విశ్వ దయాగుణోద్యమంలో భాగంగా ప్రతి సంవత్సరం నవంబర్ 13న ప్రపంచ దయాగుణ దినాన్ని జరుపుకుంటున్నాం. మానవీయ విలువల్ని పెంపొందించుకోవడానికి ప్రేమ, సౌహార్ద్రాలతో మానవ జీవనం మనుగడ సాగించడానికి, ఒకరి పట్ల ఒకరికి గల గౌరవాన్ని, బాధ్యతను తెలుపుకోవడానికి ఈ రోజును జరుపుకుంటున్నాం. ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య మాత్రమే కాదు, జాతుల మధ్య, సమాజాల మధ్య, ప్రాంతాల మధ్య, దేశాల మధ్య కూడా వెల్లివిరియాలని. 'వసుదైక కుటుంబకం' అనే భావన అన్ని రకాలుగా, అన్ని స్థాయిల్లో ఏర్పడాలనీ - అంతకు ముందు ఏర్పడింది వర్థిల్లుతూ ఉండాలనీ ఒక ఆకాంక్షతో, ప్రపంచ పౌరులు ఈ రోజును జరుపుకుంటున్నారు.
దయాగుణాన్ని మించిన విజ్ఞత మరొకటి లేదు. దయాగుణమనేది ఒక గొప్ప కానుక. అది ఉచితంగా ఇవ్వగలిగేది. దాన్ని తప్పకుండా పంచుతూ పోవాలి. ఎదుటివాళ్లు ఎవరూ అని చూడకుండా, తిరిగి వాళ్లు మనకేమివ్వగలరని చూడకుండా, ఇతరులకు ఇస్తూ ఉండడమే దయాగుణం! అలాంటి వారి దగ్గర ఉన్న దయా ధనం ఎన్నటికీ తరిగిపోదు. ఇతరులకు ఇచ్చి పేదవాడై పోయినవాడు, చితికిపోయినవాడు, చెడిపోయినవాడు లేడు. దయలోంచి వచ్చిన ప్రేమతో చెప్పిన చిన్న మాటయినా సరే, ఎదుటి వారి జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తుంది. ఒక్కోసారి మార్చేస్తుంది కూడా! దయతో చేసే చిన్న సహాయమైనా సరే, దానికి ప్రేమను జత చేస్తే - ఆ సహాయం విలువ ఎన్నో రెట్లు పెరుగుతుంది.
మనమంతా ఒక్కటే అన్న భావన ఉన్నప్పుడే పైవన్నీ జరుగుతాయి. మనుషుల్లో స్థాయీ భేదాలు లేవు. అందరం ఒక్కటే అన్నది ఆధునిక జన్యు శాస్త్రం చెప్పింది. ఇందులో ఏ ఒక్క విషయమూ దేనికదే విడిగా ఉండదు. ఎందుకంటే అన్నీ ఒక దానితో ఒకటి అంతర్గతంగా పెనవేసుకుని ఉన్న విషయాలు. మంచితనం లేకపోతే దయాగుణం ఉండదు. మంచివాడు కాగానే సరిపోదు. అతడు జ్ఞానవంతుడైనపుడే సమాజానికి ఉపయోగపడతాడు. అజ్ఞానిగా ఉన్నవాడికి ఏది మంచో ఏది చెడో తెలియదు. దయ ఎప్పుడు ఎవరి మీద చూపాలో తెలియదు. ఇలా ఒక దగ్గర కదిలిస్తే తీగంతా కదులుతుంది. ఆరోగ్యవంతమైన, ఆనందకరమైన, ప్రపంచం వర్థిల్లాలంటే ముందు వైజ్ఞానిక దృక్పథం అవసరం. అది నిండుగా ఉన్నవాడే విశ్వ మానవుడవుతాడు. అలా అయినప్పుడే వ్యక్తుల నుండి దేశాల దాకా ఆ స్థాయిలో చేయవల్సిన పనులు ఏమిటన్నది నిర్ణయించుకోగలడు.
దయను చూపించు (బి కైండ్) అని ఏడాదికి ఒక్కరోజు ప్లకార్డులు పట్టుకుని రోడ్ల మీద తిరగడం కాదు. జాతుల మధ్య వైరాల్ని, దేశాల మధ్య యుద్ధాల్ని ఆపడానికి చేయాల్సిన కార్యక్రమాలేవో ఆలోచించుకోవడానికి, చర్చించుకోవడానికి, సరైన నిర్ణయాలు తీసుకోవడానికి, వాటిని ఆచరించడానికి ఈ వరల్డ్ కైండ్‌నెస్ డే స్ఫూర్తినివ్వాలి! కుల మతాల, జాతుల, ప్రాంతీయ హద్దుల్ని, రాజకీయ విభేదాల్ని, దేశాల సరిహద్దుల్ని దాటి-విశ్వ జనులందరూ ఒక సదభిప్రాయ సోదరత్వ భావనకు రావడానికి ఈ 'వరల్డ్ కైండ్ నెస్ డే' తోడ్పడాలి! మంచి కృషిని అభినందించడానికి, మంచి అవగాహనను పెంచడానికి, మానవాళిని ఒక దయాగుణంతో ఐక్యం చేయడానికి. ప్రపంచ వ్యాప్తంగా మానవుల స్థితిగతుల్ని మెరుగుపరచడానికి 'వరల్డ్ కైండ్‌నెస్ డే' జరుపుకుంటూ ఉండాలి!!
