ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 27 నుండి వచ్చే నెల 3 వరకు నర్వహించనున్న కులగణన కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని అధికారులను పల్నాడు జిల్లా కలెక్టర్ ఆదేశించారు. నరసరావుపేట పట్టణం ప్రకాష్‌నగర్‌లోని భువనచంద్ర టౌన్ హాలులో జిల్లా అధికారులు, డివిజన్, మండల స్థాయి మరియు మండల ప్రత్యేక అధికారులతో ఆంధ్రప్రదేశ్ కుల గణన 2023 పై జిల్లా స్థాయి వర్క్‌షాపును శుక్రవారం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ కుల గణనపై ప్రజలలో అపోహలను తొలగించి అవగాహన కల్పించాలన్నారు. కుల గణన వల్ల ప్రభుత్వ పథకాలు అందవన్న ఆపోహలు వద్దన్నారు. సచివాలయంలోని ఫంక్షనల్ అసిస్టెంట్‌ల సేవలను వినియోగించు కోవలన్నారు. బూత్ లెవెల్ ఆఫీసర్లను ఈ ప్రక్రియలో భాగస్వామ్యం కానివ్వొద్దని చెప్పారు. ఈ నెల 25వ తేదీలోగా వాలంటీర్లు ఇంటి ఇంటి సర్వే చేసి కుల గణన వివరాలు తెలిపి అవగాహన కల్పించాలన్నారు. మాస్టర్ ట్రైనర్‌గా శిక్షణ పొందిన సత్తెనపల్లి మున్సిపల్ కమిషనర్ షమ్మి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా అధికారులకు వివరించారు. సూపర్ వైజర్‌లు విధిగా 200 ఇళ్లను సర్వే చేయాలని, సంక్షేమ శాఖలు తమ వంతు సహకారాన్ని అందించాలని చెప్పారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎ.శ్యాం ప్రసాద్, జిల్లా రెవెన్యూ అధికారి వినాయకం, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
20వ తేదీ నుండి 'ఆడుదాం ఆంధ్ర' రిజిస్ట్రేషన్
వచ్చే నెల 15 నుండి జనవరి 26 వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న 'ఆడుదాం ఆంధ్ర' కార్యక్రమంలో పల్నాడు జిల్లా క్రీడాకారులు పతకాలు సాధించేలా కృషి చేయాలని ఫిజికల్ డైరెక్టర్లు, పిఇటిలను జిల్లా కలెక్టర్ ఎల్.శివశంకర్ కోరారు. దీనిపై నరసరావుపేట పట్టణంలోని భువనచంద్ర టౌన్‌హాలులో జిల్లా అధికారులు, పీడీలు, పిఇటిలు, మండల అధికారులతో కలెక్టర్ శుక్రవారం సమీక్షించారు. 15 ఏళ్లు నిండిన యువత ఈనెల 20 నుండి ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాలన్నారు. జిల్లాలో 229 మైదానాలను గుర్తించామని, మండలానికి ఒక ఫిజికల్ డైరెక్టర్‌ను మండల కో-ఆర్డినేటర్‌గా నియమించామని తెలిపారు. క్రీడా సామగ్రి ఈ నెల 21 నుండి సరఫరా చేస్తామన్నారు. డిసెంబర్ 15వ తేదీ నుండి 20వ తేదీ వరకు సచివాలయ స్థాయిలో, డిసెంబర్ 21 నుండి జనవరి 4వ తేదీ వరకు మండల స్థాయిలో, జనవరి 5 నుండి 10వ తేదీ వరకు నియోజకవర్గ స్థాయిలో, జనవరి 11వ తేదీ నుండి జనవరి 25వ తేదీ వరకు జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహిస్తారని, రాష్ట్ర స్థాయిలో జనవరి 22వ తేదీ నుండి జనవరి 26వ తేదీ వరకు పోటీలు ఉంటాయని వివరించారు. అన్ని స్థాయిల్లోనూ విజేతలకు బహుమతులు ఉంటాయన్నారు. రాష్ట్ర స్థాయిలో ప్రథమ బహుమతిగా రూ.5 లక్షలు, ద్వితీయ బహుమతిగా రూ.3 లక్షలు, తృతీయ బహుమతిగా రూ.2 లక్షలు అందిస్తారన్నారు. నియోజకవర్గ, మండల స్థాయిలో ప్రతిభ చాటిన క్రీడాకారులకు సైతం బహుమతులు ఉంటాయన్నారు. క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ క్రీడాంశాల్లో పోటీలు ఉంటాయని తెలిపారు. ఎక్కువమంది యువత పోటీల్లో పాల్గొనేలా చూడాలన్నారు. సచివాలయ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో నిర్వహించే క్రీడా పోటీల్లో ప్రజా ప్రతినిధులు పాల్గొనేలా చూడాలన్నారు. కార్యక్రమములో జాయింట్ కలెక్టర్ ఎ.శ్యాంప్ర సాద్, జిల్లా రెవెన్యూ అధికారి వినాయకం, స్టెప్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి పల్లవి, వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు.