'బ్యాంక్ ఆఫ్ బరోడా' ఇటీవల తన యాప్‌కు కస్టమర్ల ఖాతాలను జోడించేందకుగాను సిబ్బందికి టార్గెట్లు ఇచ్చింది. సిబ్బంది అప్పుడు కస్టమర్ల ఫోన్ నెంబర్లకు బదులుగా వేరే నెంబర్లను జత చేశారు. ఫలితంగా ఖాతాదారులకు తెలియకుండానే వారి డబ్బు మాయమైంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోకి ప్రైవేటు రంగ సంస్కృతిని ప్రవేశపెట్టటం దీనికి కారణం.
ప్రభుత్వ రంగ సంస్థలను జవహర్‌లాల్ నెహ్రూ ఆధునిక దేవాలయాలుగా పేర్కొన్నారు. తమ యజమానుల లాభాల కోసం మాత్రమే పనిచేస్తున్న 14 ప్రైవేటు బ్యాంకులను ఇందిరా గాంధీ 1969లో జాతీయం చేశారు. ఆ తరువాత మరో 8 ప్రైవేటు బ్యాంకులు 1980లో జాతీయం అయ్యాయి. జాతీయీకరణ వలన ప్రజల పొదుపు దేశ ప్రణాళికలకు, అభివృద్ధికి ఉపయోగపడింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు వెనుకబడిన ప్రాంతాలకు, మారుమూల గ్రామాలకు విస్తరించాయి. లక్షలాది మందికి వీటిలో ఉద్యోగాలు వచ్చాయి. బలహీన వర్గాలకు కూడా వీటిలో సేవలు అందాయి.
సరళీకరణ విధానాల ప్రవేశంతో...
సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ విధానాలు వచ్చిన తదుపరి ప్రజావ్యతిరేక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రభుత్వ రంగాన్ని బలహీనపర్చడం మొదలైంది. ప్రత్యేకించి ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఫైనాన్స్ రంగంపై పెద్ద ఎత్తున దాడి జరుగుతోంది. ప్రపంచ ఫైనాన్స్ పెట్టుబడుల సిఫార్సులను ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో అమలు చేస్తున్నారు. మొండి బకాయిలకు తగినంత స్థాయిలో పెట్టుబడులను పెంచుకోవాలనే నిబంధనలను ప్రవేశపెట్టారు. కానీ పశ్చిమ దేశాలలో ఇటువంటి నిబంధనలను అమలు చేస్తున్నప్పటికీ అక్కడి బ్యాంకులు విఫలం అవుతున్నాయనే వాస్తవాన్ని విస్మరించి ఇక్కడి బ్యాంకుల్లో వాటిని ప్రవేశపెట్టారు. బడా కార్పొరేట్ కంపెనీలు ఎగ్గొట్టిన బకాయిల స్థానంలోకి బ్యాంకుల లాభాలను, పెట్టుబడులను మళ్ళిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ బ్యాంకులకు అవసరమైన పెట్టుబడులను బడ్జెట్ నుండి సమకూర్చటం మానేసింది. మార్కెట్ నుండి సమీకరించుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాలు ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణకు దారితీస్తోంది. దేశంలో పోటీని ప్రోత్సహించాలనే పేరుతో వాణిజ్య బ్యాంకులు, చెల్లింపు బ్యాంకులు, చిన్న చిన్న ఫైనాన్స్ బ్యాంకులకు లైసెన్స్‌లను విచ్చలవిడిగా ప్రైవేటు పెట్టుబడులకు ఇచ్చారు. వివిధ రంగాల అభివృద్ధి కోసం ప్రభుత్వ రంగంలో అభివృద్ధి బ్యాంకులను ఏర్పాటుచేశారు. తదుపరి కాలంలో వాటిని మూసివేసి వాటి వ్యాపారాలను ప్రైవేటు వాణిజ్య బ్యాంకులకు బదిలీ చేశారు. మౌళిక రంగాలకు ఇచ్చే దీర్ఘకాలిక రుణాల భారాన్ని ప్రభుత్వ రంగ వాణిజ్య బ్యాంకులపై మోపారు. బడా పెట్టుబడిదారులు దీంతో లాభపడి బ్యాంకు రుణాలను ఎగ్గొట్టారు. నష్టం ప్రభుత్వ బ్యాంకులకి, లాభం ప్రైవేటు కార్పొరేట్ కంపెనీలకుగా మారింది.
