గత 4 దశాబ్దాలుగా రైతు సంఘాలు, గిరిజన సంఘాలు, ప్రజాసంఘాలు వరికపూడిశెల కోసం అనేక ఉద్యమాలు నిర్వహించాయి. యాత్రలు చేశాయి. చాలా సంవత్సరాలపాటు పల్నాడు ప్రాంతంలో ఉన్న కక్షలు, కార్పణ్యాల వల్ల ఈ డిమాండ్ ముందుకు వెళ్లలేదు. వామపక్ష పార్టీలు, రైతు సంఘాలు ప్రత్యేక కృషి చేస్తూ ఇప్పటికే అనేక ఉద్యమాలు, రౌండ్ టేబుల్స్ నిర్వహించాయి. ఈ ప్రాంత ప్రజలు, మేధావులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, గిరిజన సంఘాల నాయకులు వేల సంఖ్యలో వరికపూడిశెల ప్రాజెక్ట్ నిర్మాణం జరగాలని కోరుతూ ఉద్యమాలకు మద్దతు తెలుపుతున్నారు. 20 ఏళ్ల వయస్సు నుండి ఈ ఉద్యమంలో పాల్గొంటున్న వారికి ఇప్పుడు 60 ఏళ్లు దాటిపోయాయి. 'మా జీవిత కాలంలో వరికపూడిశెల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను చూడగలమా?' అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చరిత్ర ప్రసిద్ధి చెందిన పల్నాడు ప్రాంతం ...నేడు ఆర్థిక, సామాజిక జీవన ప్రమాణాలలో, మానవాభివృద్ధిలో ఎంతో వెనకబడి ఉన్నది. అక్షరాస్యత, విద్య, ఆరోగ్య సదుపాయాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. దగ్గరలోనే నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఉన్నప్పటికీ పల్నాడులో అనేక ప్రాంతాలు, మండలాలు సాగు నీరు, తాగు నీరుకు సంబంధించి తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నాయి. గిరిజన ప్రాంతాలు భూగర్భ జలాలపై ఆధారపడి, ప్రస్తుతం 1500 నుండి 2000 అడుగుల వరకు బోర్లు వేసినప్పటికి నీరు అందటం లేదు. బోర్లు వేసిన రైతులు అప్పుల పాలై దివాళా తీస్తున్నారు. అనేక ప్రాంతాల్లో తాగునీటిలో ఫ్లోరైడ్ శాతం ఎక్కువగా ఉండి శ్వాసకోశ వ్యాధులు, లివర్ వ్యాధులు, కిడ్నీ జబ్బులతో వేలాది మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. స్త్రీలు గర్భసంచికి సంబంధించిన వ్యాధుల బారినపడి, ఆసుపత్రులకు వెళ్లి, అప్పుల పాలవుతున్నారు. యుద్ధప్రాతిపదికన నీరు అందించవలసిన ఈ ప్రాంతాలు నిర్లక్ష్యానికి గురయ్యాయి.
వరికపూడిశెల ప్రాజెక్టు
వరికపూడిశెల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు గత 5 దశాబ్దాలుగా పల్నాడు ప్రజల స్వప్నంగా ఉన్నది. ఈ ప్రాజెక్ట్ పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గంగల కుంట, వజ్రాలంపాడు తండా సమీపంలో వుంది. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ వల్ల సుమారు 1,20,000 ఎకరాలకు సాగు నీరు, 100 గ్రామాలకు పైగా తాగునీరు అందుతుంది. దీని ద్వారా పల్నాడు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గంలో వెల్దుర్తి, దుర్గి మండలాలు, వినుకొండ నియోజకవర్గంలో బొల్లాపల్లి, ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గంలో పుల్లలచెరువు పూర్తిగా లబ్ధి పొందుతాయి. బొల్లాపల్లి మండలంలో గిరిజన తండాలు తాగు నీరు కూడా లేక ఎదుర్కొంటున్న ఇబ్బందులు వర్ణనాతీతం. ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ ప్రాంత ప్రజలు 1985 నుంచి ఈ ప్రాజెక్టు కోసం కృషి చేస్తున్నారు.
అనేక ఉద్యమాలు...
