Jul 24,2022 08:07

ప్రపంచ యుద్ధాల పర్యవసనాలు ఎలా ఉంటాయో చూశాం. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అణ్వస్త్రాల ధాటికి హిరోషిమా, నాగసాకి వంటి నగరాలు ఎంత నాశనమయ్యాయో.. కొన్ని దశాబ్దాల పాటు కనీసం గడ్డి కూడా మొలవలేని పరిస్థితులు ఎలా వచ్చాయో చెప్పుకుంటాం. అయితే అలాంటి మరో ప్రపంచ యుద్ధమే వస్తే..! మళ్లీ భూమిపై గడ్డి కూడా మొలవకపోతే..! అప్పుడు పరిస్థితి ఏమిటి? ఇలాంటి ప్రశ్నల నుంచి పుట్టిన గొప్ప ఆలోచన డూమ్స్‌ డే వాల్డ్‌.. వరల్డ్‌ సీడ్‌ బ్యాంక్‌. భూమిపై ఎలాంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినా.. భవిష్యత్తు తరాలకు కావాల్సిన ఆహారాన్ని అందించే విత్తనాలను భద్రపరిచేందుకు ఏర్పాటైంది. దీనికి సంబంధించిన మరిన్ని విశేషాలు..

seeds


అంతరిక్షంలోకి దూసుకెళ్లే విజ్ఞానాన్ని సంపాదించుకున్నా సరే.. భూమిపై వచ్చే ప్రకృతి విపత్తులను మనిషి ఇప్పటికీ జయించలేకపోతున్నాడు. భూకంపం, సునామీలు వస్తాయని ముందుగానే తెలుసుకున్నా.. వాటిని నిలువరించే శక్తి లేదు. ఒకవేళ ప్రపంచమంతా ఒకేసారి ఏదైనా ప్రమాదానికి గురైతే.. భవిష్యత్‌ తరాల మాటేమిటి? బతికిన వారికి ఆహారం ఎలా? భూమిపై జీవకోటి జీవించడానికి ఆహారం అనేది అతి ముఖ్యం. ఆహారం లేకపోతే మానవుడితో పాటు జంతువులు, పక్షులు మరణించడం ఖాయం. అయితే మనం ఇప్పుడు తీసుకునే ఆహారంలో 90 శాతంపైనే చెట్ల నుంచి వస్తుంది. ఈ క్రమంలో ఏదైనా విపత్తు జరిగి, పంటలు అంతరించిపోతే.. మళ్లీ పంటలు వేసేందుకు ఈ భూమిపై విత్తనాలు లభించకపోతే.. అప్పుడు మానవుడు పంటలను వేయలేడు. దాంతో ప్రపంచంలో ఆహార సంక్షోభం ఏర్పడటం ఖాయం. అయితే ఇలాంటి ప్రశ్నలకు సమాధానమే స్వాల్బార్డ్‌ గ్లోబల్‌ సీడ్‌ వాల్ట్‌. ప్రపంచంలోని అన్ని ప్రాంతాల విత్తనాలను భద్రపరచడమే దీని ముఖ్యోద్దేశం. బ్యాంక్‌లు మన డబ్బును, బంగారాన్ని ఎలాగైతే భద్రపరుస్తాయో.. ఈ గ్లోబల్‌ సీడ్‌ వాల్ట్‌ విత్తనాలను భద్రపరుస్తుందన్నమాట. భారత్‌కు చెందిన ఇక్రిశాట్‌తో పాటు థారులాండ్‌, బ్రెజిల్‌, జర్మనీ, స్వీడన్‌ దేశాలకు చెందిన ఐదు ప్రతిష్టాత్మక పరిశోధనా సంస్థల ఆధ్వర్యంలో అక్కడ భద్రపరచిన విత్తనాల మీద పరిశోధనలు జరుగుతుంటాయి. ప్రతి పదేళ్లకోసారి వందేళ్ల పాటు ఈ పరీక్షలు సాగుతాయి. వాటిలో జీవం ఎంతవరకూ ఉందో, మొలకెత్తే అవకాశాల గురించి పరిశోధనలు జరుపుతారు.
 

