- హారన్ కొడితే దారి కాచి దాడి చేస్తారా?
- పరామర్శించేందుకూ అనుమతి కావాలనడంపై : కొల్లు రవీంద్ర ఆగ్రహం
ప్రజాశక్తి-కలక్టరేట్ (కృష్ణా) : దాడులు చేసి దౌర్జన్యాలకు పాల్పడిన వారికి పోలీసులు రక్షణగా నిలవడం ద్వారా రాష్ట్రాన్ని జగన్ రెడ్డి ఎటు తీసుకుపోతున్నాడని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, బీసీ సాధికార సమితి రాష్ట్ర అధ్యక్షులు కొల్లు రవీంద్ర అసహనం వ్యక్తం చేశారు. బెంగళూరు నుండి విజయవాడ వస్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ రాంసింగ్‌పై కావలి వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అనుచరుల దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న రాంసింగ్‌ను ఆదివారం పరామర్శించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాంసింగ్‌ను పరామర్శించేందుకు వెళ్లగా పోలీసులు అడ్డుకున్నారు. గేట్లకు తాళాలు వేసి అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితుల్ని పరామర్శిస్తామంటే పోలీసులు, జగన్ రెడ్డి అనుమతి తీసుకోవాలా అని నిలదీశారు. గేట్లు వేయడంతో పోలీసులతో వాగ్వాదం చోటు చేసుకుంది. పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ హారన్ కొట్టాడని స్థానిక కార్పొరేటర్ సహా దాదాపు 14 మంది వైసీపీ నేతలు దారి కాచి దాడి చేయడం దుర్మార్గం. ప్రతిఘటించిన మరో డ్రైవర్, ప్రయాణికులపై కూడా దాడికి పాల్పడడం, వీడియో తీసే ప్రయాణికుల ఫోన్లు లాక్కుని ధ్వంసం చేయడం రాష్ట్రంలో పెచ్చుమీరుతున్న వైసీపీ అరాచకానికి నిదర్శనం అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులపైనే ఈ స్థాయిలో దాడి చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? మొన్న పుంగనూరులో శ్రీకాకుళం జిల్లాకు చెందిన రెడ్డిక సోదరులపై దాడి చేశారు. అంతకు ముందు విజయవాడలో ధర్మవరానికి చెందిన వస్త్ర వ్యాపారులు బాకీ సొమ్ము అడిగినందుకు బట్టలిప్పి దాడి చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి ఈ ఘటనలపై నోరెత్తలేదు. నిన్నటి ఘటనపై ఆర్టీసీ ఎండీ గానీ, ఛైర్మన్‌గానీ పరామర్శకు కూడా రాలేదు. ఇలాంటి వారు సామాజిక యాత్ర అంటూ బస్సుల్లో తిరిగి ఏం సాధిస్తారు? సామాజిక వర్గాలపై జరుగుతున్న దాడుల్ని ప్రశ్నించని వారు యాత్రలు చేసి ఏం ఉద్దరిస్తారని ప్రశ్నించారు. ఎమ్మెల్యేకి తాపీ చూపించినందుకు ఓ సామాన్యుడి ఇంటికి వెళ్లి మరీ డీజీపీ బెదిరించాడు. మరి, ఈ ఘటనలపై ఎందుకు డీజీపీ స్పందించడం లేదు? దాడులకు పాల్పడే వారిపై పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించడం కారణంగానే ఈ స్థాయిలో వైసీపీ రౌడీలు పెచ్చుమీరిపోతున్నారు. పోలీసులు చట్టబద్దంగా నడచుకుంటే ఇలాంటి పరిస్థితి ఉంటుందా? బీసీలుగా పుట్టడమే మేం చేసిన తప్పా అన్నారు. యాత్రల పేరుతో హడావుడి చేసే అధికార పార్టీ నాయకులు ముందు ఈ ఘటనపై ఏం సమాధానం చెబుతారని కొల్లు రవీంద్ర నిలదీశారు.