Sep 12,2021 13:11

ఒకేచోట వేలాది జంతువుల ఎముకలు ఉండటం సినిమాల్లోనే చూస్తుంటాం. కానీ నిజజీవితంలో 1.5 కిలోమీటర్ల మేర జంతువులతో పాటు మనుషుల ఎముకలు కుప్పలు తెప్పలుగా పడి ఉండటం మనం ఎప్పుడూ చూసి ఉండం. అలాంటి దృశ్యం చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది. తాజాగా పురావస్తు శాస్త్రవేత్తలు సౌదీ అరేబియాలోని ఓ గుహలో భారీగా పడున్న వేలాది ఎముకలను కనుగొన్నారు. అన్ని ఎముకలు అక్కడికి ఎలా వచ్చాయి? అవన్నీ ఎప్పటివి? వంటి విషయాలు తెలుసుకుందాం.
     సౌదీ అరేబియాలోని గుహలో ఉమ్‌ జిర్సాన్‌ అని పిలిచే 1.5 కిలోమీటర్ల పొడవైన లావా ట్యూబ్‌లో జంతువులతో పాటు మనుషుల కళేబరాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. గుహలో 1.5 కిలోమీటర్ల విస్తీర్ణంలో బయటపడ్డ వేలాది ఎముకలు చూసి, శాస్త్రవేత్తలు ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే ఈ గుహ అగ్నిపర్వత లావా ప్రవాహం ద్వారా ఏర్పడిందిగా కొనుగొన్నారు. దీనిలోని ఎముకలను 7,000 ఏళ్ల క్రితం చారల హైనాలు సేకరించి ఉంటాయని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు.
     పురావస్తు శాస్త్రవేత్తలు గుహలోని 1,917 ఎముకలు, దంతాలను విశ్లేషించి, రేడియోకార్బన్‌ డేటింగ్‌ నిర్వహించారు. ఈ గుహలోని ఎముకల అవశేషాలన్నీ 439 నుంచి 6,839 సంవత్సరాల క్రితం నాటివని కనుగొన్నారు. ఎముకలపై గుర్తులను అధ్యయనం చేసి, అవి హైనాలు సేకరించాయని శాస్త్రవేత్తలు నిర్ధారించారు.
      ఈ గుహలో ముఖ్యంగా పశువులు, ఒంటెలు, గుర్రాలు, ఎలుకలు తదితర జంతువుల ఎముకలతో పాటు మానవ పుర్రె అవశేషాలూ ఉన్నాయి. సమాధుల నుంచి మానవుల కళేబరాలను గుహలోకి తెచ్చి ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే ఈ ఎముకల్లో హైనాల అవశేషాలూ ఉండటంతో శాస్త్రవేత్తలు ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే ఈ ఎముకల సేకరణ టైమ్‌ క్యాప్సూల్‌లాగా పనిచేస్తుందని పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నామని చెబుతున్నారు. ఎముకలు పురాతన అరేబియా చరిత్రను అర్థం చేసుకోవడంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తాయని పరిశోధకులు పేర్కొన్నారు. ఉమ్‌ జిర్సాన్‌ వంటి గుహలు అద్భుతమైన పురాతన వనరులను అందిస్తున్నాయని ఓ పురావస్తు శాస్త్రవేత్త వ్యాఖ్యానించారు. ఉమ్‌ జిర్సాన్‌ వంటి మరిన్ని ప్రదేశాల్లో శోధించి, పురాతన అవశేషాలను కనిపెట్టాలని సూచించారు. తద్వారా పురాతన పర్యావరణ పరిస్థితులను పూర్తిస్థాయిలో అర్థం చేసుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
 

                                                      చరిత్ర అధ్యయనానికి దోహదం..

     పరిశోధకుడు స్టీవార్డ్‌ ప్రకారం.. ఈ పరిశోధన ప్రారంభం మాత్రమే. వాస్తవానికి 2007లోనే లావా ట్యూబ్‌ను కనిపెట్టారు. కానీ అందులో నుంచి భయంకరమైన శబ్దాలు రావడంతో పరిశోధకులు గుహ లోపలకి వెళ్లేందుకు సాహసించ లేకపోయారు. అయితే ఈసారి శాస్త్రవేత్తలు ధైర్యం చేసి గుహ లోపలికి వెళ్లి, వేలాది ఎముకలను చూసి ఆశ్చర్యపోయారు. హైనాలు భారీ సంఖ్యలో ఎముకలు సేకరిస్తాయని చెప్పడానికి మరొక ఉదాహరణ కూడా ఉంది. హైనాలు చెక్‌ రిపబ్లిక్‌లోని స్రబ్స్కో క్లమ్‌-కోమిన్‌ గుహలో వేలాది ఎముకలను దాచిపెట్టాయి. చాలాకాలం పాటు ఎముకలను తెచ్చుకొని, ఆ గుహలో తినడం వల్ల.. అది ఒక ఎముకల దిబ్బగా మారింది. అయితే ఈ గుహను 1942లో కనిపెట్టగా.. దానిలో 3,500 పైగా జంతువుల ఎముకలు బయటపడ్డాయి.