Dec 19,2021 12:50

విశాఖ హార్బర్‌ నుంచి భీమిలి వరకూ 32 కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంతముంది. ఇందులో ఆర్కే బీచ్‌, సబ్‌మెరైన్‌ ఏరియా, వుడా పార్కు , పెదజాలారి పేట, జోడుగుళ్ల పాలెం, సాగర నగర్‌, భీమిలి తీరాల్లో సముద్రం ముందుకు రావడం తరచూ సంభవిస్తుంది. ఇలా ముందుకు రావడం అనేది చాలా తీర ప్రాంతాల్లో కనిపిస్తుంది. అయితే తీర ప్రాంతాల్లో సముద్రం ముందుకు రావడం ఐపీసీసీ రిపోర్ట్‌లో పేర్కొన్నట్లు సముద్రం ముంచెత్తడం ఒకటి కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అసలు సముద్ర మట్టాలు ఎందుకు పెరుగుతాయి? కారణాలు ఏంటి? శాస్త్రవేత్తల అంచనాలు ఏం చెబుతున్నాయి? తెలుసుకుందాం..!

   రానున్న 80 ఏళ్లలో మనదేశంలోని 12 తీర ప్రాంత నగరాలు నీట మునిగిపోనున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రపంచంలో సముద్ర మట్టం పెరిగే రేటు ఆసియాలోనే ఎక్కువగా ఉందని ఐపీసీసీ తన తాజా నివేదికలో పేర్కొంది. ప్రస్తుతం ఈ నివేదికపై దేశవ్యాప్తంగా సముద్ర భూ వాతావరణ నిపుణుల్లో చర్చ జరుగుతోంది. వాతావరణంలో వచ్చిన మార్పులను శాస్త్రీయంగా అధ్యయనం చేసేందుకు ఏర్పాటైన సంస్థ ఐపీసీసీ. దీనిని 1988లో యునైటెడ్‌ నేషన్స్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ప్రోగ్రాం వరల్డ్‌ మెటీరియలాజికల్‌ ఆర్గనైజేషన్‌ సంయుక్తంగా స్థాపించాయి. తీర ప్రాంత నగరాల అభివృద్ధికి సముద్రాలే కారణం. పోర్టులు పర్యాటక ప్రదేశాలు మత్స్యపరిశ్రమ అభివృద్ధితో ఆయా ప్రాంతాలు నగరాలుగా అభివృద్ధి చెందాయి. అయితే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సముద్రాలను కాపాడుకునేలా మనిషి జీవన విధానం ఉండటం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
    ఈ క్రమంలో పర్యావరణంలో పెరుగుతున్న అసమానతల కారణంగా విశాఖతో పాటు తీరప్రాంత నగరాలైన ముంబయి, చెన్నరు, కొచ్చి, కాండ్లా, ఓఖా, భావ్‌ నగర్‌, మంగళూర్‌, పారాదీప్‌, ఖిదిర్పుర్‌, తూత్తుకుడి, మోర్ముగావ్లు 2100 నాటికి మునిగిపోనున్నాయని ఐపీసీసీ రిపోర్టులో వెల్లడించింది. ఈ సంస్థ భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా తీర ప్రాంతంలో ఉన్న నగరాలపై రిపోర్టును తయారుచేసింది. నాసా రూపొందించిన ప్రొజెక్షన్‌ టూల్‌ ద్వారా ఐపీసీసీ రిపోర్ట్‌ని పరిశీలిస్తే ఖిదిర్పుర్‌ 0.16 మీటర్లు, విశాఖ 0.54, కాండ్లా 0.57, మంగళూరు 0.57, చెన్నరు 0.57, ముంబయి 0.58, తూత్తుకుడి 0.59, పారాదీప్‌ 0.59, ఓఖా 0.60, మోర్ముగావ్‌ 0.63, కొచ్చి 0.71, భావ్‌ నగర్‌లో 0.82 మీటర్ల మేర 2100 నాటికి సముద్రమట్టాలు పెరగనున్నాయని పేర్కొంది. ఈ 12 తీర ప్రాంతాల్లో కనిష్టంగా 0.16 మీటర్ల నుంచి గరిష్టంగా 0.82 మీటర్ల వరకూ సముద్రమట్టాలు పెరుగుతాయని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషనోగ్రఫీ మాజీ రీజనల్‌ హెడ్‌ డాక్టర్‌ జీపీఎస్‌ మూర్తి తెలిపారు.
