భారత దేశంలోని పశ్చిమ కనుమలు పలు రకాల కొత్త వృక్షాల ఆవిష్కరణలకు కేంద్ర బిందువులుగా మారుతున్నాయి. తాజాగా దేశవ్యాప్తంగా 267 కొత్త వృక్షజాతులను కనుగొన్నట్లు బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రచురించిన ప్లాంట్ డిస్కవరీ 2020 జర్నల్‌లో పేర్కొంది. అయితే దేశంలో పశ్చిమ కనుమలు మహారాష్ట్ర నుంచి తమిళనాడు వరకూ పశ్చిమ తీరానికి సమాంతరంగా సుమారు 1600 కి.మీ. పొడవున విస్తరించి ఉన్నాయి. పశ్చిమ కనుమల్లో ఎత్తయిన శిఖరం అనైముడి (2695 మీ.). ఇది ద్వీపకల్ప పీఠభూమిలోనే ఎత్తయినది. భారతదేశంలో ఎత్తయిన జోగ్/జొర్సొప్పా జలపాతం (275 మీ.) పశ్చిమ కనుమల్లోని శరావతి నదిపై ఉంది.
బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా తాజాగా దాని కొత్త ప్రచురణ ప్లాంట్ డిస్కవరీస్ 2020లో 267 కొత్త టాక్సా/జాతులను దేశ వృక్షజాలానికి చేర్చింది. అయితే మొత్తం 267 కొత్త ఆవిష్కరణల్లో 119 యాంజియోస్పెర్మ్‌లు ఉన్నాయి. 3 స్టెరిడోఫైట్స్, 5 బ్రయోఫైట్స్, 44 లైకెన్లు, 57 శిలీంధ్రాలు, 21 ఆల్గే, 18 సూక్ష్మజీవులుగా గుర్తించారు. 2020లో, దేశవ్యాప్తంగా 202 కొత్త మొక్కల జాతులు కనుగొన్నారు. వీటితో 65 కొత్త రికార్డులు జోడించబడ్డాయి. ఈ కొత్త ఆవిష్కరణలతో భారతదేశంలో మొక్కల వైవిధ్యం యొక్క తాజా అంచనా 21,849 యాంజియోస్పెర్మ్‌లు, 82 జిమ్నోస్పెర్మ్‌లు, 1310 స్టెరిడోఫైట్స్, 2791 బ్రయోఫైట్‌లు, 2961 లైకెన్‌లు, 15,504 శిలీంధ్రాలు, 8979 ఆల్గేలు, 1257 మైక్రోబ్స్‌తో సహా 54,733 టాక్సాలో ఉన్నాయి.
తొమ్మిది కొత్త జాతుల బ్లాసమ్‌లు (ఇంపాటియన్స్) డార్జిలింగ్ నుండి ఒక జాతి అడవి అరటి (మూసా ప్రధాని) కనుగొనబడ్డాయి. కోయంబత్తూర్ నుండి అడవి జామూన్ (సిగిజియం అనమాలయానమ్), ఒడిశాలోని కందమాల్ నుండి ఫెర్న్ జాతులు (సెలాగినెల్లా ఒడిషానా) ఒక్కొక్క జాతిని నమోదు చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి 14 కొత్త మ్యాక్రో(స్థూల), 31 కొత్త మైక్రో (సూక్ష్మ) శిలీంధ్రాలు నమోదు చేయబడ్డాయి.
కొత్తగా కనుగొన్న ఈ మొక్కల భౌగోళిక పంపిణీని అంచనా వేస్తే 22%ఆవిష్కరణలు పశ్చిమ కనుమల నుంచి గుర్తించారు. కాగా పశ్చిమ హిమాలయాలు (15%), తూర్పు హిమాలయాలు (14%), ఈశాన్య శ్రేణులు (12%) గుర్తించినట్లు తెలుస్తుంది.
