Nov 14,2023 07:14

చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగంలో అత్యధిక స్థాయిలో ఉపాధికి అవకాశాలు ఉంటాయి. అటువంటి రంగం కోలుకోడానికి దోహదం చేయని ఆర్థిక వృద్ధి స్వభావం వలన ఒకపక్క ఆర్థిక వృద్ధి రేటు పెరుగుతున్నట్టు కనిపిస్తున్నా, ఉపాధి అవకాశాలు మాత్రం ఏమాత్రమూ పెరగలేదు.

బడా పెట్టుబడిదారులకు ఉపాధి అవకాశాల కల్పన పేరుతో ప్రభుత్వం అనేక రాయితీలు ఒక పక్క ఇస్తున్నా, తన వంతుగా ఉపాధి అవకాశాలను కల్పించే బాధ్యతను మాత్రం ఈ ప్రభుత్వం నెరవేర్చడం లేదు. ప్రభుత్వ రంగంలో ఉన్న ఖాళీలను భర్తీ చేయడానికి పూనుకోవడం లేదు.

పెట్టుబడిదారులు మరింత ఎక్కువగా పెట్టుబడులు పెట్టేలా వారిని ప్రోత్సహించడమే ప్రధాన సూత్రంగా మోడీ ప్రభుత్వ విధానాలు రూపొందాయి. పెట్టుబడులు ఎంత పెరిగితే ఆర్థికవృద్ధిరేటు అంత ఎక్కువ పెరుగుతుంది అన్నది దీని వెనుక ఆలోచన.

న ఆర్థిక వ్యవస్థలో పని చేయగలిగిన వారిలో ఎంతమంది ''ఉద్యోగులు'', ఎంతమంది ''నిరుద్యోగులు'' అని స్పష్టంగా విభజించి చూడడం సాధ్యం కాదు. పలువిధాలుగా కాజువల్‌ ఉద్యోగాలు ఉండడమే గాక, ఆ విధమైన ఉద్యోగాల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. అందుచేత స్పష్టంగా నిరుద్యోగం ఎంత ఉందో నిర్ధారించడం చాలా చిక్కులతో కూడుకున్న పని. ''గత ఏడాది కాలంలోనో, గత ఆరు నెలల కాలంలోనో మీకు ఎన్ని రోజులు పని దొరికింది, రోజుకు ఎన్ని గంటల చొప్పున దొరికింది'' అని సర్వేలో వ్యక్తులను అడగాలి. ఎంతగడువు ను కొలబద్దగా ఎంచుకున్నాం, ఎన్ని గంటల పని చేస్తే పూర్తి స్థాయి ఉపాధి దొరికినట్టు పరిగణిస్తాం అన్న దానిని బట్టి నిరుద్యోగం ఎంత మోతాదులో ఉందో నిర్ధారించడం జరుగుతుంది. జాతీయ శాంపిల్‌ సర్వేలో (1) సాధారణంగా ఉపాధి ఉంటోందా? (2) వారంలో ఎన్ని రోజులు ఉపాధి దొరుకుతోంది? (3) ఏ రోజుకు ఆ రోజు ఉపాధి దొరుకుతోందా?-ఇలా మూడు రకాల ప్రమాణాలను వాడతారు. ప్రతీ ఏడూ చిన్న సైజు శాంపిల్‌నే తీసుకున్నా ఐదేళ్ళకు ఒకసారి పెద్ద సైజు శాంపిల్‌ను తీసుకుని సర్వే చేస్తారు. జాతీయ శాంపిల్‌ సర్వే ఫలితాలను ఏడాదికొకమారు ప్రకటిస్తారు.
