Sep 20,2021 07:17

సౌర తుపాను 2021 గురించి గత కొద్ది కాలంగా శాస్త్రవేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనివలన ఇంటర్నెట్‌ పూర్తిగా షట్‌ డౌన్‌ అయ్యే ప్రమాదం ఉందంటున్నారు. దీనివల్ల కొన్ని గంటలు లేదా కొన్ని రోజులపాటు ఇంటర్నెట్‌ బ్లాకవుట్‌ అయ్యే ప్రమాదముందని, కమ్యూనికేషన్‌ వ్యవస్థ కుప్పకూలుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు అవి ఉపగ్రహాలు, పవర్‌ గ్రిడ్‌లు, చమురు, గ్యాస్‌ పైప్‌లైన్‌లను కూడా దెబ్బతీస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. మరికొంతమంది శాస్త్రవేత్తలు మాత్రం దీన్ని కొట్టిపారేస్తున్నారు. ఈ ఏడాది జులైలోనూ సౌర తుపాను భూమి వైపు ముంచుకొస్తుందని వార్తలు రాగా అలాంటిదేం జరగలేదు. ఇంతకీ సౌర తుపాను అంటే ఏమిటి? దాని వల్ల భూగ్రహానికి జరిగే నష్టమేంటి? ఇది వరకు సౌర తుపానులు వచ్చాయా? వస్తే అప్పుడేం జరిగిందో తెలుసుకుందాం..!
    సౌర కుటుంబానికి మూలాధారం, కేంద్ర బిందువుగా ఉండే సూర్యుడే.. భూమి మీద జీవానికి ప్రాణాధారం. సూర్యుడి వేడి, శక్తి లేకుంటే భూమి మీద జీవమే ఉండదు. అయితే నిత్యం అగ్నిగోళంలా మండిపోయే భానుడి నుంచి ఎప్పుడూ సౌర మంటలు, సన్‌స్పాట్స్‌, కరోనల్‌ మాస్‌ ఎజెక్షన్‌ (సీఎమ్‌ఈ) లు సహా సౌర తుపానులు అంతరిక్షంలోకి విస్ఫోటనం చెందుతాయి. ఈ పేలుళ్ల వల్ల విద్యుదావేశ కణాలు లక్షల కిలోమీటర్ల దూరం వరకూ ఎగజిమ్ముతాయి. ఆ విపరీతమైన వేడికి అయాన్లు భూమ్యాకర్షణ శక్తి వల్ల అటువైపుగా ప్రయాణిస్తాయి. అలా ఈ వాయుగోళం 149.8 మిలియన్‌ కిలోమీటర్ల దూరం అవతల ఉన్న భూగ్రహ ఎగువ వాతావరణం (అప్పర్‌ అట్మోస్పియర్‌) లోకి ప్రవేశించినప్పుడు, దాని ప్రభావం ఇంటర్నెట్‌ కేబుల్స్‌, ఉపగ్రహాలు, పవర్‌ గ్రిడ్‌లు, చమురు, గ్యాస్‌ పైప్‌లైన్‌లపై ఉంటుంది.
 

ఎస్‌ఐజీసీఓఎంఎం 2021 కాన్ఫరెన్స్‌లో వెల్లడి..
గత నెలలో జరిగిన ఏసీఎం ఎస్‌ఐజీసీఓఎంఎం 2021 కాన్ఫరెన్స్‌లో ప్రదర్శితమైన ఓ పరిశోధన ఈ విషయాన్ని వెల్లడించింది. అత్యంత శక్తిమంతమైన సౌరశక్తి ఇంటర్నెట్‌కు విఘాతం కలిగిస్తుందని, కమ్యూనికేషన్‌ శాటిలైట్లు, సబ్‌ మెరైన్‌ కేబుల్స్‌ను ధ్వంసం చేస్తుందని ఆ పరిశోధన చెప్పింది. రానున్న పదేళ్లలో అంతరిక్షంలో విపరీతమైన వాతావరణం ఏర్పడే అవకాశం 1.6 నుంచి రెండు శాతం ఉందని, ఇప్పటికే కొన్ని పరిశోధనలూ తేల్చాయి. కొరోనల్‌ మాస్‌ ఎజెక్షన్‌ అని ఖగోళ శాస్త్రవేత్తలు సంబోధించే ఈ సౌర తుపాను గంటకు కోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. ఇది భూమిని చేరేందుకు 13 గంటల నుంచి ఐదు రోజుల వరకు పట్టవచ్చు.
 