మొత్తం ఆవిష్కరణలలో ఈస్ట్ కోస్ట్ నుంచి (9%) లభించగా, పశ్చిమ తీరం 10%, తూర్పు కనుమలు, దక్షిణ దక్కన్ నుంచి ఒక్కొక్కటి 4% చొప్పున గుర్తించారు. సెంట్రల్ హైలాండ్, నార్త్ డెక్కన్ నుంచి 3% చొప్పున జోడించబడ్డాయి. అయితే భారతీయ వృక్షజాలంలో 267 మొక్కల టాక్సాలను అధనంగా చేర్చడం, ఇవి కొత్త జాతులుగా దేశంలోనే ఒకటిన్నర దశాబ్ద కాలంలో కనుగొన్న సగటు ఆవిష్కరణల సంఖ్య కంటే ఇది ఎక్కువని బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఎఎ మావో అన్నారు. ఈ కొత్త ఆవిష్కరణలతో కలిపి భారతదేశంలో మొక్కల వైవిధ్యం యొక్క తాజా అంచనా 54,733 టాక్సాలుగా ఉంది. ఇందులో 21,849 యాంజియోస్పెర్మ్‌లు, 82 జిమ్నోస్పెర్మ్‌లు, 1310 స్టెరిడోఫైట్స్, 2791 బ్రయోఫైట్‌లు, 2961 లైకెన్‌లు, 15,504 శిలీంధ్రాలు, 8979 ఆల్గేలు, 1257 మైక్రోబ్స్ ఉన్నాయి.
భారతదేశం వృక్ష సంరక్షణే ప్రధాన లక్ష్యంగా పనిచేయడానికి కట్టుబడి ఉందని, ఇందుకు తాజాగా గుర్తించిన వృక్ష జాతులే ఉదాహరణ అని ప్లాంట్ డిస్కవరీస్ ప్రచురణను విడుదల చేసిన జీవ వైవిధ్య కన్వెన్షన్ (సిబిడి) అదనపు కార్యదర్శి రవి అగర్వాల్ అన్నారు. అంతేకాకుండా దేశంలో అనేక తినదగిన అడవి మొక్కలు, సాంప్రదాయ మొక్కలు, ఔషధ మొక్కలు, సౌందర్య సాధనాలుగా ఉపయోగపడే మొక్కలు, అడవిజాతికి చెందిన ఆహార పంటల మొక్కలు ఉన్నాయన్నారు.
ఈ ఆవిష్కరణలలో కీలక పాత్ర పోషించిన బిఎస్‌ఐకి చెందిన మరో శాస్త్రవేత్త, ఎస్‌ఎస్ దాషా మాట్లాడుతూ 45% విత్తన మొక్కలు, 21% శిలీంధ్రాలు, 8% ఆల్గే, 16% లైకెన్, 7% సూక్ష్మజీవులు, 2% బ్రయోఫైట్స్, 1% స్టెరిడోఫైట్స్‌ని గుర్తించినట్లు వివిధ జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్‌లో ప్రచురించినట్లు తెలిపారు. అయితే ఈ ఏడాది మోనోజెనెరిక్ ఫ్యామిలీకి చెందిన హంగువానేసి మొక్కను భారతదేశంలో మొదటిసారిగా గుర్తించిన ఒక కొత్త జాతిగా నమోదుచేసినట్లు తెలిపారు.
వృక్షశాస్త్రజ్ఞుడు సంజరు కుమార్ 2012 నుండి మొక్కల ఆవిష్కరణల సంకలనంలో బిఎస్‌ఐతో పని చేస్తున్నట్లు తెలిపారు. గత దశాబ్ద కాలంలో భారతదేశంలో వివిధ మొక్కల సమూహాల నుండి మొత్తం 3,245 టాక్సాల మొక్కలు కనుగొనబడ్డాయని వివరించారు. 1,199 (37%) టాక్సాతో సీడ్ ప్లాంట్లు, ఫంగస్ 894 (27%) ఆవిష్కరణలు జరిగినట్లు వివరించారు.