Nov 12,2023 07:18

ఒక విధంగా మూడు శిబిరాల మధ్య స్వతంత్ర పాత్ర కాపాడుకుంటూ ఆత్మగౌరవం, విధాన స్పష్టతతో ముందుకు పోవడం, సిపిఐ పోటీ చేసే కొత్తగూడెంలో వారికే మద్దతు నిస్తామని కూడా సిపిఎం చెప్పడం లౌకిక శక్తుల, వామపక్ష వాదుల మన్నన పొందుతున్నది. ఈ పరిస్థితికి కారణమైన బిఆర్‌ఎస,్‌ కాంగ్రెస్‌లు ఓట్ల చీలిక పర్యవసానాలకు మూల్యం చెల్లించవలసి రావచ్చు.

కేంద్రం వివక్షనూ, దీర్ఘకాలిక సమస్యలను, మౌలికాంశాలను పక్కకు నెట్టి పరస్పర వివాదాలకే పరిమితమై మోడీకి మూడు ప్రాంతీయ పార్టీలూ బిజెపితో మ్యాచ్‌ఫిక్సింగ్‌ చేసుకున్నాయని సిపిఎం కార్యదర్శి శ్రీనివాసరావు సూటిగానే చెప్పారు. ఒక్క విషయంలోనైనా బిజెపి మతతత్వాన్ని, కేంద్ర నిరంకుశత్వాన్ని ప్రశ్నించడానికి ఈ పార్టీలేవీ సిద్ధం కాని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రయోజనాల రక్షణ కోసం, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం సిపిఎం రాష్ట్రవ్యాపితంగా నిర్వహించిన ప్రజా రక్షణ భేరి ప్రాధాన్యత సంతరించుకుంది. ఒక ప్రత్యామ్నాయ రాజకీయ భావనను, పోరాట సందేశాన్ని ప్రజల ముందుంచింది.

