కాలుష్యం కనికరం లేకుండా కాటేస్తున్న రోజులివి. ప్రపంచ వ్యాప్తంగా వాయు కాలుష్యం పెరిగిపోతోంది. అదే విధంగా దేశంలోనూ కాలుష్యం పెరుగుదల రేటు ఆందోళన కలిగిస్తోందని ఇటీవల సిపిసిబి (సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్) నివేదికను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో పట్టణాలు, మహా నగరాల్లోని చాలామంది ఇళ్లలో టీవీల మాదిరిగానే ఎయిర్ ప్యూరిఫయర్‌లు వినియోగించాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో రోపార్ అండ్ కాన్పూర్‌కి చెందిన ఇండియన్ ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు, ఢిల్లీ విశ్వవిద్యాలయం మేనేజ్‌మెంట్ స్టడీస్ శాస్త్రవేత్తలు సంయుక్తంగా 'యుబ్రీథ్ లైఫ్' అనే వైవిధ్యమైన ఎయిర్ ప్యూరిఫయర్‌ను రూపొందించారు. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి మొక్కల ఆధారిత ఎయిర్ ప్యూరిఫయర్. అసలు దీనిలోని విశేషం ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది? వంటి విశేషాలు తెలుసుకుందాం !
సురక్షితమైన వాతావరణం, గాలి కావాలన్నా, పర్యావరణ సమతుల్యత సక్రమంగా ఉండాలన్నా మొక్కలతోనే సాధ్యం. భూమ్మీద ఎంత ఎక్కువగా మొక్కలు ఉంటే అంత సురక్షితమైన గాలి మానవులకు, జంతుజాతులకు అందుతుంది. అయితే ఇటీవల పరిస్థితులు ఇందుకు భిన్నంగా మారుతున్నాయి. రాను రాను వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. ఫలితంగా చాలామంది ఇళ్లలో టీవీల మాదిరిగానే ఎయిర్ ప్యూరిఫయర్‌లు వినియోగించాల్సిన పరిస్థితి నెలకొంటోంది. దేశం మొత్తం ఇలా ఉందని చెప్పలేం కానీ.. ప్రధాన నగరాలు, పట్టణాల పరిస్థితి ఇలానే ఉంది. ప్రధానంగా ఢిల్లీలో ఇటీవల పెరిగిన వాయు కాలుష్యమే ఇందుకు ప్రధాన సాక్ష్యం. దీంతో మార్కెట్‌లో కొత్త కొత్త రకాల ఎయిర్ ప్యూరిఫయర్లు వస్తున్నాయి. ఈ క్రమంలో రోపార్ అండ్ కాన్పూర్‌కి చెందిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు, ఢిల్లీ విశ్వవిద్యాలయం మేనేజ్‌మెంట్ స్టడీస్ శాస్త్రవేత్తలు కలసి వైవిధ్యమైన ఎయిర్ ప్యూరిఫయర్‌ను రూపొందించారు. దీని ప్రత్యేకత ఏంటంటే..? ఇందులో ప్యూరిఫయర్‌తో పాటు మొక్క కూడా ఉంటుంది. ఈ మొక్క ఆధారిత ప్యూరిఫయర్‌ను 'యుబ్రీథ్ లైఫ్' అని పిలుస్తున్నారు. ఐఐటీ రోపార్‌కు చెందిన స్టార్టప్ కంపెనీ అర్బన్ ఎయిర్ లేబొరేటరీ దీన్ని రూపొందించింది.
అంతేకాదు ప్రపంచంలోనే ఇది తొలి స్మార్ట్ బయో ఫిల్టర్ అని చెబుతున్నారు. ఐఐటీ రోపార్‌కు చెందిన ఐ హబ్- ఏడబ్ల్యూఏడీహెచ్ (అగ్రికల్చర్ అండ్ వాటర్ టెక్నాలజీ డెవలప్‌మెంట్ హబ్) లో దీన్ని రూపొందించారు. ఇండోర్‌లో ఈ ప్యూరిఫయర్లను వాడటం వల్ల ఎయిర్ ప్యూరిఫికేషన్ ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంటే ఆస్పత్రులు, స్కూళ్లు, ఆఫీసులు, ఇళ్లలో వాడుకునేందుకు అనుకూలంగా దీన్ని రూపొందించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ఎయిర్ ప్యూరిఫయర్ మొక్క ఆధారంగా పనిచేస్తుందట. అంటే ఏదైనా గదిలో ఈ యంత్రాన్ని పెట్టినప్పుడు.. మొక్క ఆకులు గాలితో ఇంటరాక్ట్ అవుతాయి.
ఆ తర్వాత మట్టిలోకి వెళ్లి, కాలుష్య కారకాలను గాలి నుంచి తొలగిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ విధానాన్ని 'అర్బన్ మున్నార్ ఎఫెక్ట్' అంటారు. అంటే మొక్కల ఆకులు గాలిని పీల్చుకోవడం ద్వారా పైథోరెమిడేషన్ చర్య జరిగి, గాలి శుభ్రపడుతుంది. దీనివల్ల గాలిలోని వాయువులు, పార్టిక్యులేట్స్, బయోలాజికల్ కంటైన్మెంట్లను తగ్గించి, ఆక్సిజన్ స్థాయి పెరుగుతుందట.
దీంతోపాటు ప్యూరిఫయర్‌కు ఉపయోగిస్తున్న బాక్సులో యూవీ డిస్‌ఇన్‌ఫెక్షన్, ప్రీ ఫిల్టర్, ఛార్‌కోల్ ఫిల్టర్, హెపా ఉంటాయి. వాటి వల్ల గాలి మరింతగా శుభ్రపడుతుందట. ఫిల్టర్ చెక్క బాక్స్ మధ్యలో ఫ్యాన్ ఉంటుందట. ఇది గదిలోని గాలిని సక్షన్ ద్వారా పీలుస్తుంది.
ఆ తర్వాత పైన ఉన్న మొక్క ద్వారా శుభ్రం చేసి, బయటకు విడిచిపెడుతుంది. అయితే దీని కోసం ప్రత్యేకంగా పీస్ లిల్లీ, స్నేక్ ప్లాంట్, స్పైడర్ ప్లాంట్‌ను వాడాలట. అవైతే ఎక్కువ ఫలితాలు ఇస్తున్నాయని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. నేషన్ అక్రిడేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబరేషన్ లేబొరేటరీ, ఐఐటీ రాపోర్ లేబొరేటరీలో జరిగిన పరీక్షల్లో ఈ ప్యూరిఫయర్ల వల్ల గాలి నాణ్యత బాగా పెరిగిందని తేలిందట. 150 స్క్వేర్ ఫీట్ల గదిలో ఈ ప్యూరిఫయర్‌ను పెడితే.. 15 నిమిషాల్లో గాలిలో కాలుష్యం శాతం 311 నుంచి 39కి చేరిందట.