ఇప్పటి వరకూ ప్రపంచాన్ని వణికించిన కరోనా కేవలం మానవులపైనే అత్యధికంగా ప్రభావం చూపింది. అయితే ఇటీవల ఈ మహమ్మారి జంతువులకూ సోకుతోంది. ఆ మధ్య అమెరికాలో ఓ జింకకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ తర్వాత బ్రిటన్‌లో ఓ పెంపుడు కుక్క, పిల్లిలోనూ కరోనా లక్షణాలు కనిపించాయి. అయితే తాజాగా సింగపూర్‌లోని నైట్ సఫారీ జూలోని నాలుగు సింహాలకు కరోనా సోకిందని అధికారులు గుర్తించారు. అయితే వీటికి కరోనా ఎలా సోకిందన్న అంశం మాత్రం ఇంకా తెలీలేదు. అయితే జంతువులకు కరోనా వస్తుందా? ఏఏ జంతువులకు కరోనా సోకింది? వంటి విషయాలు తెలుసుకుందాం..!
మనుషులతో పాటు జంతువులకూ కరోనా సోకుతుండటం ఆందోళన కలిగిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా అనేక జూల్లో జంతువులు కరోనా బారిన పడుతున్నాయి. పెట్ డాగ్స్, క్యాట్స్‌లో కూడా కరోనా లక్షణాలు బయటపడుతున్నాయి. అయితే ఆ మధ్య బ్రిటన్‌లో ఓ పెంపుడు కుక్కకు కరోనా నిర్ధారణ అయిన విషయం మరువక ముందే ఎనిమిది పులులకు కరోనా సోకింది. అమెరికాలోని సెయింట్ లూయిస్ జూలోనూ ఎనిమిది పులులు కరోనా బారినపడినట్లు జూ అధికారులు ఈ మధ్య కాలంలోనే వెల్లడించిన విషయం తెలిసిందే.
వీటితోపాటు కరోనా సోకిన వాటిలో మరో రెండు సింహాలు, రెండు చిరుత పులులు, ఒక అమూర్ టైగర్, ఒక పూమా, రెండు జాగ్వార్‌లు ఉన్నాయి. వీటిలో కొన్నింటిలో స్వల్ప లక్షణాలు ఉండగా, మరికొన్ని జలుబు, దగ్గుతో బాధపడుతున్నాయని జూ అధికారులు తెలిపారు. అయితే జూలోని మిగతా జంతువులు క్షేమంగా ఉన్నట్లు మీడియాకు తెలిపారు. అయితే వీటికి కరోనా ఎలా సోకిందనే విషయాన్నీ జూ సిబ్బంది ఇప్పటికీ గుర్తించలేదు. కాగా జంతువుల నుంచి మనుషులకు కరోనా సోకుతుందని ఎక్కడా నిర్దారణ కాలేదని.. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సిడిసి) వెల్లడించింది.
మనుషుల నుంచి జంతువులకు..
అయితే మనుషుల నుంచి మాత్రం జంతువులకు వైరస్ వ్యాప్తిచెందుతున్నట్లు ఆధారాలున్నాయని తెలిపింది. కరోనా సోకిన జంతువులను వేరు చేసి ప్రత్యేక గదులకు షిఫ్ట్ చేసినట్లు వివరించారు. జూలోని జంతువులకు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడించారు.
కాగా అమెరికాలో ఆ జింకకు కరోనా ఎలా సోకిందన్నది ఇంకా తెలియరాలేదు. ఓహియో రాష్ట్రంలో ఓ అడవి తెల్ల తోక జింకకు వైద్య పరీక్షలు నిర్వహించగా, అది వైరస్ బారినపడిన విషయం వెల్లడైంది. అలాగే శాన్ డియాగో జూలో అనేక గొరిల్లాలూ దీని భారిన పడ్డాయి. ఈ నేపథ్యంలో జంతువుల నుంచి మనుషులు-జంతువుల మధ్య కరోనా వ్యాప్తిపై ఓహియో స్టేట్ విశ్వవిద్యాలయానికి చెందిన వెటర్నరీ కాలేజీ పరిశోధకులు అధ్యయనం చేపట్టారు. ఇందులో భాగంగా కొన్ని జంతువులకు కరోనా పరీక్షలు నిర్వహించగా జింక కరోనా భారినపడిన విషయం వెల్లడైంది. అయితే ఇప్పటివరకూ కుక్కలు, పిల్లులు, గొరిల్లాలు, చిరుతలు, సింహాలు కరోనా బారినపడగా, తాజాగా జింకకూ కరోనా సోకిందని తెలిసింది.
