Nov 21,2021 08:10

అంగారకుడిపై పరిశోధనల్లో శాస్త్రవేత్తలు మరో ముందడుగు వేశారు. అరుణ గ్రహంపై నీటి జాడలను తెలిపే ఆధారాలు ఇటీవలే లభించాయి. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా పర్సెవెరెన్స్‌ ఫిబ్రవరిలో దిగిన ప్రాంతంలో ఒకప్పుడు సరస్సు ఉండేదని, దీని నుంచే నది మొదలైనట్టు రోవర్‌ పంపిన ఫొటోలు వెల్లడిస్తున్నాయి. అంతరిక్షం నుంచి కనిపించే ఫ్యాన్‌ ఆకారపు ఈ డెల్టాలో అవక్షేపాలు నిక్షిప్తమై ఉన్నాయి. ఒకప్పుడు ఈ నది ఒడ్డున ఉన్న శిఖరాల ద్వారా సంగ్రహించిన హై రిజల్యూషన్‌ ఫొటోలను శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు.
ఈ శిఖరాల లోపల పొరలు, దాని నిర్మాణం ఎలా జరిగిందో వెల్లడిస్తాయి. ఫ్లోరిడాలోని నాసా ఆస్ట్రో బయాలజిస్ట్‌ అమీ విలియమ్స్‌ బృందం భూమిపై ఉన్న నది డెల్టాల్లోని నేలపై కనిపించే శిఖరాల లక్షణాలు, అంగారుకుడిపై నమూనాల మధ్య సారూప్యతను కనుగొన్నారు. దిగువ మూడు పొరల ఆకారం నీటి ఉనికిని, స్థిరమైన ప్రవాహాన్ని చూపించింది. దాదాపు 3.7 బిలియన్‌ సంవత్సరాల క్రితం అంగారక గ్రహంపై నీటి ఉనికి ఆనవాళ్లుకు బలం చేకూర్చేలా అక్కడ వెచ్చదనం, తేమ ఉందని అధ్యయనం చెబుతోంది.
ఃఎగువ, ఇటీవలి పొరల్లో ఒక మీటర్‌ కంటే ఎక్కువ వ్యాసం కలిగిన బండరాళ్లు చెల్లాచెదురుగా ఉన్నాయి. బహుశా అక్కడ భారీ వరదలు సంభవించి ఉండొచ్చు. కానీ అంగారక గ్రహంపై దీర్ఘకాలం అంతరించిపోయిన జీవజాల ఉనికి నమూనాలో ఉండే బేస్‌ పొర సున్నితమైన అవక్షేపం. మట్టి, శిలల కోసం రోవర్‌ను ఎక్కడ పంపాలనేది శాస్త్రవేత్తలు గుర్తించడానికి ఈ పరిశోధనలు సహాయపడతాయి. కక్ష్యలోని ఫొటోలను బట్టి ఇది డెల్టాను ఏర్పరిచే నీరు అని మాకు తెలుసుః అని విలియమ్స్‌ ఒక ప్రకటనలో తెలిపారు.
కానీ ఈ ఫొటోలు కవర్‌ పేజ్‌ చూసి పుస్తకాన్ని చదవడం లాంటిది అని ఆమె వ్యాఖ్యానించారు. మార్స్‌పై జీవజాలం ఉనికిని గుర్తించడానికి నాసా పంపిన ముఖ్యమైన ప్రాజెక్టు పర్సెవెరెన్స్‌. దశబ్దాలుగా ఈ ప్రాజెక్టు కోసం బిలియన్‌ డాలర్లు ఖర్చు చేస్తోంది. అంగారకుడిపై ఈ మల్టీ టాస్కింగ్‌ రోవర్‌ 30కిపైగా రాయి, మట్టి నమూనాలను సీల్డ్‌ ట్యూబ్‌లలో సేకరించి, చివరికి ల్యాబ్‌ విశ్లేషణ కోసం 2030లో ఎప్పుడైనా భూమికి తిరిగి పయనమవుతుంది.
