Nov 10,2023 07:15

రాష్ట్రంలో చాలా సంవత్సరాలుగా ఎన్నికల అవసరాల కోసం పాలక పార్టీలు ఇళ్లు, ఇంటి స్థల సమస్యలను వాడుకోవడం రివాజుగా మారింది. ఇందిరమ్మ ఇళ్లు, టిడ్కో ఇళ్లు, జన్మభూమి ఇళ్లు, జగనన్న ఇళ్లు...ఇలా అనేక ఇంటి పథకాలను ఆ పార్టీలు ప్రకటించడం, పేదల ఓట్లు కొల్లగొట్టడం జరుగుతూనే ఉంది. పేదల సొంతింటి కల నెరవేరుస్తామంటూ హామీలిస్తారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పేదలకు ఇళ్లు ఇవ్వకపోగా వారు వేసుకున్న గుడిసెలను కూడా కూల్చివేయడం పాలకుల నయవంచనకు నిదర్శనం.

          రాష్ట్ర ప్రభుత్వం సామాజిక సాధికార బస్సు యాత్ర నిర్వహిస్తున్నది. నా ఎస్‌.సి, నా ఎస్‌.టి, నా బి.సి లు అంటూ ముఖ్యమంత్రి కొత్త రాగం అందుకున్నారు. ఇదే సందర్భంలోనే అనంతపురం, కడప, శ్రీసత్య సాయి జిల్లాల్లో పేదలు వేసుకున్న గుడిసెలను పోలీసు, రెవిన్యూ అధికారులు దౌర్జన్యంగా కూల్చివేస్తున్నారు. ఆ పేదలపై తప్పుడు కేసులు పెడుతున్నారు. జగనన్న ఇళ్ల పథకం ఆచరణలో ఒట్టిపోయిన గేదె లాగా తయారైంది. గత టిడిపి ప్రభుత్వ టిడ్కో ఇళ్ల నిర్మాణం ఇలాగే మధ్యంతరంగా ఆగిపోయింది. రాష్ట్రంలో చాలా సంవత్సరాలుగా ఎన్నికల అవసరాల కోసం పాలక పార్టీలు ఇళ్లు, ఇంటి స్థల సమస్యలను వాడుకోవడం రివాజుగా మారింది. ఇందిరమ్మ ఇళ్లు, టిడ్కో ఇళ్లు, జన్మభూమి ఇళ్లు, జగనన్న ఇళ్లు...ఇలా అనేక ఇంటి పథకాలను ఆ పార్టీలు ప్రకటించడం, పేదల ఓట్లు కొల్లగొట్టడం జరుగుతూనే ఉంది. పేదల సొంతింటి కల నెరవేరుస్తామంటూ హామీలిస్తారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పేదలకు ఇళ్లు ఇవ్వకపోగా వారు వేసుకున్న గుడిసెలను కూడా కూల్చివేయడం పాలకుల నయవంచనకు నిదర్శనం. ప్రభుత్వం లక్షల ఇళ్లు కట్టిస్తుంటే కమ్యూనిస్టుల గుడిసెలు వేయడమేమిటని కొందరు అధికారులు అమాయకంగా మాట్లాడుతుంటారు. గుడిసెలు వేసుకోవడం వాటిని అమ్ముకోవడం, తిరిగి ఇల్లు లేదని రోడ్లెక్కడం ఇదే అలవాటైందని కొందరు అధికార బలం, సామాజిక పెత్తందారీ మనస్తత్వంతో అంటుంటారు. కొందరు మధ్యతరగతి వారు తెలిసీ తెలియక ఇలాంటి వారి మాటలకు ప్రభావితం అవుతూ పేదలను, వారి పక్షాన పోరాడుతున్న కమ్యూనిస్టులను నిష్టూరంగా మాట్లాడుతుంటారు. పేదల ఇళ్ల సమస్య అర్థం కావాలంటే వారి ఆర్థిక, సామాజిక పరిస్థితులు, పాలకుల నయవంచనా విధానాలు అర్థం చేసుకోగలగాలి.
 

                                                                పేదలకు ఇల్లు ఎందుకు కావాలి ?