    కాకినాడ, మచిలీపట్నం, ముంబయి, కొచ్చి, చెన్నరు, బాలాసోర్‌, గోపాల్‌పూర్‌ తీరాలు సముద్రమట్టం కంటే తక్కువ ఎత్తు లేదా సమాంతరంగా ఉంటాయి. దీంతో వీటిని లోతట్టు తీరప్రాంతాలుగా చెప్తాం. సముద్రమట్టం పెరగాలంటే అది ఉన్న బేసిన్‌ ఏరియా అందులో చేరుతున్న నీటి పరిమాణం ప్రధానం. ఐపీసీసీ రిపోర్ట్‌ వంద శాతం నిజమైతే మాల్దీవులు, శ్రీలంక వంటి దేశాలకే ఎక్కువ ప్రమాదం. మిడ్‌ లాటిట్యూడ్‌లో ఉన్న భారత్‌ తీర ప్రాంత నగరాలకు అంతగా భయం లేదనేది మరికొంతమంది వాదన. అయితే ప్రతి 30 ఏళ్లకోసారి వాతావరణపరంగా మార్పులు సంభవిస్తాయి. దీనినే అట్మాస్పియర్‌ సైకిల్‌ అంటాం. ఐపీసీసీ రిపోర్టు దాదాపు మూడు సైకిల్స్‌ తర్వాత ఏం జరగనుందో చెప్తోంది. ఈ రిపోర్టు 2050 నాటి వరకైతే దీనిని పూర్తిగా ఏకీభవించవచ్చు.
    కానీ 2100 నాటి పరిస్థితిని చెప్పడమంటే వంద శాతం కరెక్ట్‌ అనలేం. గతంలో కూడా మాల్దీవులు మునిగిపోతాయనే నివేదికలు చాలా వెలువడ్డాయి. కానీ అలా జరగలేదు. ఐపీసీసీ అంచనాలుగా తీసుకుని, లోతట్టు తీర ప్రాంతాలను పరిశీలన చేస్తే.. రానున్న ఉపద్రవానికి ముందస్తు హెచ్చరికలుగా పనికొస్తాయని మరికొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కర్బన ఉద్గారాలు, ఉష్ణోగ్రతల పెరుగుదల ఇదే విధంగా కొనసాగితే 2040 నాటికి సరాసరి రెండు డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఈ శతాబ్దం చివరి నాటికి గరిష్ఠంగా రెండు మీటర్లు, 2150 నాటికి ఐదు మీటర్ల వరకూ సముద్రమట్టాలు పెరిగే అవకాశముందుని ఐపీసీసీ రిపోర్టులో పేర్కొంది. అవి అంత కచ్చితమైన గణాంకాలు కానప్పటికీ.. ఉష్ణోగ్రతలు, కాలుష్యం కంట్రోల్‌ చేయకపోతే అది నిజమయ్యే అవకాశాన్ని కొట్టిపారేయలేమని రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ ఉదరుభాస్కర్‌ అన్నారు.
     సముద్రం ముందుకు రావడం అనేది విశాఖ తీరంలో సాధారణంగా కనిపిస్తుంది. దీనిపై తరచూ మీడియాలో బ్రేకింగ్‌ న్యూస్‌లూ వస్తుంటాయి. ఇదేమీ ప్రమాదకరమైనది కాదని, స్థానిక వాతావరణ పరిస్థితులు, సముద్రంలో జరిగే అలజడులు, తీరం ఉన్న భౌగోళిక పరిస్థితులను బట్టి సముద్రం ముందుకు, వెనక్కు వెళ్లడం జరగుతుందని బే ఆఫ్‌ బెంగాల్‌ స్టడీస్‌ విభాగాధిపతి ప్రొఫెసర్‌ పి.రామారావు చెబుతున్నారు. విశాఖ నగరం సముద్రమట్టం కంటే సగటున రెండు మీటర్లు వరకూ ఎత్తులో ఉంది. పైగా విశాఖ తూర్పుకనుమల్లో ఉంటుంది. నగరానికి ఇదే రక్షణ కోట. విశాఖలో ఏడాదికి సముద్రమట్టం 0.4 మి.మీ. మాత్రమే పెరుగుతున్నట్లు అధ్యయనంలో తేలింది. ఈ నగరానికి సముద్రం నుంచి ముప్పు లేదు. తుపాను సముద్రంలో తరచూ సంభవించే అతి స్వల్ప భూకంపాల ప్రభావం కూడా వీటిపై కనిపిస్తుంది. అంత మాత్రాన ఇవి త్వరలో మునిగిపోతాయని అర్థం కాదని ప్రొఫెసర్‌ రామారావు వెల్లడించారు.