           సెంటర్‌ ఫర్‌ మోనిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ అనే ఒక ప్రభుత్వేతర సంస్థ ప్రతీ నెలా నిరుద్యోగ సర్వే నిర్వహిస్తుంది (పట్టణాల్లో ప్రతీ వారమూ నిర్వహిస్తారు). సర్వే జరిగిన రోజున ఉపాధి లభించినదీ లేనిదీ అడుగుతారు. పని చేయడానికి సిద్ధంగా ఉన్న మొత్తం శ్రామిక ప్రజానీకంలో ఎంత శాతానికి ఉపాధి లభించినదీ లెక్కించి దాని ఆధారంగా నిరుద్యోగం ఎంత శాతం ఉందో నిర్ధారిస్తారు. ఈ సంస్థ అనుసరించే విధానం పట్ల ఎవరికైనా అభ్యంతరాలు ఉండవచ్చు కాని ఆ సంస్థ వెల్లడించే గణాంకాలు చాలా కాలంగా ఆమోదయోగ్యంగా ఉన్నాయి. అందుచేత నిరుద్యోగంలో ఉన్న ధోరణులను పరిశీలించడానికి అవి ప్రాతిపదికగా చాలామంది, ముఖ్యంగా పరిశోధకులు తీసుకుంటున్నారు.
         సి.ఎం.ఐ.ఇ తాజాగా విడుదల చేసిన గణాంకాలు 2023 అక్టోబరు మాసానికి సంబంధించినవి. వాటిని బట్టి చూస్తే దేశంలో నిరుద్యోగం 10.05 శాతం ఉంది. అందులో గ్రామీణ నిరుద్యోగం 10.82 శాతం ఉంటే, పట్టణాల్లో 8.44 శాతం ఉంది. సెప్టెంబరు మాసంలో 7.09 శాతం ఉంటే అక్టోబర్‌ నెలలో చాలా ఎక్కువ మోతాదులో పెరుగుదల కనిపిస్తోంది (2020లో మోడీ ప్రభుత్వం హఠాత్తుగా లాక్‌డౌన్‌ ప్రకటించాక నిరుద్యోగం అమాంతం పెరిగిపోయింది.). మే 2021లో కరోనా అదుపులోకి వచ్చాక మళ్ళీ ఎక్కువగా పెరుగుదల కనిపిస్తున్నది ఇప్పుడే.
            గత ఐదు సంవత్సరాలుగా మన దేశంలో పని చేస్తున్నవారి సంఖ్య 40 కోట్లుగా, ఎటువంటి పెరుగుదలా లేకుండా ఉంటోంది. అంటే గడిచిన ఐదేళ్ళలోనూ కొత్తగా ఉపాధి అవకాశాలు పెరగలేదని గ్రహించాలి. ఈ అక్టోబర్‌ మాసంలో నిరుద్యోగంలో ఒక్కసారి ఎక్కువగా పెరుగుదల కనిపించింది. అదే నెలలో ఉపాధి కోసం ప్రయత్నించేవారి సంఖ్య కూడా అదే మోతాదులో పెరిగింది. అంటే ఉపాధి పొందుతున్నవారి సంఖ్యలో ఏ మార్పూ లేదు. దీనిని బట్టి భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఉపాధి అవకాశాలలో పెరుగుదల లేకపోవడం అనేది ప్రధాన ధోరణిగా ఉందని మనం గ్రహించాలి.
          సి.ఎం.ఐ.ఇ లెక్కల ప్రకారం 2019లో 5.27 శాతం ఉన్న నిరుద్యోగం 2020 లో 8 శాతానికి పెరిగింది. ఆ తర్వాత రెండు సంవత్సరాలలో అది 5.98 శాతం, 7.33 శాతం గా నమోదైంది. 2023లో అది మరింత పెరిగింది. ఇప్పుడు దేశంలో ఉపాధి కోరుతున్న శ్రామిక జనం సంఖ్య పెరుగుతున్నా, లభిస్తున్న ఉద్యోగాలు మాత్రం ఏ పెరుగుదలా లేకుండా యథాతథంగా ఉన్నాయి. యుక్త వయస్సు వచ్చి ఉపాధి కోరుకుంటున్నవారి సంఖ్య ఏటా ఏ మోతాదులో పెరుగుతోందో, కనీసం ఆ మోతాదులో కూడా ఉపాధి అవకాశాలు పెరగడం లేదు.