seeds

మంచుపర్వతాల లోపల..
అర్కిటిక్‌ స్వాల్బార్డ్‌ ద్వీపసమూహంలోని నార్వేజియన్‌ ద్వీపం ఉత్తర ధృవం నుంచి 482 కిలోమీటర్ల దూరంలో స్పిట్స్‌బర్గ్‌లో ఏర్పాటు చేశారు. నార్వేజియన్‌ ప్రభుత్వం, క్రాప్‌ ట్రస్ట్‌, నార్డిక్‌ జెనెటిక్‌ రిసోర్స్‌ సెంటర్‌ (నార్డెన్‌) మధ్య త్రైపాక్షిక ఒప్పందంలో పేర్కొన్న నిబంధనల ప్రకారం నిర్వహించబడుతుంది. ఈ బ్యాంక్‌ పర్వతం లోపల 150 మీటర్ల కింద ఉంటుంది. 2021 నాటికి ఈ సీడ్‌ బ్యాంక్‌లో దాదాపు 10 లక్షలకు పైగా పంటలకు సంబంధించిన విత్తనాలు ఉన్నాయట. దీని బాధ్యతలను నార్వే ప్రభుత్వం చూసుకుంటుంది. ఏదైనా దేశంలో పంట అంతరించిపోతే.. దానికి సంబంధించిన విత్తనాలు ఈ బ్యాంక్‌లో లభిస్తాయి. వీటి ద్వారా మళ్లీ ఆ పంటను పండించేందుకు వీలవుతుంది.
విత్తనాలను విత్‌డ్రా చేసిన సిరియా
ఎప్పుడో భవిష్యత్‌ అవసరాల కోసం ఈ బ్యాంక్‌ని ఏర్పాటు చేస్తే.. ఇప్పటికే దాని అవసరం ఎంతో తెలిసొచ్చింది. యుద్ధాలతో తీవ్రంగా నష్టపోయిన సిరియా తాము దాచుకున్న వాటిలో ఇప్పటికే 2012లో కొన్ని విత్తనాలను విత్‌ డ్రా చేసుకుంది. ఇప్పటివరకూ విత్తనాలు దాచుకున్న దేశాల్లో విత్తనాలను విత్‌డ్రా చేసుకున్న దేశం ఇదే.
భారత్‌కూ ఓ విత్తన బ్యాంకు
నార్వేలో వరల్డ్‌ సీడ్‌ బ్యాంక్‌ ఉన్నట్టే.. ఇండియా ప్రత్యేకంగా, సొంతంగా కూడా ఇలాంటి బ్యాంకును ఏర్పాటు చేసింది. లఢక్‌లోని చాంగ్‌లాలో.. సముద్రానికి 17,500 అడుగుల ఎత్తున సీడ్‌ బ్యాంక్‌ను నిర్మించింది. ఇందులో 10 వేల రకాల విత్తనాలు, 200 మొక్కలు ఉన్నాయి. ఇందులో దాచిన ఉల్లి విత్తనాలు 413 ఏళ్లు, వడ్లు 1,100 ఏళ్లు, గోధుమలు 1600 ఏళ్లు, బఠానీలు తొమ్మిది వేల సంవత్సరాలు పాడవకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

seeds

ఎక్కడ..? ఎలా నిర్మించారు?
ఐక్యరాజ్య సమితి చొరవతో 2008లో ఇది ప్రారంభమైంది. ప్రపంచంలోని అన్ని ఆహార పంటలకు చెందిన విత్తనాలను ఇక్కడ భద్రపరుస్తున్నారు. నార్వేలోని స్వాల్బార్డ్‌ ద్వీప ప్రాంతలో ఈ బ్యాంక్‌ను ఏర్పాటు చేశారు. సముద్రమట్టానికి 130 మీటర్ల ఎత్తున ఉన్న ఓ మంచు కొండను 100 మీటర్లు తొలిచి, లోపల పూర్తిగా స్టెయిన్‌లెస్‌ స్టీల్‌తో గదులను నిర్మించారు. మంచు కరిగినా.. వాల్ట్‌కు ఏం కాకుండా ఏర్పాట్లు చేశారు. మైనస్‌ 18 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద విత్తనాలను భద్రపరుస్తారు. దీంతో ఎన్నేళ్లయినా చెక్కు చెదరకుండా విత్తనాలు అలాగే ఉంటాయి. ఒక్కో గదిలో 1.5 మిలియన్‌ విత్తనాలను.. మొత్తం బ్యాంక్‌లో 45 మిలియన్ల విత్తనాలను దాయవచ్చు. ఇక్కడ ఏ దేశమైనా తమ విత్తనాలను.. అదీ ఉచితంగా దాచుకోవచ్చు. అంతేకాదు.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ దేశం నుండి సీడ్‌ డిపాజిట్‌ చేశారో ఆ దేశస్థులు మినహా.. మరెవరూ ఆ బాక్సులను తెరిచేందుకు వీలుండదు. ప్రస్తుతానికి ఈ ఏర్పాటు చేశారు. ఈ విత్తన బ్యాంక్‌ కోసం తొమ్మిది మిలియన్‌ డాలర్లను ఇప్పటివరకూ ఖర్చుపెట్టారు.