రో ఇరవై రోజులలోపే తెలంగాణ శాసనసభ ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. శుక్రవారంతో నామినేషన్ల ఘట్టం ముగిసింది. నవంబరు 30న ఓటేయడానికి ప్రజలు సంసిద్ధులవుతుండగా రాజకీయ పార్టీలు ప్రచారంలో మునిగిపోయాయి. క్రమేణా రూపు మారుతున్న ప్రచార పద్ధతులూ, మీడియా-సోషల్‌ మీడియా సాధనాలు, నాయకుల పర్యటనలూ అన్నీ అదే దిశలో హోరెత్తుతున్నాయి. ప్రజల తీర్పు ఎలా వుంటుందనేదానిపై అనేక రకాల సర్వేలు వెలువడుతున్నా ఇవేవీ ప్రభంజనం వస్తుందని చెప్పడం లేదు. పాలక పార్టీ బిఆర్‌ఎస్‌ గెలుస్తుందని కొన్ని సర్వేలు చెప్పగా కాంగ్రెస్‌ తప్పక విజయం సాధిస్తుందని ఇంకొన్ని సర్వేలు చెప్పాయి. అయితే విషయమేమంటే అసలు సర్వేలపై విశ్వసనీయత బాగా తగ్గడం. టీవీ చర్చలలో ఆ యా పార్టీల నాయకులు తమ ఓటమిని సూచించిన సర్వేలను తోసిపారేయడమే గాక ఎదురుదాడి చేస్తున్నారు. హఠాత్తుగా పుట్టుకొచ్చిన స్పాన్సర్డ్‌ సర్వే సంస్థల మాటకు విలువే వుండబోదని తెలంగాణ పరిస్థితిని బట్టి స్పష్టమవుతున్నది. బిఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌ మధ్యనే ప్రధాన పోటీ అనేదానిపై మాత్రం ఏకాభిప్రాయం కనిపిస్తుంది. కాంగ్రెస్‌ ప్రభంజనం నెలకొందన్న కథనాలతో అతి విశ్వాసం పాలైన ఆ పార్టీ ఉభయ కమ్యూనిస్టు పార్టీలతో చివరి వరకూ చర్చల ప్రహసనం జరిపి తాము అనుకున్నట్టు జరిపించడానికి పాచికలు విసిరింది. దానికీ కావలసినంత వ్యవధి ఇచ్చిన తర్వాత సిపిఎం గట్టి వైఖరి తీసుకోవడంతో కాంగ్రెస్‌ ఎత్తు పారలేదు. సిపిఐకి ఒక స్థానం కేటాయించినా అక్కడ కూడా ఆ పార్టీకి ఏ మేరకు సహకరిస్తుందనేది ఎవరికీ నమ్మకం లేని విషయం. ఎందుకంటే మా వాళ్లు మీకు సీటిచ్చినా ఓటు వేయరని కాంగ్రెస్‌ నాయకులు బాహాటంగానే కమ్యూనిస్టు నేతలకు చెప్పేశారు. విధానపరమైన విజ్ఞత అటుంచి అవగాహనను అమలు చేసే ఆనవాయితీ లేదని వారే ఒప్పుకుంటున్నారంటే ఇక ఇతరులు ఎలా నమ్మడం? అసలు కాంగ్రెస్‌, బిఆర్‌ఎస్‌, బిజెపిలలో ఎవరు వుంటారో ఏ క్షణంలో మరోచోటికి దూకేస్తారో అర్థం గాని అయోమయావస్థ. తెలంగాణలో రాజకీయ మార్పునకు సంకేతమై నిలిచిన మునుగోడు లోనే ఇదివరకు కాంగ్రెస్‌ నుంచి దూకి బిజెపి తరపున పోటీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఇప్పుడు మళ్లీ పాత పార్టీలో దూకి ఇటు నుంచి చేస్తున్నారు. బిఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలలో టికెట్‌ రానివారందరూ అటోఇటో దూకేస్తున్నారు. కొత్తగా టికెట్టివ్వడానికి పెద్ద అవకాశం లేని బిఆర్‌ఎస్‌ కూడా ఇతర పార్టీలలోని అసంతృప్త నేతలను ఆఖరి క్షణంలో చేర్చుకోవడం నిత్యకృత్యమైంది. ఎన్నికల తరుణంలో ఇవన్నీ గతంలోనూ జరిగాయి గాని ఇప్పుడు ఆ మోతాదు చాలా ఎక్కువగా వుంది. ప్రజాస్వామ్య లౌకిక విలువల పట్ల విధానపరమైన నిబద్దత, రాజకీయ విలువలు లేకపోవడం వల్ల ఎన్నికల పోరాటం కాస్త అధికారం కోసం ఆరాటంగానే తయారైంది.
 

