Sep 05,2021 17:14

అమెరికాలోని బీచ్‌లకు వేల సంఖ్యలో శాండ్‌ డాలర్లు కొట్టుకొస్తున్నాయి. నీటి నుంచి బయటకు వచ్చిన వెంటనే ఇవి ప్రాణాలు విడుస్తున్నాయి. దీంతో సముద్ర నిపుణులు, పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో ఇవి ఎందుకు ఒడ్డుకు వస్తున్నాయో తెలుసుకునే ప్రయత్నాల్లో నిమగమయ్యారు. అసలు శాండ్‌ డాలర్స్‌ అంటే ఏంటి..? ఆ జీవుల ప్రత్యేకతేంటి..? వాటిని శాండ్‌ డాలర్లుగా ఎందుకు పిలుస్తున్నారో తెలుసుకుందాం..!


శాండ్‌ డాలర్స్‌ అంటే ఒక రకమైన సముద్రజీవులు. అయితే ఇవేమీ కరెన్సీ కాదు. ఇసుకతో చేసిన కరెన్సీ అసలు కాదు. శాండ్‌ డాలర్స్‌ సముద్ర ఉపరితలంలో ఉండే చిన్నపాటి ప్రాణులు. వీటిని సీ కుకీస్‌, స్నాపర్‌ బిస్కెట్స్‌ అని కూడా పిలుస్తారు. రూపం, పరిమాణం కారణంగా వీటికి శాండ్‌ డాలర్స్‌ అనే పేరు వచ్చింది. క్లిపెస్టెరోడియా జాతికి చెందిన శాండ్‌ డాలర్లు సైజులో చాలా చిన్నగా ఉంటాయి. సగటున దాదాపు నాలుగు అంగుళాల పరిమాణంలో ఉంటాయి. అయితే మనం ఇప్పటివరకూ తెలుసుకోని ఈ ప్రత్యేక జీవులు ఇప్పుడు సముద్రం నుంచి తీరానికి వస్తున్నాయి.

సముద్ర తీరంలో.. శాండ్‌ డాలర్స్‌!


మధ్య, దక్షిణ అమెరికా సముద్ర ప్రాంతాల్లో వేడి ఎక్కువగా ఉండే నీటిలో ఈ శాండ్‌ డాలర్లు జీవిస్తాయి. అలాగే అమెరికా తూర్పు తీరంలోనూ కనిపిస్తాయి. సముద్రంలో తీవ్రమైన అలలు, ఆటుపోట్ల కారణంగా శాండ్‌ డాలర్లు ఒడ్డుకు కొట్టుకువస్తున్నట్టు సమాచారం. సముద్రం బయటికి వచ్చాక శాండ్‌ డాలర్లు నిమిషాలకు మించి జీవించలేవు. నీళ్లు లేకుండా వీటి శరీరం త్వరగా పొడిగా మారి చనిపోతాయి.

వాస్తవానికి ఈ శాండ్‌ (ఇసుక) డాలర్స్‌ ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తాయి. వీటిలో అనేక భిన్న జాతులు ఉన్నాయి. వాటిలో ఒక్కోదానికీ ఒక్కో ప్రత్యేక లక్షణం. ఈ శాండ్‌ డాలర్లు సముద్రపు ఆర్చిన్‌లకు సంబంధించినవి. వీటి షెల్‌ వెలుపల వేలాది చిన్ని చిన్న 'ఫజ్‌' లేదా వెంట్రుకలతో కప్పబడి ఉంటుంది. ఈ స్పైన్స్‌ ఇసుక డాలర్లు కదలడానికి, ఆహారం తీసుకోడానికి సహాయపడతాయి. ఇసుక డాలర్‌ అడుగుభాగాన మధ్యలో నోరు ఉంటుంది. ఇది నాచును ఆహారంగా తీసుకుంటుంది. వీటికి పక్షి ఆకారాన్ని పోలిన ఐదు చిన్న దంతాలు ఉంటాయి. అందుకే వీటిని చాలా మంది 'డోవ్స్‌' అని పిలుస్తారు.

సముద్ర తీరంలో.. శాండ్‌ డాలర్స్‌!


అయితే వెస్ట్‌ కోస్ట్‌లో పురాతన ఆక్వేరియం అయిన సీసైడ్‌ ఆక్వేరియం... శాండ్‌ డాలర్లు ఒడ్డుకు కొట్టుకొచ్చిన వీడియోను ఫేస్‌బుక్‌ పేజ్‌లో పోస్ట్‌ చేసింది. అసలు బీచ్‌లోకి ఇంత పెద్ద సంఖ్యలో శాండ్‌ డాలర్లు కొట్టుకొచ్చేందుకు గల కారణాన్ని స్పష్టంగా చెప్పలేకపోతున్నామని సీసైడ్‌ వెల్లడించింది. ఆటుపోట్ల కారణాలను కూడా కచ్చితంగా గుర్తించలేకపోతున్నట్టు తెలిపింది.


'సీసైడ్‌ బీచ్‌ దక్షిణ ప్రాంతానికి జీవంతో ఉన్న వేల శాండ్‌ డాలర్లు కొట్టుకొస్తున్నాయి. మధ్యాహ్నం సమయంలో అత్యధికంగా వస్తున్న ఆటుపోట్ల వల్ల ఇవి ఒడ్డుకు వస్తున్నాయని అనుకుంటున్నాం. అలాగే తీరం వెంట చాలా చిక్కుకుపోయాయి. ఒడ్డుకు వచ్చాక జీవంతో ఉన్నా అవి మళ్లీ నీటిలోకి వెళ్లలేకపోతున్నాయి. అయితే ఇవి ఒడ్డుకు ఎందుకు కొట్టుకొస్తున్నాయనే విషయం స్పష్టంగా తెలియదు. చాలా కారణాల వల్ల ఇలా జరుగుతుండవచ్చు. అసలు ఎన్ని శాండ్‌ డాలర్లు కొట్టుకువస్తున్నాయో కూడా చెప్పడం కష్టంగా మారింది' అని సీసైడ్‌ ఆక్వేరియం పోస్ట్‌ చేసింది.

సముద్ర తీరంలో.. శాండ్‌ డాలర్స్‌!