మెచ్చగ రమ్యముగన్‌' అంటారు కవి మిస్సన్న. మన పండుగల పరమార్థమే... ఎంతో చిక్కని స్నేహభావం. మరెంతో చక్కని లౌకికతత్వం.
            కాలానుగుణంగా వచ్చిన మార్పులు దీపావళి అంటేనే భయపడేలా చేస్తోంది. ఒకప్పుడు దీపావళి అంటే... పర్యావరణహితంగా జరిగేది. ఇప్పుడు ఏటేటా దీపావళి రోజున పరిమితికి మించిన కాలుష్యం వెలువడుతోంది. రెండు గంటలు మాత్రమే టపాసులు కాల్పాలంటూ...తాజాగా సుప్రీంకోర్టు ఆదేశించింది. అయినా పాటిస్తున్న దాఖలాలు ఎక్కడా కనిపించడం లేదు. అర్ధరాత్రి దాటినా టపాసుల మోత దద్దరిల్లిపోతోంది. దీంతో కాలుష్యం తారాస్థాయికి చేరుతోంది. దీపావళి రోజున అతి ప్రమాదకరమైన సూక్ష్మ ధూళి కణాల స్థాయి ఎక్కువగా నమోదవుతోందని పిసిబి నివేదిక చెబుతోంది. భూమి, గాలి, నీరు కలుషితమౌతోందని పర్యావరణవేత్తలు మొత్తుకుంటున్నా... పట్టించుకునేవారే లేరు. అందుకు ప్రతిగా మూల్యం చెల్లించుకునే స్థితికి మనంతట మనమే నెట్టబడ్డాం. దీపావళి రోజునే కాకుండా ఏ సంబరమైనా, సందర్భమైనా నాలుగు టపాసులు కూడా కాల్చలేని విధంగా గాలిని కలుషితం చేసేశాం. ఇప్పటికే ప్రకృతిసిద్ధంగా లభించే నీటిని కొనుక్కునే స్థాయికి దిగజారిపోయాం. ఇప్పుడు ప్రాణాధారమైన గాలిని కూడా కొనుక్కునే పరిస్థితి వస్తే...ఆ ఊహ కూడా ఊపిరి సలపనంత భయాన్ని కలిగిస్తోంది.
           మన చుట్టూ కాలుష్యం కమ్ముకొని వుంది. దేశ రాజధాని నగరమే కాలుష్యంలో మునిగిపోయింది. ప్రాణవాయువును కలుషితం కాకుండా కాపాడుకోవడం ఇప్పుడు మన కర్తవ్యం. టపాసులు పేల్చే ముందు చిన్నారి పిల్లలు, వృద్ధుల గురించి ఆలోచించాలి. శ్వాసకోశ సంబంధిత రుగ్మతలతో బాధపడేవారికే కాదు... మామూలు వారిలోనూ కొన్ని శ్వాస సంబంధమైన సమస్యలు తప్పవంటున్నారు వైద్యులు. గాలి కాలుష్యం కారణంగా గుండె, ఊపిరితిత్తుల సమస్యలతో సంభవించే మరణాలే ఎక్కువవుతాయని వారు చెబుతున్నారు. అందుకే- ఆనందోత్సాహాల సందడిలో... విషాదాన్ని కొని తెచ్చుకోవద్దు. పర్యావరణానికి హాని కలిగించని టపాసులు కూడా వున్నాయి. గ్రీన్‌ క్రాకర్స్‌, మట్టి ప్రమిదలు పర్యావరణానికి ఎలాంటి హానీ కలిగించవు. నువ్వుల నూనె, కొబ్బరి నూనె, నెయ్యి-ఇలా ఏదైనా నూనె పోసి దీపాలు వెలిగించాలి. ఈ దీపకాంతులతో ఇంటిని అలంకరిస్తే... ఇల్లంతా ఆహ్లాదకరంగా వుంటుంది. నూనెతో వెలిగించే దీపాలు చూడటం కూడా కళ్లకు మంచిదని డాక్టర్లు చెబుతుంటారు. అందుకే విద్యుత్‌ దీపాల కంటే నూనె దీపాలు పర్యావరణహితంగా, ఆరోగ్యకరంగా వుంటాయి. వీటివల్ల ఖర్చు తక్కువ... అందం, ఆనందం ఎక్కువ. పైగా పర్యావరణానికి మేలు చేస్తాయి. 'విరిసిన ఆనంద దీపావళి/ మెరిసిన అనురాగ దీపాలివి/ వెతలకు దూరాలు... వెలుగుల తీరాలు/ మమతలు మా యింటి దీపావళి' అంటారో కవి. ఈ దీపావళిని వెతలకు దూరంగా, వెలుగుల తీరంగా, పర్యావరణహితంగా మార్చుకోవాలి. భవిష్యత్తరాలకు కాలుష్య రహిత ఆనందాల దీపావళిని అందించాలి.