                                                                          సందేహాస్పద రాజకీయం

బిజెపి మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా జరిగే జాతీయ పోరాటంలో బిఆర్‌ఎస్‌ ఒక కీలక భాగస్వామి అవుతుందనే నమ్మకం మునుగోడు ఎన్నిక కలిగించింది. ఆ సమయంలోనే ఆపరేషన్‌ ఫాం హౌస్‌, లిక్కర్‌ స్కాం కేసు వంటివి రంగం మీదకు వచ్చాయి. బిజెపి నేతలు ముఖ్యమంత్రి కెసిఆర్‌ కుటుంబంపైనా తీవ్ర స్థాయిలో దాడి చేశారు. వారి బెదిరింపులూ మతోన్మాద భాషణలూ పరాకాష్టనందుకున్నాయి. తర్వాత రకరకాల కథనాల మధ్య ఈ వాతావరణం మారిపోయింది. కెసిఆర్‌తో సహా ఆ పార్టీ నేతలు ఇండియా, బిజెపిల మధ్య సమదూరం సిద్ధాంతం ఆలపించసాగారు. కాంగ్రెస్‌ మా ప్రధాన ప్రత్యర్థి గనక ఇలా అంటున్నామని పైకి చెబుతున్నా మోడీ నిరంకుశ పోకడలపౖౖె విమర్శ ఎందుకు తగ్గిందనేది ప్రశ్న. ఎ.పి లో చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత ఆ మూలాలున్న వారి ఓట్ల ప్రభావం, కులపరమైన లెక్కలు ముందుకొచ్చాయి. ఈ క్రమంలోనూ బిఆర్‌ఎస్‌ ఓట్లను కాపాడుకోవడం కోసం అనేక విధాల వ్యూహాలు, మాటలు మార్చలేక తంటాలు పడుతోంది. కెసిఆర్‌ దాదాపు బిజెపి ప్రస్తావనే చేయడం లేదు. కెటిఆర్‌ అప్పుడప్పుడూ బిజెపి పైనా విమర్శలు వినిపిస్తూ వారితో తమకు ఎప్పుడూ ఎలాంటి బంధం లేదంటున్నా బిఆర్‌ఎస్‌పై ఆ విధమైన సందేహాలు కొనసాగుతూనే వున్నాయి. ప్రధాని మోడీతో సహా బిజెపి నేతలు మాత్రం పాలక పార్టీపై దాడి తీవ్రంగానే సాగిస్తున్నా కాంగ్రెస్‌కు అవకాశం లేకుండా చేయడమే వారికి కీలకమని పరిశీలకులు సరిగానే గుర్తిస్తున్నారు. వారి ఎత్తుగడలు ఏమైనా అసలు కాంగ్రెస్‌ శిబిరంలోనే ఐక్యత లేకపోవడం, అనేక మంది ముఖ్యమంత్రులు ముందుకు రావడం షరామామూలుగా సాగుతున్నది. మరో వంక మజ్లిస్‌ నేత ఒవైసీ బిఆర్‌ఎస్‌కే తమ మద్దతు వుంటుందని ప్రకటిస్తున్నారు. హంగ్‌ మాటలు కూడా వచ్చినపుడు మజ్లిస్‌ మద్దతు అవసరం కావచ్చనే అభిప్రాయం బలంగా వినిపిస్తుంది. అయితే అలాంటి పరిస్థితి వస్తే అప్పటి అవకాశాలను బట్టి ఆ యా పార్టీలు వ్యవహరిస్తాయి తప్ప చెప్పిన దానికే కట్టుబడి వుంటాయనుకోవడం పొరబాటు. బిజెపితో చేతులు కలిపి జనసేన పవన్‌ కళ్యాణ్‌ కూడా ఎనిమిది స్థానాల్లో పోటీ చేస్తుండడం, బిజెపి తెలుగు రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలను తన చుట్టూ తిప్పుకోవడం ఇక్కడ విస్మరించరాని విషయం. బిఆర్‌ఎస్‌గా పేరు మార్చుకుని జాతీయ పాత్ర నిర్వహిస్తామని హడావుడి చేసిన కెసిఆర్‌ ఇటీవల ప్రాంతీయ పార్టీలే కీలకమని వ్యాఖ్యానించడం కూడా బిజెపికి రాజకీయ సంకేతం కోసమేనా అన్న ప్రశ్నలు తలెత్తాయి. కాంగ్రెస్‌ను బలపరుస్తూ షర్మిల వైఎస్‌ఆర్‌టిపి, ప్రొఫెసర్‌ కోదండరామ్‌ టిజెఎస్‌ కూడా పోటీ నుంచి తప్పుకోవడం, గతంలో పాలక పార్టీగా వున్న తెలుగుదేశం ఇప్పుడు పోటీ నుంచి విరమించుకోవడం కూడా ఈ రాజకీయ విన్యాసాలలో భాగమే.
 

