ప్రజాశక్తి కలక్టరేట్ (కష్ణా) : జిల్లాలో ఖరీఫ్ సీజన్ కు సంబంధించిన ధాన్యం కొనుగోలుకు అంతా సిద్ధంగా ఉండాలని, రైతులు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా చూడాల్సిన పూర్తి బాధ్యత అధికా రులదేనని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు పేర్కొ న్నారు. గురువారం కలెక్టరేట్లోని తన చాంబర్లో పౌర సరఫరాలు, వ్యవసాయ, మార్కెటింగ్, రవాణా శాఖ అధికారులతో ధాన్యం సేకరణపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 317 రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణకు సిద్ధమైనట్లు తెలిపారు. ఈ-క్రాప్ నమోదు ఆధారంగా జిల్లాలో 10.5 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం వచ్చే అవకాశం ఉందని, ఇది దష్టిలో పెట్టుకుని సంబంధిత అధికారులు ముందు నుంచే అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. గత ఏడాది ధాన్యం సేకరణలో ఎదురైన సమస్యలను దష్టిలో ఉంచుకుని, అవి మరల పునరావతం కాకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. ఈనెల 14 నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమవుతాయని, ఆ ప్రకారంగా అవసరమైన గోనె సంచులు, ధాన్యం రవాణా వాహనాలు, జిపిఎస్ ట్రాకింగ్ పరికరాలు మరోసారి పరిశీలించుకోవాలని చెప్పారు. ఇప్పటికే తొలి దశగా రెండు లక్షలకు పైగా గోనె సంచులను ఆయా రైతు భరోసా కేంద్రాలకు చేర్చడం జరిగిందని, 300కు పైగా రవాణా వాహనాలను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్తూ పరిస్థితులకు అనుగుణంగా వీటి సంఖ్యను పెంచుకోవాలని చెప్పారు. ధాన్యం విక్రయంలో ఎలాంటి సమస్యలు తలెత్తినా టోల్ ఫ్రీ నెంబర్ 1967కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని కలెక్టర్ రైతులకు సూచించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్, జిల్లా పౌర సరఫరాల అధికారిణి వి.పార్వతి, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ శ్రీధర్, జిల్లా వ్యవసాయ అధికారిణి ఎన్. పద్మావతి తదితరులు పాల్గొన్నారు.