Oct 17,2021 11:38

ప్లాస్టిక్‌ మనిషి దైనందిన జీవితంలో భాగమైపోయింది. ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా ప్లాస్టిక్‌ వాడకం మాత్రం ఆగట్లేదు. ప్లాస్టిక్‌ వాడకం మన జీవితాల్లోకి అంతగా చొరబడిపోయింది. ఫలితంగా అనేక ప్రకృతి వినాశకర పరిణామాలను ఎదుర్కొంటున్నాం. ప్లాస్టిక్‌ వాడకం అటు ప్రకృతిని, ఇటు గాలీ, నీరు వంటి వాటిని పూర్తిగా కలుషితం చేస్తోంది. రాను రాను దాని ప్రభావాలు మన శరీరంలోకి వచ్చి చేరుతున్నాయి. మనం ప్లాస్టిక్‌ వాడకపోయినా అది ఏదో విధంగా మన శరీరంలో ప్రవేశిస్తుంది. ప్రతిరోజు, ప్రతివారం, ప్రతి నెల మనం అనేక మోతాదుల్లో ప్లాస్టిక్‌ని ఆహారంతో పాటు తింటున్నామంటే ఆశ్చర్యం కలుగక మానదు..

 

శరీరంలోకి ఆహారంతో పాటు ప్లాస్టిక్‌ !



మనకు తెలియకుండానే.. మనం ప్లాస్టిక్‌ తింటున్నామంటే నమ్ముతారా..? కానీ ఇది నిజం. ఎందుకంటే ప్రతిరోజూ కొంత మొత్తంలో ఏదో ఒక రూపంలో ప్లాస్టిక్‌ శరీరంలో ప్రవేశిస్తుంది. ఈ విషయాలను అనేక అధ్యయనాలు రుజువు చేస్తున్నాయి. ప్లాస్టిక్‌ వాడకం, వాటి వల్ల కలిగే అనర్థాలపై జరిగే అధ్యయనాలు, నివేదికలు ఈ విషయాలను తేటతెల్లం చేస్తున్నాయి. మన దైనందిన జీవితంలో అనేక మోతాదుల్లో ప్లాసిక్‌ కారకాలను తింటున్నామని అధ్యయనాలు చెబుతున్నాయి. డిడబ్ల్యూ నివేదిక ప్రకారం.. ప్లాస్టిక్‌ అనేది గాలి, నీరు, ఆహారంలో కరిగి ఉంటుంది. ప్రతి వారం మనం ఐదు గ్రాముల మైక్రోప్లాస్టిక్‌ తింటున్నామని అధ్యయనాలు చెబుతున్నాయి. అంటే వాటర్‌ బాటిల్‌మూత, లేదా క్రెడిట్‌ కార్డు సైజుకి సమానమైన ప్లాస్టిక్‌ అన్నమాట. రాయిటర్స్‌ ప్రకారం.. ఫైర్‌మెన్‌ హెల్మెట్‌ తయారీకి ఎంత ప్లాస్టిక్‌ అవసరమో అంత ప్లాస్టిక్‌ మనం ఒక్క సంవత్సరంలో తింటున్నామంట. అంటే మనం ప్రతి 10 సంవత్సరాలకూ 2.5 కిలోల కంటే ఎక్కువ ప్లాస్టిక్‌ని తింటున్నాం. అటువంటి పరిస్థితిలో మన జీవిత కాలంలో మనం ఎంత ప్లాస్టిక్‌ తింటున్నామో ఊహించవచ్చు. ఈ నివేదిక ప్రకారం ఒక జీవితమంతా మనం 20 కిలోల వరకూ ప్లాస్టిక్‌ తింటామని అంచనాలు చెబుతున్నాయి.

శరీరంలోకి ఆహారంతో పాటు ప్లాస్టిక్‌ !


 

                                                                 శరీరంలోకి ఇలా...!

శరీరంలోకి ఆహారంతో పాటు ప్లాస్టిక్‌ !

ప్లాస్టిక్‌ వినియోగంపై 50కి పైగా జరిగిన అధ్యయనాలను ఆధారంగా చేసుకుని డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌ (వరల్డ్‌ వైడ్‌ ఫండ్‌) ఇచ్చిన నివేదిక ప్రకారం.. ప్లాస్టిక్‌ తాగునీటి నుంచి ఆహార పదార్థాల వరకూ అన్నింటి ద్వారా శరీరంలోకి వెళుతుంది. అయితే మనం నిత్యం తాగే నీటి ద్వారా దాదాపు 1769 ప్లాస్టిక్‌ కణాలు మన శరీరంలోకి ప్రవేశిస్తున్నాయి. ఇది కాకుండా గాలిలో కూడా ప్లాస్టిక్‌ కరిగి ఉంటుందని డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌ తన నివేదికలో పేర్కొంది. ఇది మన ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపడమే కాకుండా... జీర్ణవ్యవస్థని దెబ్బతీస్తుందని వివరించింది.
 

                                                          చెత్త వ్యాప్తీ ఒక కారణం..

శరీరంలోకి ఆహారంతో పాటు ప్లాస్టిక్‌ !

ప్రపంచంలోని ప్యాకేజింగ్‌లలో మూడింట ఒక వంతు ప్లాస్టిక్‌ వినియోగిస్తున్నారు. కొన్ని అధ్యయనాల ప్రకారం.. జర్మనీలో ప్రతి వ్యక్తీ సగటున 38 కిలోల ప్లాస్టిక్‌ వ్యర్థాలను ఉత్పత్తి చేస్తున్నాడు. అదే సమయంలో ఐరోపాలో ప్రతి వ్యక్తీ 24 కిలోల వరకూ ప్లాస్టిక్‌ వ్యర్థాలను ఉత్పత్తి చేస్తున్నాడు. మనం ఎంత ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తున్నామో అంతే మొత్తంలో ప్లాస్టిక్‌ వాడకం కూడా పెంచుతున్నామని కొన్ని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ప్లాస్టిక్‌ వ్యర్థాలు శతాబ్దాలుగా కరగడం లేదు. అందువల్ల ఇది మన ఆరోగ్యానికి చాలా ప్రమాదకరంగా మారుతున్నాయి. ప్లాస్టిక్‌ బాటిల్‌ పూర్తిగా ధ్వంసం కావడానికి 100 సంవత్సరాల కంటే ఎక్కువ సమయం పడుతుందని అనేక నివేదికలలో వెల్లడైంది. అనేకసార్లు దీనికి సంబంధించిన చర్చలూ జరిగిన విషయం తెలిసిందే. ఉదాహరణకు ప్లాస్టిక్‌ కవర్లు నాశనం కావడానికి 500 సంవత్సరాల కంటే ఎక్కువ సమయం పడుతుంది. అలాంటి ప్రమాదకరమైన ప్లాస్టిక్‌ పర్యావరణానికీ, మన ఆరోగ్యానికీ అనేక రకాలుగా హాని కలిగిస్తుందని మనం గ్రహించాలి.