                                                                        సిపిఎం విస్పష్ట వైఖరి

ఇంత విశృంఖలంగా తయారైన రాజకీయ నేపథ్యంలో సిపిఎం బిజెపిని ఓడించడానికి బిఆర్‌ఎస్‌ ప్రభుత్వ ప్రజావ్యతిరేకత విధానాలపై పోరాడటానికి స్వంతంగా పోటీ చేస్తున్నది. ఖమ్మం జిల్లాలో అన్ని స్థానాలలోనూ ఇతర చోట్ల కూడా నామినేషన్లు దాఖలు చేసిన ఆ పార్టీ అభ్యర్థులు ప్రచారం ప్రారంభించారు. కీలక నాయకులు ప్రచారంలో పాల్గొంటున్నారు. మొదట బిఆర్‌ఎస్‌ తర్వాత కాంగ్రెస్‌ వామపక్షాలతో పొత్తు సంకేతాలిచ్చి తర్వాత ప్లేటు మార్చడం బిజెపి మతతత్వంపై పోరాటానికి హాని కలిగించిన తీరును వారు నిశితంగా విమర్శిస్తున్నారు. ఒక విధంగా మూడు శిబిరాల మధ్య స్వతంత్ర పాత్ర కాపాడుకుంటూ ఆత్మగౌరవం విధాన స్పష్టతతో ముందుకు పోవడం, సిపిఐ పోటీ చేసే కొత్తగూడెంలో వారికే మద్దతు నిస్తామని కూడా సిపిఎం చెప్పడం లౌకిక శక్తుల, వామపక్ష వాదుల మన్నన పొందుతున్నది. ఈ పరిస్థితికి కారణమైన బిఆర్‌ఎస,్‌ కాంగ్రెస్‌లు ఓట్ల చీలిక పర్యవసానాలకు మూల్యం చెల్లించవలసి రావచ్చు. గతవారం ఇదే శీర్షికలో చెప్పుకున్నట్టు ఎన్నికలు జరిగే ఇతర రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్‌ ఇలాంటి పరిస్థితికి కారణం కావడం గమనించదగ్గది. ఇక బిఆర్‌ఎస్‌, బిజెపి సంబంధాలు ఎలా వుండేది భవిష్యత్తు చెబుతుంది గానీ ఇప్పటికైతే బిజెపిపై విమర్శ తగ్గిందనేది నిర్వివాదాంశం. ఎంఎల్‌సి కవితను అరెస్టు చేయకపోవడానికి ఇదే కారణమని కాంగ్రెస్‌ ఆరోపించడమే గాక కెసిఆర్‌ సర్కారుపై సిబిఐ దర్యాప్తు జరిపించాలని కూడా అడపాదడపా అంటున్నది. వాస్తవానికి భిన్నంగా ఏదో బిఆర్‌ఎస్‌ కోసం స్వంతంగా పోటీ చేస్తున్నదని వచ్చిన ఆరోపణలను సిపిఎం నిశితంగా ఖండించింది. బిజెపిని ఓడించడమేగాక స్వంత పునాదిని కాపాడుకోవడం ఒక కీలక కర్తవ్యమని కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మీట్‌ ద ప్రెస్‌లో గుర్తుచేశారు. పోలిట్‌బ్యూరో సభ్యులు రాఘవులుతో సహా సిపిఎం నేతలు ప్రచారంలో విస్త్రతంగా పాల్గొంటూ తమ పోటీ ప్రాధాన్యతను వివరిస్తున్నారు.
 

