Nov 20,2023 00:16

21న తడలో సిఎం పర్యటన


21న తడలో సిఎం


పర్యటన

ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్‌, ఎస్పీ

ప్రజాశక్తి- తిరుపతి టౌన్‌
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఈనెల 21వ తేదీన తిరుపతి జిల్లాలోని సూళ్లూరుపేట నియోజకవర్గంలోని తడ మండలం మాంబట్టు అపాచీ పరిశ్రమ సమీపంలో ప్రపంచ మత్స్యకార దినోత్సవం 2023 సందర్భంగా పలు అభివద్ధి కార్యక్రమాల శంఖుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ పర్యటనలో చిన్నపాటి లోపలకు తావివ్వరాదని జిల్లా కలెక్టర్‌ కె.వెంకట రమణారెడ్డి అధికారులకు సూచించారు. ముందస్తు భద్రత లైజన్‌లో భాగంగా ఆదివారం ఉదయం రేణిగుంట విమానాశ్రయంలో జిల్లా కలెక్టర్‌ జిల్లా ఎస్పీ పరమేశ్వరరెడ్డితో కలిసి సమీక్షించారు. అనంతరం ముఖ్యమంత్రి పర్యటన ప్రాంతాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి 21వ తేదీ ఉదయం 9.45 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుని అక్కడి నుండి 10.20 గంటలకు మాంబట్టు సెజ్‌ హెలిపాడ్‌ చేరుకుంటారని తెలిపారు. అనంతరం 10.45 గంటలకు బహిరంగ సభ ప్రాంగణం చేరుకొని ఫోటో ఎక్జిబిషన్‌ సందర్శన, మత్స్యశాఖ, ఆర్‌అండ్‌ బి, ఇరిగేషన్‌ శాఖల పలు అభివద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ఆవిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం ప్రజలనుద్దేశించి సిఎం ప్రసంగించి. మధ్యాహ్నం 12.40 గంటలకు హెలిపాడ్‌ వద్ద ప్రజాప్రతినిధులతో, స్థానికులతో మాట్లాడి 1.45 గంటలకు హెలిపాడ్‌ నుండి రేణిగుంట విమానాశ్రయం చేరుకొని 2.15 గంటలకు గన్నవరం తిరుగు ప్రయాణం కానున్నారని తెలిపారు. ఏఎస్‌ఎల్‌లో భాగంగా తడ మండలం మాంబట్టు సెజ్‌ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌, బహిరంగ సభ ప్రాంగణాన్ని సిఎం కార్యక్రమం ఏర్పాట్లపై స్థానిక సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్‌, జెసి డికే బాలాజీ, ఎస్పీ సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్‌ పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. సిఎం పర్యటనకు ఏర్పాట్లు పగడ్బందీగా ఉండాలని అధికారులు సమన్వయంతో ప్రణాళికా బద్ధంగా పనిచేసి విజయవంతం చేయాలని సూచించారు. సభావేదిక వద్ద ఫోటో ఎక్జీబిషన్‌, సాంస్కతిక కార్యక్రమాలు ఏర్పాటు, సభా ప్రాంగణంలో సీటింగ్‌ ఏర్పాటు, తాగునీటి వసతి, నిరంతర విద్యుత్‌ సరఫరా, స్టాండ్‌ బై జనరేటర్‌ ఏర్పాటు, మోబిలైజేషన్‌, శానిటేషన్‌, మెడికల్‌ క్యాంపు ఏర్పాటు, సేఫ్‌ రూమ్‌ ఏర్పాటు, అధునాతన లైఫ్‌ సపోర్ట్‌ అంబులెన్స్‌, ఇంటర్నెట్‌ సౌకర్యం, సిసిటివి కెమెరాల ఏర్పాటు, పర్యవేక్షణ, అంబులెన్స్‌, 108, అభివద్ధి కార్యక్రమాల శంఖుస్థాపన శిలాఫలకాల ఏర్పాటు తదితరాల ఏర్పాట్లపై విధులు కేటాయించబడిన అధికారులు ఎలాంటి అలసత్వం లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఎస్పీ మాట్లాడుతూ పోలీస్‌శాఖ తరపున పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలుపుతూ పోలీస్‌ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఆర్డీఓలు శ్రీకాళహస్తి రవిశంకర్‌ రెడ్డి, సూళ్లూరుపేట చంద్రముని, గూడూరు కిరణ్‌కుమార్‌, ఏఎస్పీలు కులశేఖర్‌, విమల కుమారి, వెంకట్రావు, డిఎంహెచ్‌ఓ శ్రీహరి, జిల్లా ఆర్‌ అండ్‌బి అధికారి సుధాకర్‌ రెడ్డి, నెల్లూరు ఎస్‌ఈ ఏపీఎస్పీడీసీల్‌ విజయన్‌, జిల్లా ఫైర్‌ అధికారి రమణయ్య, జిల్లా అధికారులు పాల్గొన్నారు.