ప్రపంచంలోనే అత్యధిక మంది క్షయ (టి.బి) వ్యాధిగ్రస్థులున్న దేశంగా భారత్ మరో అపఖ్యాతిని మూటగట్టుకుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) ఈ నెల 8న విడుదల చేసిన టి.బి నివేదికలో పలు దిగ్భ్రాంతికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ప్రపంచంలోని మొత్తం టి.బి వ్యాధిగ్రస్థుల్లో నాలుగో వంతు మంది (27 శాతం) భారత్‌లోనే ఉన్నట్లు తేల్చింది. 2022లో దేశంలో 28.2 లక్షల టి.బి కేసులు వెలుగుచూశాయి. 192 దేశాల్లో సేకరించిన డేటా ప్రకారం...2022లో ప్రపంచవ్యాప్తంగా 75 లక్షల మంది టి.బి బారిన పడ్డారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ టి.బి కేసుల మానిటరింగ్ చేపట్టిన తొలి ఏడాది 1995 నుంచి చూస్తే అత్యధిక మంది క్షయ బారిన పడిన సంవత్సరంగా 2022 రికార్డులకెక్కింది. గత రెండు దశాబ్దాలతో పోలిస్తే అనేక దేశాల్లో టి.బి కేసుల సంఖ్య ప్రతి యేటా 2 శాతం చొప్పున తగ్గుతూ వస్తుండగా ప్రపంచం మొత్తం మీద మాత్రం 3.9 చొప్పున పెరుగుతున్నాయి. అత్యధిక టి.బి కేసులున్న దేశాల్లో మన తర్వాత ఇండోనేషియా (పది శాతం), చైనా (7.1 శాతం), ఫిలిప్పీన్స్ (7 శాతం), పాకిస్తాన్ (5.7 శాతం), నైజీరియా (4.5 శాతం), బంగ్లాదేశ్ (3.6 శాతం), కాంగో (3 శాతం) నిలిచాయి. ప్రపంచంలోనే ఆర్థికంగా అత్యంత శక్తివంతమైన దేశాల సరసన భారత్‌ను నిలుపుతున్నామని గొప్పలు చెబుతున్న పాలకులు ఇరుగుపొరుగునున్న పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశాల వంటి మనకంటే పేద దేశాల్లో పరిస్థితి మెరుగ్గా ఉండటం సిగ్గుపడాల్సిన అంశం. 2022లో 28.2 లక్షల టి.బి కేసులుంటే 3.42 లక్షల మంది క్షయ బారిన పడి తనువు చాలించారు. దేశంలో మరో ఆందోళనకర అంశం మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ (ఎండిఆర్) టి.బి కేసులు 1.1 లక్షలున్నాయి. ఎండిఆర్ కేసులు అధికంగా ఉండటమంటే అది ప్రజారోగ్య సంక్షోభానికి ప్రతిబింబమని డబ్ల్యుహెచ్‌ఓ తన నివేదికలోనే హెచ్చరించడం గమనార్హం. మలేరియా, కుష్టు, క్షయ వంటి ప్రమాదకర వ్యాధుల నిర్మూలనకు భారీ స్థాయిలో టీకాల కార్యక్రమాన్ని చేపట్టామంటూ ప్రచార బాకాలూదుతున్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ డొల్లతనాన్ని డబ్ల్యుహెచ్‌ఓ నివేదిక బట్టబయలు చేస్తోంది. వాస్తవానికి కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అంతర్జాతీయంగా భారత ఆర్థిక, ఆరోగ్య స్థితిగతులపై అపఖ్యాతి మూటగట్టుకుంటూనే వుంది. పేదరికం, నిరుద్యోగం, ఆనారోగ్యం ఇలా..ఏ అంశాన్ని తీసుకున్నా ఇరుగుపొరుగు దేశాల కంటే భారత్ అధ్వానమైన స్థితిలో ఉందంటూ ప్రతిష్టాత్మక సంస్థల అధ్యయన నివేదికలు పేర్కొంటున్నాయి. అయినప్పటికీ పాలకుల్లో చలనం లేదు. పచ్చి అబద్దాలతో, ప్రచార్భాటాలతో మసిపూసి మారేడుకాయ చేసి ప్రజలను మభ్యపెడుతున్నారు.
వాడుక భాషలో టి.బి గా పిలిచే క్షయ వ్యాధి ట్యుబర్‌క్యులోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల సంభవిస్తుంది. ఇది ప్రధానంగా ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుంది. కానీ మెదడు, మూత్రపిండాలు, వెన్నెముక వంటి శరీరంలోని ఇతర భాగాలపైనా తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రభుత్వాలు కేసుల నమోదుకు లక్ష్యాలను నిర్దేశించి చేతులు దులిపేసుకుంటుండంతో చాప కింద నీరులా ఈ వ్యాధి విజృంభిస్తూనే వుంది. పొగ, గుట్కా, మద్యపాన అలవాట్లతో రోగ నిరోధక శక్తి తగ్గించుకుంటూ టి.బి బారిన పడుతున్నవారు కొందరైతే..వ్యాధి సోకినా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా మరొకరికి వ్యాప్తి చేస్తున్నవారు మరికొందరు. ఇదంతా అవగాహనాలేమితో జరుగుతున్న దారుణం. క్షయ వ్యాధి ప్రాణాంతకమైన వ్యాధి అయినా కూడా సరైన సమయంలో గుర్తించి పోషకాహారం తీసుకొంటూ మందులు వాడితే నివారణ సాధ్యమే. కానీ ప్రపంచ ఆకలి సూచీలో అట్టడుగునున్న భారత్‌లో పోషకాహారం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. క్షయ వ్యాధిగ్రస్థులకు నెలకు రూ.500 చొప్పున పోషకాహారం కోసం విదిలిస్తున్నారు. దీంతో ఆ డబ్బు చాలక, క్షయ వ్యాధిని లెక్క చేయక బతుకు జీవుడా అంటూ నిరుపేదలు పనులకు వెళ్తున్నారు. అలా వెళ్లినవారితో అది మరింత మందికి వ్యాప్తి చెందుతోందన్నది ఆరోగ్య నిపుణుల విశ్లేషణ. పాలకులు ఇప్పటికైనా కేసుల గుర్తింపు చర్యలను ముమ్మరం చేసి, వ్యాధిగ్రస్థులకు సంపూర్ణ పోషకాహారం అందించే వేతన భృతి కల్పించి మెరుగైన వైద్య సేవలందించడమే క్షయ నివారణకు మార్గం.