                                                                     ఎ.పి లో ప్రజారక్షణ భేరి

ఇదే సమయంలో ఎ.పి లో ఎన్నికలు లేకున్నా రాజకీయ వివాదాలు, కేసులు తీవ్రంగానే నడుస్తున్నాయి. పాలక వైసిపి, టిడిపిలు నిరంతరం ఈ తగాదాలలోనే మునిగి తేలుతూ నిజమైన సమస్యలను, కేంద్రం చేసిన అన్యాయాలను గాలికి వదిలేస్తున్నాయి. బిజెపి ఎన్‌డిఎ కూటమిలో భాగస్వామిగా వున్న జనసేన ఎ.పి లో మాత్రం టిడిపితో పొత్తు ప్రకటించింది. ఆ రెండు పార్టీల మధ్య రెండు దఫాలు చర్చలు జరిగాయి గాని సమస్యలపై కార్యాచరణ మాత్రం మొదలైంది లేదు. మరోవంక వైసిపి సామాజిక సాధికార యాత్రల తతంగం మొదలెట్టింది. తామే సామాజిక న్యాయానికి ప్రతిరూపమని పథకాల గురించి చెప్పుకుంటున్నది. నిజానికి ఈ సామాజిక సాధికారత నేతి బీరకాయలో నెయ్యి లాంటిదని సిపిఎం నాయకులు నిశితంగా విమర్శ చేస్తున్నారు. దళితులు, గిరిజనులు, వెనకబడిన వర్గాలు మహిళల రక్షణలో వైఫల్యాన్ని తాజా ఘటనలతో సహా వారు ప్రజల ముందు ప్రస్తావించారు. రైతులు, ఉద్యోగులు, కార్మికులు, నిరుద్యోగుల సమస్యలను ఎలుగెత్తి చాటారు. పోలవరం నిర్వాసితుల సమస్యలనూ రాయలసీమ, ఉత్తరాంధ్ర, ప్రకాశం వెనకబడిన ప్రాంతాల వెతలను వినిపించారు. ఇచ్చిన హామీ మేరకు కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలన్నారు. అమరావతిలో రాజధాని కొనసాగించాలని కోరారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ యత్నాలపై పోరాడకుండా మోడీ ఆదేశాల మేరకు అదానీకి వనరుల ధారాదత్తం చేస్తున్న ప్రభుత్వ వైఖరిపై ధ్వజమెత్తారు. బిజెపి పట్ల టిడిపి వైఖరి ఏమిటో స్పష్టం చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. కేంద్రం వివక్షనూ, దీర్ఘకాలిక సమస్యలను, మౌలికాంశాలను పక్కకు నెట్టి పరస్పర వివాదాలకే పరిమితమై మోడీకి మూడు ప్రాంతీయ పార్టీలూ బిజెపితో మ్యాచ్‌ఫిక్సింగ్‌ చేసుకున్నాయని సిపిఎం కార్యదర్శి శ్రీనివాసరావు సూటిగానే చెప్పారు. ఒక్క విషయంలోనైనా బిజెపి మతతత్వాన్ని, కేంద్ర నిరంకుశత్వాన్ని ప్రశ్నించడానికి ఈ పార్టీలేవీ సిద్ధం కాని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రయోజనాల రక్షణ కోసం, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం సిపిఎం రాష్ట్రవ్యాపితంగా నిర్వహించిన ప్రజా రక్షణ భేరి ప్రాధాన్యత సంతరించుకుంది. ఒక ప్రత్యామ్నాయ రాజకీయ భావనను, పోరాట సందేశాన్ని ప్రజల ముందుంచింది. ఎక్కడికక్కడ ప్రజలు వామపక్ష వాదులు సమాదరించడం ఒక చర్చకు ప్రారంభ వాక్యమైంది. వివిధ ప్రాంతాల నుంచి మొదలైన ఈ యాత్రలు ముగింపుగా విజయవాడకు చేరుకుంటున్నాయి. నవంబరు 15న జరిగే భారీ బహిరంగ సభ ప్రదర్శనలు ఈ యాత్రలకే గాక రాష్ట్రంలో ఒక భిన్నమైన రాజకీయ చర్చకు, పునస్సమీకరణకూ నాంది పలికితే అది శుభసూచకమవుతుంది. రెండు రాష్ట్రాలలోనూ ఆయా పార్టీల అవకాశవాద పోకడలకు భిన్నంగా ఎన్నికలలోనూ ఉద్యమాలలోనూ సిపిఎం విలక్షణ పంథా అనుసరించడం అభినందనీయం. ప్రజలు ఈ ప్రయత్నాన్ని ప్రోత్సహిస్తారని, అన్ని వామపక్ష, ప్రజాస్వామిక శక్తులు, సామాజిక తరగతులూ తోడవుతారని ఆశించాలి.

తెలకపల్లి రవి

telakapalli ravi