- కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
- చిక్కుకున్న కార్మికులకు పైప్ ద్వారా ప్రత్యేక ఆహారం
- సిఎంతో మాట్లాడిన ప్రధాని మోడీ
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో కూలిన టన్నెల్లో చిక్కుకున్న 41 మంది కార్మికులు పది రోజులుగా (మంగళవారం నాటికి) మృత్యువుతో పోరాడుతూనే ఉన్నారు. వారిని కాపాడేందుకు మరో నాలుగైదు రోజులు పట్టే అవకాశం కనిపిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. తమ వారు సురక్షితంగా వస్తారో, రారోనన్న ఆందోళనతో వారి కుటుంబ సభ్యులు తల్లడిల్లుతున్నారు. కార్మికులు ఉన్న చోటకు ఆరు అంగుళాల వెడల్పు ఉన్న ప్రత్యామ్నాయ పైపు చేరుకున్నట్లు ఎన్హెచ్ఐడిసిఎల్ డైరెక్టర్ అన్షు మాన్షిష్ తెలిపారు. లోపల ఉన్న కార్మికుల ఆహార అవసరాలు తీర్చడానికి ప్రత్యేక ఆహారం కోసం వైద్య నిపుణులను సంప్రదించినట్లు చెప్పారు. సోమవారం మూంగ్ కిచిడీని ఈ పైప్ ద్వారా పంపామని చెప్పారు. తొలుత మూత ఉన్న సీసాల్లో పండ్లతో పాటు తేలికపాటి భోజనాన్ని సొరంగంలో చిక్కుకున్న కార్మికులను అందిస్తామని తెలిపారు. కార్మికులతో సంప్రదింపులు జరిపేందుకు చార్జర్‌తో కూడిన ఫోన్ కూడా పంపనున్నట్లు వివరించారు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్‌డిఒ) కూడా రెస్క్యూ ఆపరేషన్‌లో భాగమైంది. 20, 50 కిలోల బరువున్న రెండు రోబోలను కూలిన సొరంగంలోకి పంపింది. లోపల చిక్కుకున్న కార్మికుల పరిస్థితిని ఈ రోబోలు అంచనా వేసి, రెస్క్యూ ఆపరేషన్‌కు సహకరిస్తాయి. అంతర్జాతీయ టన్నెలింగ్ నిపుణుల బృందం సోమవారం సంఘటనా స్థలానికి చేరింది. ఇంటర్నేషనల్ టన్నెలింగ్, అండర్‌గ్రౌండ్ స్పేస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్నాల్డ్ డిక్స్ ఆధ్వర్యంలో ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నది.
సిఎంతో మాట్లాడిన ప్రధాని మోడీ
కార్మికులను కాపాడేందుకు జరుగుతున్న ప్రయత్నాల గురించి తెలుసుకునేందుకు ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ దామితో మాట్లాడారు. అక్కడ జరుగుతున్న కార్యకలాపాల గురించి తెలుసుకున్నారు. కేంద్రం నుండి అవసరమైన సాయం అందుతుందని హామీ ఇచ్చారని సిఎంఓ కార్యాలయం తెలిపింది. లోపల చిక్కుకుపోయిన కార్మికుల మనోధైర్యం దిగజారకుండా చూడాల్సిన అవసరం కూడా వుందని పేర్కొంది. కేంద్ర, రాష్ట్ర సంస్థల సమన్వయంతో కార్మికులను త్వరగా కాపాడేందుకు కృషి చేస్తామని సిఎం హామీ ఇచ్చారు.