           కొంతమంది వ్యాఖ్యాతలు ఉపాధి అవకాశాలలో పెరుగుదల లేకపోడానికి కారణం మన దేశ ఆర్థిక వ్యవస్థ ఇంకా కరోనా మహమ్మారి దెబ్బ నుండి పూర్తిగా కోలుకోలేకపోవడమే అని అంటున్నారు. ఈ వ్యాఖ్యానంలో ఏ కాస్తైనా పస ఉన్నదని అనుకుంటే వాళ్ళు వాస్తవ జిడిపిలో వృద్ధి ని ప్రమాణంగా తీసుకున్నట్టు భావించాలి. మహమ్మారి అనంతరం మన జిడిపి పుంజుకుంటున్న వేగం నిస్సందేహంగా చాలా నెమ్మదిగా ఉంది. కాని ప్రభుత్వం మాత్రం ప్రపంచంలోనే అతి వేగంగా జిడిపి పెరుగుతున్న దేశం మనది అంటూ గొప్పలు పోతోంది. ఏదేమైనా, ఈ జిడిపిలో వృద్ధి రేటు పెరుగుదల తక్కువగా ఉందనే ఒక్క విషయమే ప్రస్తుత పరిస్థితిని వివరించేందుకు సరిపోదు. ఉదాహరణకి, 2019తో పోల్చుకుంటే మన వాస్తవ జిడిపి 2023 నాటికి 16 శాతం పెరిగింది. మరి ఆ మేరకైనా ఉపాధి అవకాశాలు 2019తో పోల్చుకుంటే పెరగాలి కదా. కాని అలా పెరగలేదు. అంటే జిడిపి పెరుగుదల స్వభావం ఏమిటో మనం పరిశీలించాలి. కేవలం జిడిపి వృద్ధి రేటు పెరిగినంత మాత్రాన ఉపాధి అవకాశాలు వాటంతట అవే పెరిగిపోతాయని అనుకోలేము. ఈ వృద్ధి ఏ విధంగా సాధ్యపడింది అన్న అంశాన్ని మనం పరిశీలించాలి.
           అంతకు పూర్వపు కాలంతో పోల్చితే మన వృద్ధి పెరుగుదల స్వభావం గత కొన్ని సంవత్సరాలుగా మారిపోతున్నది. ఆర్థిక వృద్ధి నమోదౌతున్నా అది ఉపాధి వృద్ధికి దారి తీయడం లేదు. నయా ఉదారవాద విధానాల కారణంగా చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగం ప్రతికూల పరిస్థితులనెదుర్కుంటోంది. ఈ రంగానికి ప్రభుత్వం ఇచ్చే తోడ్పాటును క్రమంగా ఉపసంహరించారు. పైగా విదేశీ సరుకుల దిగుమతులమీద ఏ ఆంక్షలూ లేకపోవడంతో ఈ రంగానికి పోటీ బాగా పెరిగిపోయింది. ఆ పోటీని తట్టుకునే విధంగా ప్రభుత్వం తోడ్పడి వుండాలి. కాని దానికి భిన్నంగా అంతవరకూ ఉన్న తోడ్పాటునే వెనక్కి తీసుకున్నారు. పులి మీద పుట్రలాగా మోడీ ప్రభుత్వం పెద్దనోట్ల రద్దును హఠాత్తుగా అమలు చేసింది. జిఎస్‌టి విధానం గుదిబండ అయింది. ఇవన్నీ చాలవన్నట్టు కోవిడ్‌ కాలంలో విధించిన లాక్‌డౌన్‌ దెబ్బకి ఈ రంగం పూర్తిగా కుదేలైంది. ఇప్పటికీ ఈ రంగం ఆ స్థితి నుండి కోలుకోనేలేదు. కోవిడ్‌ అనంతర కాలంలో ఆర్థిక వృద్ధిరేటు పెరిగినా, అది ఈ రంగానికి ఏ విధంగానూ ఉపయోగపడేదిగా లేదు. చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగంలో అత్యధిక స్థాయిలో ఉపాధికి అవకాశాలు ఉంటాయి. అటువంటి రంగం కోలుకోడానికి దోహదం చేయని ఆర్థిక వృద్ధి స్వభావం వలన ఒకపక్క ఆర్థిక వృద్ధి రేటు పెరుగుతున్నట్టు కనిపిస్తున్నా, ఉపాధి అవకాశాలు మాత్రం ఏమాత్రమూ పెరగలేదు.