ఆసియా దేశాలకు తక్కువ నష్టం..
ఒక వేళ సౌర తుపాను విరుచుకుపడితే ఆసియా దేశాలకు తక్కువ నష్టం వాటిల్లే అవకాశం ఉందని అంటున్నారు. ఎందుకంటే భూమధ్య రేఖకు దగ్గరగా సముద్ర గర్భ కేబుల్స్‌ ఉండటం కలిసొచ్చే అంశమని చెబుతున్నారు. ఈ లెక్కన భారత్‌ సహా మరికొన్ని దేశాల కమ్యూనికేషన్‌ వ్యవస్థపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అట్లాంటిక్‌, ఫసిఫిక్‌ మహాసముద్రాల పరిధిలోని అంతర్గత కేబుల్‌ వ్యవస్థ మాత్రం సౌర తుపానుతో ఘోరంగా దెబ్బతింటుందని అంటున్నారు.
 

సౌర తుపాను అంటే ?
సూర్యుడి ఉపరితలం నుంచి దూసుకొచ్చే ఉధృతమైన అయస్కాంత తరంగాలనే సౌర తుపానుగా పిలుస్తారు. ఈ అయస్కాంతీకృత, విద్యుదావేశ సౌర కణాలు భూమి అయస్కాంత క్షేత్రంతో అనుసంధానమై, బలమైన విద్యుత్‌ ప్రవాహాలను ప్రేరేపిస్తాయి. ఈ సౌర తుపానులు.. అవి సంభవించిన, విడుదలైన శక్తిని బట్టి అనేక రకాలుగా ఉంటాయి. ఇందులో అత్యంత సాధారణమైనది 'సోలార్‌ ఫ్లేర్‌'. సూర్యుడిపై సంభవించే పేలుళ్లను 'సన్‌ స్పాట్‌'గా పిలుస్తారు. సూర్యుని ఉపరితలం నుంచి భారీ అయనీకరణ కణాలతో కూడిన పేలుడే 'కరోనల్‌ మాస్‌ ఎజెక్షన్‌ ఈవెంట్‌'. ఇది దాని మార్గంలో ఉన్న ప్రతిదానిపై ప్రభావం చూపుతుంది. అంతేకాదు అయనీకరణం చెందిన కణాలు భూమి చుట్టూ తిరుగుతున్న కృత్రిమ ఉపగ్రహాలను నాశనం చేయగలవు. ఇక సౌర తుపానుల విషయానికి వస్తే అవి చాలా అరుదుగా వస్తుంటాయి.
 

1859 కారింగ్టన్‌ ఈవెంట్‌..
1859, ఆగస్టు 28 - సెప్టెంబర్‌ 3, సోలార్‌ ఫ్లేర్‌ను గమనించడంతో పాటు డాక్యుమెంట్‌ చేసిన ఇద్దరు ఖగోళ శాస్త్రవేత్తల్లో ఒకరైన రిచర్డ్‌ కారింగ్టన్‌ పేరు మీద తొలి సౌర తుపానుకు ఆయన పేరే పెట్టారు. ఈ సౌర తుపాను రెండు కరోనల్‌ మాస్‌ ఎజెక్షన్లుగా వచ్చింది. రెండోది చాలా తీవ్రంగా రావడంతో, ఇది భూ అయస్కాంత తుపానును ప్రేరేపించింది. ఈ క్రమంలోనే ఓజోన్‌ పొరలో ఐదు శాతం విచ్ఛిన్నం చేయగా, ప్రపంచ టెలిగ్రాఫ్‌ వైర్ల ద్వారా ప్రవహించే విద్యుత్‌ ప్రవాహాలను ప్రభావితం చేసింది.
 

అరోరల్‌ స్మార్ట్‌ - 1582
తూర్పు ఆసియాలో ప్రాచీన అరోరల్‌ సంఘటనల రికార్డులను విశ్లేషిస్తున్నప్పుడు, శాస్త్రవేత్తలు 1582లో తీవ్ర తుపాను సంభవించినట్లు కనుగొన్నారు. రెడ్‌ అరోరా సిఎమ్‌ఈల వల్ల సంభవించి ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావించారు. దీని డిఎస్‌టి విలువలు -580 నుంచి -590 ఎన్‌టి రేంజ్‌లో కొలుస్తారు. 16వ శతాబ్దంలో కొన్ని అధునాతన సాంకేతికతలు ఉనికిలో ఉన్నా, ఈ తుపాను వల్ల వాటికి ఎలాంటి అంతరాయం జరగలేదు. 1972, 89, 2001, 2003లో సౌర తుపానులు సంభవించాయి. అయితే 2012 జులై 23లో ఓ సోలార్‌ స్ట్రార్మ్‌, నాసాకు సంబంధించిన సోలార్‌ టెర్రెస్ట్రియల్‌ రిలేషన్స్‌ ఆబ్జర్వేటరీ శాటిలైట్‌ను ఢకొీట్టింది. ఒకవేళ ఆ సోలార్‌ సూపర్‌స్ట్రార్మ్‌ మనల్ని తాకినట్లయితే, అది రెండు ట్రిలియన్‌ డాలర్ల మేర నష్టాన్ని కలిగించేదని నాసా పేర్కొంది.