కేంద్ర ప్రభుత్వ సంస్కరణల ఎజెండాను ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రవేశపెట్టారు. ఖర్చులు తగ్గించుకోవాలని, లాభాలు పెంచుకోవాలని నూరిపోశారు. లక్షలాది మంది బ్యాంకు అధికారులు, ఉద్యోగులను విఆర్‌ఎస్ పై బయటికి పంపారు. నష్టాలు వస్తున్నాయనే పేరుతో బ్యాంకు శాఖలను మూసి వేస్తున్నారు. బ్యాంకులను విలీనం చేయటం వలన కూడా శాఖలు మూత పడుతున్నాయి. కొద్ది మంది సిబ్బంది అధిక పని భారాన్ని మోస్తున్నారు. బ్యాంకుల వ్యాపారాభివృద్ధికి తమ అధికారులు, సిబ్బంది, ఎగ్జిక్యూటివ్‌లను ఉపయోగించు కోకుండా ప్రైవేటు కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులను నియమిస్తున్నారు. వారికి బ్యాంకు నిధులను దోచిపెడుతున్నారు. వ్యాపారం, లాభాల విషయంలో సాధించలేని టార్గెట్ల భారాన్ని బహుళజాతి కంపెనీల ప్రైవేటు కన్సల్టెంట్లు మోపుతూ వాటిని సాధించాలని ఒత్తిడి తెస్తున్నారు. వీరు చేస్తున్న ప్రతిపాదనలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయి.
ఇటువంటి ప్రజా వ్యతిరేక సంస్కృతికి మారటానికి ప్రభుత్వ రంగ బ్యాంకుల చైర్మన్లతో సహా పూర్తికాలం డైరెక్టర్లను ప్రౖౖెవేటు రంగం నుండి నియమించుకోవడం కారణం. బ్యాంకుల సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల స్థానాలలోకి కూడా వీరు ప్రవేశిస్తున్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడాలో ముఖ్య డిజిటల్ అధికారిగా నియమితులైన ప్రైవేటు వ్యక్తిగత కన్సల్టెంట్ అఖిల్ హాండాను బాధ్యతల నుండి తొలగించమని బ్యాంకులోని అన్ని యూనియన్ల జాయింట్ కౌన్సిల్ బ్యాంకు ఎమ్‌డీని డిమాండ్ చేసింది. వివిధ స్థాయిలలో ఉన్న బ్యాంక్ నియంత్రణా అధికారులను కూడా కాదని ఆయన తన వ్యక్తిగతంగా టార్గెట్లను విధించి శాఖల చేత బలవంతంగా అమలు చేయించటంతో బ్యాంక్ ఆఫ్ బరోడాలో విపత్కర పరిణామాలు చోటుచేసుకున్నాయి.
బ్యాంక్ ఆఫ్ బరోడా జి.ఎంలు, ఎ.జి.ఎంలతో సహా అనేక మంది సీనియర్ అధికారులను, బిజినెస్ కరస్పాండెంట్లను, కన్సల్టెంట్లను కూడా సస్పెండ్ చేశారు. బ్యాంక్ యాప్ లోకి కొత్త కష్టమర్లను కలిపే పద్ధతిలో అవకతవకలు చోటుచేసుకున్నాయని బ్యాంకు అంతర్గత సమీక్షలో తేలింది.
తప్పనిసరి పరిస్థితుల్లో ముఖ్య డిజిటల్ అధికారి (ప్రైవేటు రంగం నుండి వచ్చిన) చేత బలవంతంగా రాజీనామా చేయించారు. కానీ ఆయన చేసినటువంటి హాని వెంటనే పూడ్చలేనిది. ఇటువంటి పరిణామాలు బ్యాంక్ ఆఫ్ బరోడాకు మాత్రమే పరిమితం కాలేదు. ఇతర అనేక ప్రభుత్వ రంగ బ్యాంకులలో కూడా ఇటువంటి పద్ధతులు అమలవుతున్నాయి. వీటిపై రిజర్వ్ బ్యాంకు విచారణ జరిపి నష్ట నివారణ చర్యలు చేపట్టాలి. కేంద్ర బిజేపి ప్రభుత్వం తన ప్రైవేట్ కార్పొరేట్ పెట్టుబడుల అనుకూల వినాశకర విధానాలకు స్వస్తి చెప్పాలి. ప్రజల పొదుపుకు భద్రత కల్పించాలి.
('బ్యాంక్ వర్కర్స్ యూనిటీ' సౌజన్యంతో)
/స్వేచ్ఛానుసరణ/