ఈ సృష్టిలో ఎన్నో అద్భుతాలు.. మరెన్నే అంతుపట్టని వింతలు, విశేషాలు దాగున్నాయి. అయితే మానవుడు వాటిపై ఎప్పటికప్పుడు పరిశోధనలను చేస్తూ అనేక కొత్త విషయాలు కొనుగొంటున్నాడు. అంతేకాదు అనేక విషయాల్లో విజయాలను సాధిస్తున్నాడు. తాజాగా అమెరికాలోని సిరక్యూస్ విశ్వవిద్యాలయంలో విజువల్ ఆర్ట్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న సామ్ వాన్ అకెన్ ఓ అసాధారణమైన అద్భుతాన్ని చేసి, చూపించారు. ఆయన సృష్టించిన ఈ అద్భుతం గురించి చెబితే విన్న వారెవరైనా ఒక్కసారిగా గుడ్లు తేలేస్తారు. 'ట్రీ ఆఫ్ 40' ఆయన సాధించిన విజయం. మరి 'ట్రీ ఆఫ్ 40' ఏంటి? అది ఎలా సాధ్యమైంది? వంటి విషయాలు తెలుసుకుందాం.
సాధారణంగా ఒక చెట్టుకు ఒకేరకమైన కాయలు కాస్తాయి. అయితే అమెరికాలోని ఒక చెట్టుకు మాత్రం ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 40 రకాల కాయలు కాస్తున్నాయి. అంటుకట్టడంలో వినూత్న పద్ధతులను ఉపయోగించి, ఇలాంటి చెట్టును సృష్టించాడు ఒక రైతు. 40 రకాల పండ్లు అందించే ఈ అసాధారణమైన చెట్టును సామ్‌వాన్ అకెన్ అనే అమెరికన్ రైతు సృష్టించారు. ఆయన సిరక్యూస్ యూనివర్సిటీలో విజువల్ ఆర్ట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఈయన సృష్టించిన చెట్టుకు.. మామిడి, జామ, బెర్రీలు, రేగి రకాలు, పీచ్, నేరేడు, ఆప్రికాట్స్, చెర్రీస్ వంటి 40 రకాల ఫలాలు పండుతాయి. నమ్మశక్యంగా లేకపోయినా, ఇది ముమ్మాటికీ నిజం. ఈ వింతను చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఈ అసాధారణమైన విజయాన్ని సాధించేందుకు అకెన్ ఎంతో శ్రమించారు.
ఇలా సాధ్యమైంది ?
అంటుకట్టు (గ్రాఫ్టింగ్) విధానం ద్వారా సామ్‌వాన్ అకెన్ ఈ ప్రత్యేకమైన మొక్కను సృష్టించి, అద్భుతమైన విజయాన్ని సాధించారు. అయితే ఈ చెట్టు ఫలించడానికి దాదాపు తొమ్మిది సంవత్సరాలు పట్టిందట. అంటుకట్టడం అంటే..? సాధారణంగా ఏదైనా ఒక అంటు చెట్టుకి ఇతర చెట్టు కొమ్మను గట్టిగా అతికిస్తారు. అప్పుడు అంటు చెట్టు.. ఇతర చెట్టు కొమ్మకు పోషకాలను సమంగా అందిస్తుంది. తద్వారా ఆ ఇతర చెట్టు కొమ్మ చక్కగా పెరుగుతుంది. ఇదే విధానాన్ని పాటించిన ప్రొఫెసర్ సామ్.. మొగ్గ ఉన్న ఓ చెట్టు కొమ్మను వేరు చేసి, ప్రధాన చెట్టుకు చలికాలంలో అంటుకట్టారు. ఈ అద్భుతమైన చెట్టుకు ప్రాణం పోసేందుకు 2008 నుంచి ఆయన గ్రాఫ్టింగ్ విధానాన్ని పాటిస్తున్నారు.
న్యూయార్క్ స్టేట్ అగ్రికల్చరల్ ఎక్స్‌పరిమెంట్ స్టేషన్‌లోని ఒక తోట గురించి తెలుసుకున్న తర్వాత ప్రొఫెసర్ సామ్ ఈ చెట్టును రూపొందించాలని నిర్ణయించుకున్నాడు. ఆ సమయంలో ఈ తోటలో 200 కంటే ఎక్కువ రకాల రేగు పండ్లు, నేరేడు పండ్లు పండించేవారు. కానీ సరిపడా నిధుల్లేక ఈ తోటను నిరుపయోగంగా వదిలేస్తున్నారని సామ్ తెలుసుకున్నారు. దీంతో ఆ తోటను కౌలుకు తీసుకొని (స్కల్ప్చ్‌ర్ థ్రూ గ్రాఫ్టింగ్) అనే ప్రయోగాలు చేయడం ప్రారంభించారు. ఏళ్ల తరబడి కృషి చేసి విజయవంతంగా ఒకే చెట్టుకి రేగు, పీచ్, నేరేడు, చెర్రీస్ వంటి 40 రకాల నోరూరించే పండ్లను పండించగలిగారు.
అయితే ప్రొఫెసర్ కేవలం స్టోన్ ఫ్రూట్స్ మాత్రమే ఎంచుకున్నారు. ఎందుకంటే ఈ పండ్లను సింగిల్ కల్చర్ వ్యవసాయ పద్ధతుల్లోనే పండిస్తున్నారు. అందుకే ఈ పండ్లను విభిన్న పద్ధతుల్లో పండించాలని నిర్ణయించుకున్నారు. దీన్ని ఒక సైంటిఫిక్ అట్టెంప్ట్‌లా కాకుండా ఓ ఆర్ట్ ప్రాజెక్టుగానే భావిస్తున్నట్లు ప్రొఫెసర్ చెబుతున్నారు. ప్రతి పండూ భిన్న సమయాల్లో కాస్తాయని, వివరించారు. వేసవిలో ఎక్కువరకాల ఫలాలను అందిస్తుందని, అందుకు అనుగుణంగా తాను చెట్టుని మార్చానని వివరించారు. అయితే వ్యవసాయంపై తనకున్న ఎనలేని ప్రేమ కారణంగానే ఈ ఘనతను సాధించగలిగానని సామ్ చెబుతారు.