రాష్ట్ర జనాభా 5.20 కోట్లు. వీరిలో 68.70 శాతం గ్రామాల్లో నివసిస్తున్నారు. ఒకవైపు వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో వుండి సాగు విస్తీర్ణం వేగంగా పడిపోతున్న స్థితిలో ఆ రంగంపైనే అత్యధికమంది ఆధారపడాల్సి రావడం రాష్ట్ర వెనుకబాటుకు నిదర్శనం. పల్లెల్లో భూములపై హక్కు వున్న ధనిక రైతాంగంలో ఎక్కువ మంది అక్కడ నివాసాలు ఉండడంలేదు. పిల్లల చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాల పేరుతో పట్టణాలకు, నగరాలకు, మహా నగరాలకు వెళ్లిపోతున్నారు. గ్రామంలో ఒకనాడు పెత్తనానికి ప్రతిరూపాలుగా వున్న వీరి భవంతులు చాలా వరకు మూలపడి, బూజుపట్టి పోతున్నాయి. అయితే వీరికి ఆస్తి మీద హక్కు వుంది కాబట్టి రాజకీయ, సామాజిక పెత్తనాన్ని కొనసాగించడం కోసం వీరు తమ తోటల్లో ఆధునిక సౌకర్యాలతో నూతన భవంతులు నిర్మించుకుని అప్పుడప్పుడు గ్రామాలకు వెళ్లి వస్తుంటారు. సంఖ్య రీత్యా తక్కువైనా వీరి ప్రభావం మధ్యతరగతి రైతాంగం మీద ఎక్కువగా ఉంటుంది. ఈ మధ్యతరగతి కుటుంబాల్లో కొందరి పిల్లలు చదువుకుని కొత్త ఉద్యోగాలను సంపాదించు కోవడంతో...ముఖ్యంగా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు గ్రామాల్లోని పాత ఇళ్లను ఆధునికంగా మార్చుకుంటున్నారు. ఈ రెండు తరగతుల వారికి ఇల్లు పెద్ద సమస్య కాదు. కానీ అత్యధికులైన వ్యవసాయ కూలీలు, చిన్న, సన్నకారు రైతులకు స్వంత ఇల్లు అనేది తీవ్రమైన సమస్య. ఈ కుటుంబాల్లో ఉన్న పిల్లల్లో అత్యధికమంది అదే గ్రామంలో ఉంటూ వ్యవసాయ, వ్యవసాయేతర పనుల మీద ఆధారపడి జీవిస్తున్నారు. పట్టణాలకు దగ్గరగా ఉన్న గ్రామాల వారు పట్టణాల్లో పని చేసుకుని గ్రామాల్లో వచ్చి నివసిస్తున్నారు. ఇలాంటి కుటుంబాలకు స్వంత ఇల్లు అనేది అత్యంత ముఖ్యమైన అవసరం.
         పట్టణాల్లో ఉన్న 31.30 జనాభాలో ఉన్నతోద్యోగు లు, కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులు, పెద్ద వ్యాపారు లు, పేరొందిన డాక్టర్లు, లాయర్లు, వృత్తి నిపుణుల ఇల్లు పట్టణ అభివృద్ధికి చిహ్నాలుగా భావించే పరిస్థితి ఏర్పడింది. పట్టణాలు, నగరాల్లో అత్యంత ఆధునికమైన, విలాసవంతమైన, విశాల భవనాలు కొన్ని కనిపిస్తాయి. ఇలాంటి భవంతులు మొత్తం పట్టణ నివాసాల్లో 10 శాతానికి అటుఇటుగా ఉంటాయి. మిగిలిన 90 శాతంలో అపార్ట్‌మెంట్లు, మధ్యతరగతి కాలనీలు, ఇతర నివాసాలు పోగా సుమారు 30 నుండి 40 శాతం మంది పేదలు మురికివాడల్లో నివసిస్తున్నారు. వీరంతా గ్రామాల నుండి వలసలు వచ్చిన పేదలు, వ్యవసాయంలో నష్టపోయి ఆస్తులను కోల్పోయి పట్టణాలకు చేరిన పేద రైతులు, సామాజిక వివక్షను సహించలేక పట్టణాలకు చేరుకున్న అట్టడుగు వర్గాల వారు. వీరికి స్వంత ఇల్లు అనేది జీవితకాల లక్ష్యంగా ఉంటుంది. తాము ఎక్కడ పని చేసినా రాత్రికి చేరుకోవడానికి, తమకంటూ ఒక అడ్రసు వుండడానికి ఇల్లు కావాలని గ్రామాల్లో, పట్టణాల్లో వుండే పేదలు కోరుకుంటారు. తమ తదనంతరం తమ వారసులకు ఒక నీడ ఇవ్వాలని భావిస్తుంటారు. పక్షులు సైతం గూడు ఏర్పాటు చేసుకుంటుంటే తమకు మాత్రం సొంత గూడు లేదని నిట్టూరుస్తుంటారు. ఎవరు ఇల్లు ఇస్తామంటే వారి వెంట చేరతారు. ఎక్కడ గుడిసెలు వేస్తే అక్కడ వాలతారు. ఇల్లు సాధించుకోవడానికి ఎన్ని కష్టాలనైనా భరిస్తారు. ఎన్నికల రాజకీయంలో వీరి ఓట్లే నాయకుల తలరాతలు మార్చేస్తుంటాయి. అందుకే ఈ పేదల ఇంటి స్థలం, ఇల్లు అన్ని పార్టీలకు కీలకాంశం అవుతుంది. 'అందరికీ ఇల్లు' అని నినదిస్తారు. అయితే పాలక వర్గాలు ఇది చిత్తశుద్ధితో ఇచ్చే హామీ కానందున దశాబ్దాలు గడిచినా పేదలకు స్వంత ఇంటి కల కలగానే మిగిలిపోతుంది.
 