ఉపరితలంపై రాతి నమూనాలను సేకరించడానికి పర్సెవెరెన్స్‌ ఆగస్టులో చేసిన తొలి ప్రయత్నం విఫలమయ్యింది. అయితే, రెండోసారి సెప్టెంబరులో రోవర్‌ చేసిన ప్రయత్నం విజయవంతమైనట్టు నాసా ప్రకటించింది. ఒక ట్యూబ్‌ లోపల పెన్సిల్‌ కంటే కొంచెం మందంగా ఉన్న రాతి నమూనా ఉన్న ఫొటోను షేర్‌ చేసిన నాసా.. ఈ నమూనాను సెప్టెంబర్‌ 1న పర్సెవెరెన్స్‌ సేకరించినట్టు తెలిపింది.

అంగారకుడిపై ప్రాచీన నది..!
గత అధ్యయనాలు..
అయితే ఈ గ్రహంలోని నీటిలో చాలా భాగం గ్రహం పైపొరలో బందీగా ఉంది. అంతేకాకుండా ఈ ప్రాచీన జలం.. అంగారకుడి రాళ్లలో ఖనిజాల రూపంలో ఉందని మరో అంచనా. ఈ ఆవిష్కరణల గురించి 52వ లూనార్‌ అండ్‌ ప్లానెటరీ సైన్స్‌ కాన్ఫరెన్స్‌లోనూ చర్చించారు. సైన్స్‌ జర్నల్‌లోనూ ప్రచురించారు. ఈ గ్రహం మీద నుంచి నీరు కోట్ల సంవత్సరాల కాలంలో క్రమంగా ఎలా మాయమైపోయిందనే అంశంపై శాస్త్రవేత్తలు ఒక కంప్యూటర్‌ నమూనానూ అభివద్ధి చేశారు.
నాలుగు వందల కోట్ల సంవత్సరాల కిందట మార్స్‌ ఇప్పటికన్నా వెచ్చగా, తడిగా ఉండేది. దాని ఉపరితల వాతావరణం మరింత చిక్కగా ఉండి ఉండొచ్చు. నీరు భారీగా ప్రవహించింది. రాళ్లను కోతలు పెడుతూ నదులు ప్రవహించాయి. గ్రహ శకలాలు ఢకొీనటంతో ఏర్పడిన బిలాలతో ఈ గ్రహం నిండిపోయింది. దాదాపు ఒక వంద కోట్ల సంవత్సరాల కిందట మార్స్‌ వాతావరణం ఇప్పుడు మనం చూస్తున్నట్లుగా చల్లని, ఎడారి గ్రహంగా మారింది.
ఃఅంగారకగ్రహం తొలి నాళ్లలో మరింత తడిగా ఉండేదని మనకు చాలా కాలంగా తెలుసు. కానీ ఆ నీరంతా ఏమైందనే ప్రశ్న ఇన్నాళ్లుగా అలాగే మిగిలిపోయిందిః అని ఖగోళ శాస్త్రవేత్త డాక్టర్‌ పీటర్‌ గ్రిండ్రాడ్‌ గతంలో పేర్కొన్నారు. అయితే తాజా అధ్యయనంలో ఆయన పాత్ర లేదు. లండన్‌లోని నాచురల్‌ హిస్టరీ మ్యూజియానికి చెందిన డాక్టర్‌ పీటర్‌ మాట్లాడుతూ.. ఃఆ నీటిలో కొంతభాగం అంతరిక్షంలోకి పోయిందని మార్స్‌ వాతావరణం మీద చేసిన అధ్యయనాల ద్వారా మనకు ఇప్పటికే తెలుసు. ఇక ఉపరితలానికి కేవలం కొంచెం కింది భాగంలో మంచు నిల్వలు, కొంత నీరు ఘనీభవించిందని అధ్యయనాలు చెప్తున్నాయిః అని పేర్కొన్నారు.