ప్రజాశక్తి-అమలాపురం ఈ నెల 27, 28న విజయవాడ జింఖానా మైదానంలో నిర్వహిస్తున్న అంగన్వాడీల మహాధర్నాను విజయవంతం చేయాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు ఎవి.నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. స్థానిక యుటిఎఫ్ హోమ్‌లో శనివారం నిర్వహించిన అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ సమావేశంలో ఆయన మాట్లాడారు. అంగన్వాడీల సమస్యలపై స్త్రీ శిశుసంక్షేమ శాఖ అధికారులతో పలుమార్లు చర్చించినప్పటికీ ఫలితం లేదని దీంతో గురువారం కమిషనర్‌కు సమ్మెకు సంబంధించిన నోటీసు ఇచ్చామన్నారు. ఈ నెల 25 నుంచి ఐసిడిఎస్ పీడీలు, సిడిపిఒలకు సమ్మె నోటీసులు అందజేస్తామని, 23న అన్ని జిల్లా కేంద్రాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి 25 నుంచి 30 వరకు సెక్టార్ సమావేశాలు నిర్వహించి ఉద్యోగులందరికీ సమ్మె పిలుపును అందజేస్తామని ఆయన తెలిపారు. డిసెంబర్ 6న అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు అందజేసి అనంతరం స్థానిక ఎంఎల్ఎలు, ఎంపీలకు వినతిపత్రాలు ఇస్తామన్నారు. డిసెంబర్ 8 నుంచి సమ్మె చేయనున్నట్టు ఆయన తెలిపారు. అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణవేణి మాట్లాడుతూ అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం అమలు చేయాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి నెరవేర్చాలని కోరుతూ ఈ సమ్మెకు వెళుతున్నట్లు ఆమె తెలిపారు. జిల్లా అధ్యక్షురాలు బండి వెంకటలక్ష్మి మాట్లాడుతూ ఐసిడిఎస్‌కు బడ్జెట్ పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి దుర్గాప్రసాద్, బలరామ్, నాయకులు అమూల్య, సుజాత, వెంకటలక్ష్మి, రాణి, ఆదిలక్ష్మి, బేబీ పాల్గొన్నారు.