                                                                                జగనన్న ఇళ్లు

రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలను ఈ ప్రభుత్వం గుర్తించి 30 లక్షల 60 వేల మందిని అర్హులుగా ఎంపిక చేసింది. వీరికి 15,901 లేఅవుట్ల కింద మొదటి దశలో 15 లక్షల 60 వేలు, రెండవ దశలో 12 లక్షల 70 వేల ఇళ్లు, మిగిలిన ఇళ్లను ఆ తరువాత కట్టిస్తామని హామీ ఇచ్చింది. ఈ ఇళ్ల నిర్మాణానికి లక్ష 30 వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. గత సంవత్సరం డిసెంబర్‌ 21న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి జన్మదినం సందర్భంగా రాష్ట్రంలో 5 లక్షల ఇళ్లలో సామూహిక గృహ ప్రవేశాలు చేస్తామని ప్రకటించి ప్రభుత్వం వాయిదా వేసింది. కారణం ఇళ్లు పూర్తికాకపోవడం. 30 లక్షల ఇళ్లు అని చెప్పిన నాలుగున్నర సంవత్సరాల తర్వాత పూర్తయిన ఇళ్ళు కేవలం లక్షన్నర మాత్రమే. ఈ లెక్కన ఇప్పుడున్ను ఇల్లు లేని 30 లక్షల మంది నిరుపేదలకు ఇళ్ళు దక్కాలంటే మరో 30 సంవత్సరాలు పడుతుంది. జగనన్న ఇళ్ల నిర్మాణం కింద అనంతపురం జిల్లాకు 68,288 ఇళ్లు మంజూరు కాగా పూర్తయినవి కేవలం పది వేలు మాత్రమే. జిల్లా కేంద్రం అనంతపురం నగరంలో 19,298 ఇళ్లు మంజూరైతే, పూర్తయినవి మాత్రం కేవలం వెయ్యి లోపు. రాష్ట్ర మంతటా ఇంచుమించు ఇదే పరిస్థితి. నవరత్నాల్లో భాగమైన వైఎస్‌ఆర్‌ జగనన్న ఇంటి పథకం ఇంత అధ్వానంగా ఎందుకు అమలైంది అన్నది ప్రశ్న.
 