గత 4 దశాబ్దాలుగా రైతు సంఘాలు, గిరిజన సంఘాలు, ప్రజాసంఘాలు వరికపూడిశెల కోసం అనేక ఉద్యమాలు నిర్వహించాయి. యాత్రలు చేశాయి. చాలా సంవత్సరాలపాటు పల్నాడు ప్రాంతంలో ఉన్న కక్షలు, కార్పణ్యాల వల్ల ఈ డిమాండ్ ముందుకు వెళ్లలేదు. వామపక్ష పార్టీలు, రైతు సంఘాలు ప్రత్యేక కృషి చేస్తూ ఇప్పటికే అనేక ఉద్యమాలు, రౌండ్ టేబుల్స్ నిర్వహించాయి. ఈ ప్రాంత ప్రజలు, మేధావులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, గిరిజన సంఘాల నాయకులు వేల సంఖ్యలో వరికపూడిశెల ప్రాజెక్ట్ నిర్మాణం జరగాలని కోరుతూ ఉద్యమాలకు మద్దతు తెలుపుతున్నారు. 20 ఏళ్ల వయస్సు నుండి ఈ ఉద్యమంలో పాల్గొంటున్న వారికి ఇప్పుడు 60 ఏళ్లు దాటిపోయాయి. 'మా జీవిత కాలంలో వరికపూడిశెల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను చూడగలమా?' అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
శంకుస్థాపనలు వద్దు-పనులు ప్రారంభించాలి
అధికారంలో ఉన్న వివిధ రాజకీయ పార్టీల నాయకులు వాగ్దానం చేయడం, శంకుస్థాపనలు చేయటం, మభ్యపెట్టటం పరిపాటిగా మారింది. నేదురుమల్లి జనార్ధన రెడ్డి శంకుస్థాపన (శిరిగిరిపాడులో 1996 మార్చి 5న) చేసిన ఈ ప్రాజెక్టు శిలాఫలకం నేటికీ అలాగే ఉంది. 2008 జూన్ 6వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి వై.యస్.రాజశేఖరరెడ్డి ఈ ప్రాజెక్ట్‌కు వెల్దుర్తి మండలం గంగలకుంట వద్ద శంకుస్థాపన చేశారు. ఆయన మరణానంతరం ఈ ప్రాజెక్ట్ మళ్లీ అటకెక్కింది. 2019 ఫిబ్రవరి 6వ తేదీన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం జీవో నెం.104 ద్వారా వెల్దుర్తి మండలంలోని 24,900 ఎకరాలకు నీరు అందించడానికి 340 కోట్లకు వరికపూడిశెలకు పాలనాపరమైన అనుమతి ఇచ్చింది. 2 నెలల్లో ఎన్నికలు జరిగి ప్రభుత్వం పడిపోయింది. ప్రస్తుత ప్రభుత్వం...పర్యావరణ అనుమతులు తెచ్చామని, త్వరలో ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేస్తారని ప్రకటనలు చేస్తున్నది. ప్రజలు ప్రస్తుతం శంకుస్థాపనలను నమ్మే స్థితిలో లేరు. నిధులు కేటాయించి, పనులు ప్రారంభించాలని ప్రజలు కోరుతున్నారు.
పర్యావరణ అనుమతులు-నిధులు
వరికపూడిశెల ప్రాజెక్ట్ నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న పర్యావరణ అనుమతులు ఇప్పుడు లభించాయని నర్సరావుపేట లోక్‌సభ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, మాచర్ల శాసనసభ్యులు పి.రామకృష్ణారెడ్డి ప్రకటించారు. రాజీవ్‌గాంధీ వన్యమృగ సంరక్షణ కేంద్రంలో, నాగార్జునసాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో 19.13 హెక్టార్లు వినియోగించుకోవటానికి కేంద్ర పర్యావరణ శాఖ 2023 ఏప్రిల్ 25న జరిగిన సమావేశంలో అనుమతి ఇచ్చింది. దీనికి అనేక షరతులు, నియమ నిబంధనలు విధించింది. వీటిని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ 19.13 హెక్టార్ల భూమికిగాను వేరొకచోట అటవీశాఖకు భూములు అప్పగించాల్సి ఉంటుంది.
వెల్దుర్తి, దుర్గి, బొల్లాపల్లి, పుల్లల చెరువు మండలాలలో లబ్ధి చేకూర్చే ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి సుమారు రూ.1250 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారీ నిమిత్తం జీవో నెం.177 ద్వారా రూ.3.97 కోట్లు మంజూరు చేశామని ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు శాసనమండలిలో కె.యస్.లక్ష్మణరావు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 2024 ఎన్నికలకు 4 నెలలే ఉన్న ఈ తరుణంలో ప్రాజెక్ట్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసి, పనులు ప్రారంభించాలని ఈ ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
పల్నాడులోని కొన్ని ప్రాంతాల అభివృద్ధికి దోహదపడే 'వరికపూడిశెల లిఫ్ట్ ఇరిగేషన్' ప్రాజెక్ట్ పల్నాడు ప్రజల చిరకాల ఆశ. దీనికోసం ప్రభుత్వంపై మరోసారి ఒత్తిడి తేవటానికి ప్రజాసంఘాలు, రైతుసంఘాలు, గిరిజన సంఘాలు, పౌరసంఘాలు పూనుకుంటున్నాయి.
/ వ్యాసకర్త శాసనమండలి సభ్యులు, సెల్ : 8309965083 /
కె.యస్.లక్ష్మణరావు