ఆ రోజు ఏం చేస్తున్నారంటే-పరిచయం ఉన్నా లేకపోయినా అందరితో చేతులు కలిపి 'హేపీ కైండ్‌నెస్ డే'-అని చెప్పుకోవడం. ఒకరికి ఒకరు పసుపు పచ్చని పూలు ఇచ్చుకోవడం. దగ్గరికి తీసుకుని హత్తుకోవడం చేస్తున్నారు. దయాగుణం ఇతి వృత్తంగా కొన్ని దేశాల్లో సంగీత కచేరీలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు ప్రత్యేకత గురించి ఎన్నో దేశాల్లో ఉపన్యాసాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రియమైన వారి దగ్గరికెళ్ళి వారి వల్ల తమ జీవితమెంత ఉత్తేజితమైందో సౌమ్యంగా చెప్పుకుంటారు. లేదా ఒక మెసేజ్/ఇ-మెయిల్ పంపుకుంటారు. అందుబాటులో ఉంటే వారి కంప్యూటర్ స్క్రీన్ మీద గాని, వారి కారు ముందు అద్దం మీద గానీ మంచి సందేశం-కామెంట్ పెడతారు. ఇవన్నీ ఎందుకంటే స్నేహబంధాల్ని, బాంధవ్యాల్ని మరింత లోతుగా పటిష్ట పరుచుకోవడానికే-ఇలాంటి ప్రయత్నాలు సంఘాల మధ్య, సమాజాల మధ్య, దేశాల మధ్య కూడా జరుగుతున్నాయి. అవి ఇంకా జరగాలి. అప్పుడే 'వరల్డ్ కైండ్‌నెస్ డే' సార్థకమౌతుంది.
ఇవన్నీ కాకుండా పాఠశాల, కళాశాల పిల్లలకు - సహాయం చేయడం గురించి, దయ చూపించడం గురించి బోధిస్తున్నారు. ఆ లేత మనసుల్ని మంచి ఆలోచనలతో నింపుతున్నారు. దగా, మోసం వంటి వాటిని అణిచిపెట్టి దయ, సానుభూతి, సహకారం వంటి వాటిని పిల్లల మనసుల్లో నాటుకునేట్లు చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. పిల్లల పట్ల శ్రద్ధ చూపే ఈ కార్యక్రమాలకు ఎన్‌జిఓలు, ప్రయివేట్ సంస్థలు, ప్రభుత్వ యంత్రాంగాలు అన్నీ కొన్ని దేశాలలోనైతే చాలా చురుకుగా పాల్గొంటున్నాయి. సంప్రదాయాల పేరుతో అబద్దాల కట్టుకథల ఆధారంగా చేసుకునే పండగలు మానెయ్యాలి. వాస్తవాలేమిటో, నిజాలేమిటో తెలుసుకోగలగాలి. మనిషి కేంద్రంగా అతడు సాధించిన ఘన విజయాల్ని నెమరువేసుకోవాలి! ఆధునిక జీవితానికి దోహదపడే విధంగా సమాంతర వేడుకలకు, ఉత్సవాలకు రూపకల్పన చేసుకోవాలి! పాత నిర్వచనాల్ని మార్చుకోవాలి!!
దయా గుణానికున్న ఔన్నత్యాన్ని భ్రమల్లో, కల్పితాల్లో ద్విగుణీకృతం చేసుకున్నంత మాత్రాన సమాజంలో మార్పు రాదు. వాస్తవ జగత్తులో ప్రత్యక్షంగా దాన్ని అనుభవంలోకి తెచ్చినపుడే సమాజ స్వరూపం మారుతుంది. జీవిత మంటే నటిస్తూ వినోదం అందించే నాటకమో, సినిమానో, టీవీ సీరియలో కాదు. జీవితం ఉన్నది జీవించడానికి! జీవితంలో ఉండాల్సినవి నిజం, నిబద్దత, ప్రేమ, ఆప్యాయత, సహనం, సహకారం-మనసు లోతుల్లో దయా గుణం లేకపోతే ఇవేవీ ఉండవు.
సుప్రసిద్ధ సాహితీవేత్త, విశ్రాంత బయాలజీ ప్రొఫెసర్
(మెల్బోర్న్ నుంచి)
డా|| దేవరాజు మహారాజు