                                                                                టిడ్కో ఇళ్లు

గత తెలుగుదేశం ప్రభుత్వం ఎ.పి. టిడ్కో (ఆంధ్రప్రదేశ్‌ టౌన్‌షిప్‌ అండ్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌) ద్వారా 3.13 లక్షల ఇళ్లు నిర్మించాలని ఎన్నికలకు సంవత్సరం ముందు అంటే 2018లో లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఇళ్లను మూడు రకాలుగా 300 చదరపు అడుగులు, 365, 430 చ.అడుగుల ఇళ్లగా విభజించారు. లబ్ధిదారుల నుండి లక్ష, లక్షన్నర, రెండు లక్షల రూపాయలు డిపాజిట్‌ చేయించుకున్నారు. లేఅవుట్లు వేసి, కొద్దిమేరకు నిర్మాణాలు చేపట్టారు. సంవత్సరంలోపు ఈ ఇళ్లు నిర్మించడం సాధ్యం కాదని నాటి ప్రభుత్వానికి తెలుసు. వీటిని చూపి ఎన్నికల్లో లబ్ధి పొందవచ్చనుకున్నారు. అధికారంలోకి వచ్చిన వైసిపి మధ్యస్తంగా ఆగిపోయిన టిడ్కో ఇళ్లను పూర్తిచేసి పేదలకు ఇవ్వకుండా గత నాలుగు సంవత్సరాలు నిర్లక్ష్యంగా వ్యవహరించింది. గతంలో మంజూరైన ఇళ్లల్లో 25 శాతంలోపు పనులు కాని 51,616 ఇళ్లను రద్దు చేశారు. ఇలా రద్దు చేయడం వల్ల 260.74 ఎకరాల భూమి మిగులుగా ఏర్పడింది. ఈ భూమిని అమ్మి టిడ్కో ఇళ్లు పూర్తి చేయాలని భావించారు. అంటే వారి వేలితోనే వారి కంటిని పొడవడం అన్నమాట. అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల్లో ఈ మిగులు భూమి 140 ఎకరాలు వుండడం గమనార్హం.
 

                                                             పేదల ఇళ్ల నిర్మాణం పట్ల ఎందుకింత నిర్లక్ష్యం ?

కూడు, గుడ్డ, నీడ మనిషి కనీస అవసరాలని, వీటిని తీర్చడం ప్రభుత్వ మొదటి ప్రాధాన్యతగా ఉండాలని రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు చెబుతాయి. ఇళ్లు ఇస్తామని పార్టీలు, ప్రభుత్వాలు చెబుతాయి. కాని పేదలకు సొంతింటి కల ఎందుకు నెరవేరడంలేదు. పాలకుల వర్గ స్వభావమే ఇందుకు మూల కారణం. పేదలు పేదరికంలో వుంటేనే పాలకులు వేసే చిట్కా పథకాలకు ఎగబడతారు, ఓట్లు వేస్తారు. అర్హులైన పేదలకు పట్టణాలకు దూరంగా ఇళ్లు నిర్తిస్తే సంపన్నుల పనులు చేసేవారు ఎవరు? దగ్గరగా నిర్మిస్త్తే లక్షల కోట్ల వ్యాపారంగా విజృంభిస్తున్న రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ఎలా జరుగుతుంది? ప్రభుత్వ స్థలాలు పేదలకు పంచితే తమ పార్టీ వారు, కొందరు అధికారులు కబ్జాలు చేసుకోవడానికి, కోట్లు సంపాదించుకోవడానికి అవకాశం ఎలా ఉంటుంది ?
              అనంతపురం జిల్లాలోని గార్లదిన్నె మండలం కల్లూరు గ్రామంలో మూడు సంవత్సరాలుగా కాపురం ఉన్న 150 మంది పేదల ఇళ్లను (హైకోర్టులో పెండింగ్‌ ఉన్నప్పటికీ) నవంబర్‌ 1న కూల్చివేశారు. ఆ స్థలం దేవుని మాన్యం అని చెబుతున్నారు. అదే గ్రామంలో 56.37 ఎకరాల దేవుని మాన్యం భూములను అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆక్రమించుకుని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారు. శ్రీసత్య సాయి జిల్లా చిలమత్తూరు గ్రామంలో జగనన్న ఇళ్ల కోసం స్థలం సేకరించారు. లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చారు. కానీ స్థలాన్ని చూపలేదు. పేదలకివ్వాలని అధికారులు చూపిన స్థలం బెంగళూరు-హైదరాబాద్‌ హైవే పక్కన వుండ డంతో అధికార పార్టీ నాయకుల కన్ను పడి దానిని ఇవ్వకుండా అడ్డుకుంటున్నారు. పేదలు గుడిసెలు వేసుకుంటే కూల్చి, కాల్చివేశారు. కడప జిల్లా పోరుమామిళ్ల గ్రామంలో ఇలాగే పేదలు వేసుకున్న ఇళ్లను కూల్చివేశారు. పోరాటాల ద్వారా పేదలు తమ ఇంటి సమస్యను పరిష్కరించుకోవడం తప్ప ఇంకో మార్గం లేదు. అందుకు ఐక్య పోరాటమే దారి.

/వ్యాసకర్త సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు/
వి. రాంభూపాల్‌

rambhupal