జాగ్రత్తలు పాటించాలి..
కాగా బ్రిటన్‌లో పెంపుడు పిల్లికి దాని ఓనర్ల నుంచే కరోనా సోకి ఉంటుందని డిపార్ట్‌మెంట్ ఫర్ ఎన్విరాన్‌మెంట్, ఫుడ్ అండ్ రూరల్ ఎఫైర్స్ ఓ స్టేట్‌మెంట్‌లో తెలిపింది. పిల్లికి సంబంధించిన యజమానులకు కరోనా టెస్టులు జరపగా వారికి పాజిటివ్ వచ్చింది. దీన్ని బట్టే వారి నుంచి వచ్చి ఉండవచ్చని అంచనా వేశారు. అయితే ప్రస్తుతం ఆ పిల్లికీ, దాని ఓనర్లకు కూడా కరోనా తగ్గిపోయింది. అయితే 'పెంపుడు జంతువుల ఓనర్లకు మా సూచన ఏంటంటే.. వాళ్లకు కరోనా వస్తే.. స్వయంగా ఐసోలేట్ అవ్వాలి. అలాగే.. పెంపుడు జంతువుల్ని తమ దగ్గరకు రానివ్వకుండా చేసి వాటిని కాపాడాలి. అలాగే అత్యంత శుభ్రత పాటించాలి. తరచూ చేతుల్ని కడుక్కోవాలి' అని బ్రిటిష్ వెటర్నరీ అసోసియేషన్ ప్రెసిడెంట్ డేనియల్లా డాస్ శాంటోస్ అన్నారు. దీన్నిబట్టి మనుషులు తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా జంతువులను కరోనా వైరస్ నుంచి కాపాడాలని విశ్లేషకులు చెబుతున్నారు.
సింగపూర్‌లో జూలో...
సింగపూర్‌లో పర్యాటక ఆకర్షణ అయిన నైట్ సఫారీ జూపార్కులో నాలుగు ఆసియా సింహాలకు కరోనా నిర్ధారణ అయ్యింది. జూ సిబ్బందిలో ముగ్గురికి కూడా వైరస్ సోకింది. దీంతో మరోసారి ఆందోళన చెందాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇక తగ్గిందనుకున్న ప్రతిసారి మళ్లీ మళ్లీ విజృంభిస్తోంది. అయితే తాజాగా జూపార్కులో సింహాలు కరోనా బారిన పడటంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. వైల్డ్‌లైఫ్ గ్రూప్‌లోని పరిరక్షణ, పరిశోధన, వెటర్నరీ వైస్ ప్రెసిడెంట్, జూ ఆపరేటర్ డాక్టర్ సోంజా లూజ్ ఈ మేరకు మీడియాకు వివరాలు అందించారు. మామూలుగా వైరస్‌లు జంతువులకు పెద్దగా హాని చేయలేవని, సరైన చికిత్సతో అవి పూర్తిగా కోలుకుంటాయని తెలిపారు. అయితే సింహాలకు సోకింది కరోనా కాబట్టి అవసరమైతేనే యాంటీ ఇన్‌ఫ్లమేటరీలు, యాంటీబయాటిక్స్ ఇస్తామని, సింహాల్లో రెండు రోజులుగా దగ్గు, తుమ్ములు, నీరసంతో పాటు తేలికపాటి లక్షణాలు కనిపించాయని జూ డాక్టర్లు తెలిపారు. దీంతో పాటు నైట్ సఫారీ జూపార్క్ సిబ్బందిలో ముగ్గురికి కూడా కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ కావడంతో మొత్తం జూను మూసేశామని అధికారులు తెలిపారు.