ఆకాశంలో మన భూమికి 150 కాంతి సంవత్సరాల దూరంలో అరుదైన నక్షత్రాలను భారతీయ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. స్వదేశీయంగా రూపొందించిన పరికరంతోనే వీటిని గుర్తించడం విశేషం. అయితే లైట్‌హౌస్ తరహాలో ఇవి ప్రకాశవంతమైన రేడియో ప్రకంపనలను నలుమూలలకూ వెదజల్లుతున్నాయి. పుణెలోని నేషనల్ సెంటర్ ఫర్ రేడియో ఆస్ట్రో ఫిజిక్స్ (ఎన్‌సీఆర్‌ఏ) కు చెందిన శాస్త్రవేత్తలు వీటిని కనుగొన్నారు. అయితే గతంలోనే వీరు మూడు నక్షత్రాలను గుర్తించారు. ప్రస్తుతం మరో ఎనిమిది నక్షత్రాలను గుర్తించినట్లు చెబుతున్నారు. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం..!
పాలపుంతలో 'మెయిన్ సీక్వెన్స్ రేడియో పల్స్' (ఎంఆర్‌పిఎస్) ఎమిటర్స్ అనే అరుదైన తరగతికి చెందిన ఎనిమిది నక్షత్రాలను భారత శాస్త్రవేత్తలు కనుగొన్నారు. పుణే సమీపంలోని జయింట్ మీటర్‌వేవ్ రేడియో టెలిస్కోపు (యుజిఎంఆర్‌టి)ను ఉపయోగించి, వీటిని కనుగొన్నారు. ఈ నక్షత్రాలు సూర్యుడి కన్నా చాలా వేడిగా, పరిమాణంలోనూ పెద్దగా ఉంటాయని తెలిపారు. అసాధారణ స్థాయిలో బలమైన అయస్కాంత క్షేత్రాలు, తీవ్రస్థాయి జ్వాలలు వీటి నుంచి వెలువడుతున్నట్టు వివరించారు.
ఎంఆర్పీ నక్షత్రాలు సూర్యునితో పోలిస్తే చాలా వేడిగా ఉంటాయని సైంటిస్టులు పేర్కొన్నారు. చాలా ప్రకాశవంతమైన రేడియో ప్రకంపనలు వెదజల్లుతాయని వివరించారు. అతి తీవ్రమైన జ్వాలలు, అయస్కాంత క్షేత్రాలు వెదజల్లుతాయని తెలిపారు. ఇప్పటి వరకు కనుగొన్న 15 ఎంఆర్పీల్లో 11 నక్షత్రాలను జీఎంఆర్ టీతోనే గుర్తించారు.
లైట్‌హౌస్ తరహాలో ఇవి ప్రకాశవంతమైన రేడియో ప్రకంపనలను నలుమూలలకూ వెదజల్లుతున్నాయని పేర్కొన్నారు. పుణెలోని నేషనల్ సెంటర్ ఫర్ రేడియో ఆస్ట్రో ఫిజిక్స్ (ఎన్‌సీఆర్‌ఏ) కు చెందిన శాస్త్రవేత్తలు పూనమ్ చంద్ర, బర్నాలీ దాస్ వీటిని కనుగొన్నారు. ఇటువంటి మూడు నక్షత్రాలను గతంలో వీరు గుర్తించారు.
'కనుగొన్న ఎనిమిది ఎంఆర్‌పిలలో ఈ నక్షత్రాల ద్వారా ఒక భ్రమణానికి పట్టే సమయం రోజులో సగం నుంచి నాలుగు రోజుల మధ్య ఉంటుంది' అని బర్నాలీ దాస్ అన్నారు. ఈ అధ్యయన ఫలితాలను ఆస్ట్రోఫిజికల్ జర్నల్‌లో ప్రచురించారు. అయితే, ఎంఆర్‌పిలను గుర్తించడం ఒక సవాల్‌తో కూడుకున్నపని. అవి విడుదల చేసే రేడియో ప్రకంపనలు రోజు, సంవత్సరంలోని ఎంపిక చేసిన సమయాల్లో మాత్రమే కనిపిస్తాయి. తక్కువ రేడియో ఫ్రీక్వెన్సీలలోనే వీటిని గుర్తించడం సులభం.
ప్రస్తుతం ప్రపంచంలోని మరే ఇతర రేడియో టెలిస్కోప్‌లకూ లేని ప్రత్యేక లక్షణం యుజిఎంఆర్‌టి సొంతం. ఆప్టికల్ ఫ్రీక్వెన్సీలో ధ్రువీకరించిన వాస్తవ స్థితి ఆధారంగా శాస్త్రవేత్తలు 400 ఎంహెచ్‌జెడ్-850 ఎంహెచ్‌జెడ్ బ్యాండ్‌విడ్త్‌లో 2019 మధ్యకాలం నుంచి నిర్దిష్ట రోజుల్లో పరిశీలనలు నిర్వహిస్తున్నారు. అమెరికాలోని కార్ల్ జి జాన్స్కీ వెరీ లార్జ్ అర్రే (విఎల్‌ఎ) ప్రాంతాన్ని కూడా పరిశీలనకు ఉపయోగించారు. భూమికి 150 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న పాలపుంతలో ఈ నక్షత్రాలు కనుగొన్నారు. ఇవి పల్సర్స్‌కి దగ్గరి బంధువులు కావచ్చని అంచనా. అయితే వీటికి 'అటామిక్ క్లాక్' ఆఫ్ ది యూనివర్స్ అనే మరో పేరుతో వీటిని పిలుస్తారు. సాధారణంగా రేడియో పల్స్‌లను సాధారణ వ్యవధిలో ప్లాష్ చేస్తాయి.
ఈ నక్షత్రాల అయస్కాంత గోళాల చుట్టూ నిర్దిష్ట ప్రదేశాల్లో సంభవించే చిన్న పేలుళ్లుగా గతంలో పేర్కొన్న సిద్ధాంతాన్ని ఇప్పుడు పరిశీలనాత్మకంగా నిరూపించారు. ఎంఆర్‌పిల నుంచి వెలువడే రేడియో ఉద్గారాల ఎలక్ట్రాన్ సైక్లోట్రాన్ కొలతలను తెలియజేస్తాయని దాస్, పూనమ్ పేర్కొన్నారు. అటువంటి నక్షత్రాల చుట్టూ వాయు పదార్థాలను రవాణా చేయడంలో ఈ పేలుళ్లకు కొంత పాత్ర ఉంటుందని చెప్పారు.
'2000లో అలాంటి ఒక నక్షత్రం కనుగొన్నారు.. ఇప్పటివరకూ గుర్తించిన 15 ఎంఆర్‌పిలలో 11 జిఎంఆర్‌టి ఉపయోగించి కనుగొన్నవే.. ఒకప్పుడు అరుదైనవిగా పరిగణించే అలాంటి నక్షత్రాలు ఇంకా చాలా ఉన్నాయని చెప్పగలం' అని ప్రొఫెసర్ చంద్ర అన్నారు.