          బిజెపి ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్థిక విధానాలు ఉపాధి అవకాశాలను పెంచడానికి ఏ మాత్రమూ తోడ్పడవని దీనిని బట్టి స్పష్టం అవుతోంది. పెట్టుబడిదారులు మరింత ఎక్కువగా పెట్టుబడులు పెట్టేలా వారిని ప్రోత్సహించడమే ప్రధాన సూత్రంగా మోడీ ప్రభుత్వ విధానాలు రూపొందాయి. పెట్టుబడులు ఎంత పెరిగితే ఆర్థికవృద్ధిరేటు అంత ఎక్కువ పెరుగుతుంది అన్నది దీని వెనుక ఆలోచన. అయితే, ఈ విధానాలు నిరుపయోగం. మొదటి కారణం: కొద్దిమంది గుత్తాధిపతుల ఆధిపత్యంలో మార్కెట్‌ నడుస్తున్నప్పుడు మార్కెట్‌లో కొనుగోలుశక్తి, లేదా డిమాండ్‌ ఎంతమేరకు పెరగవచ్చు అన్న అంచనాను బట్టి పెట్టుబడులను ఎంతమేరకు పెంచాలి అన్నది నిర్ణయించడం జరుగుతుంది. అంటే మార్కెట్‌లో కొనుగోలుశక్తి పెంచే చర్యలను తీసుకుంటేనే అదనంగా పెట్టుబడులు వస్తాయి. డిమాండ్‌ను పెంచే చర్యలు లేకపోతే పెట్టుబడిదారులు తమకు లభించిన ప్రోత్సాహకాలను చక్కగా దాచుకుంటారే తప్ప పెట్టుబడులు అదనంగా పెట్టరు. పైగా ఆ పెట్టుబడిదారులకు అదనపు ప్రోత్సాహకాలు ఇవ్వడానికి ప్రభుత్వం తాను చేసే వ్యయాన్ని కుదించుకుంటుంది. దాని ఫలితంగా సంక్షేమానికి పెట్టే ఖర్చు తగ్గి, మార్కెట్‌లో డిమాండ్‌ తగ్గిపోతుంది. అంటే ప్రభుత్వం ఆశించిన వృద్ధి కూడా ఆచరణలో రాదు. రెండవది: ఒకవేళ ప్రభుత్వం కోరుకున్నట్టుగానే పెట్టుబడిదారులు అదనంగా పెట్టుబడులు పెట్టారని, దాని ఫలితంగా జిడిపి వృద్ధిరేటు పెరిగిందని అనుకున్నా, ఆ వృద్ధి జరిగే రంగాలలో ఉపాధి వృద్ధి మాత్రం జరగదు. ఉపాధి అవకాశాలను కల్పించగల చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వడం నిలిపివేసింది కదా. అదీ కారణం.
       బడా పెట్టుబడిదారులకు ఉపాధి అవకాశాల కల్పన పేరుతో ప్రభుత్వం అనేక రాయితీలు ఒక పక్క ఇస్తున్నా, తన వంతుగా ఉపాధి అవకాశాలను కల్పించే బాధ్యతను మాత్రం ఈ ప్రభుత్వం నెరవేర్చడం లేదు. ప్రభుత్వ రంగంలో ఉన్న ఖాళీలను భర్తీ చేయడానికి పూనుకోవడం లేదు. ఆర్థిక వనరులు తగినంతగా లేకపోవడమే కారణం అని అంటోంది. కాని ఆర్థిక వనరుల కొరత దేని వలన వచ్చింది? పెట్టుబడిదారులకు అదనంగా రాయితీలు ఇచ్చినందువల్ల కాదా? ఒకపక్క నిరుద్యోగం పెరిగిపోతోందని గణాంకాలు వెల్లడి చేస్తూంటే ప్రభుత్వం మరోపక్క గ్రామీణ ఉపాధి హామీ పథకానికి వెచ్చించవలసిన నిధులలో కోత పెడుతోంది.
            బడా పెట్టుబడిదారుల కొమ్ము కాసే ఈ బిజెపి ప్రభుత్వం ఆది నుంచీ ఈ ఉపాధి హామీ పథకానికి వ్యతిరేకమే. అధికారంలోకి వచ్చాక ఏదో ఒక కారణంతో ఆ పథకాన్ని నీరుగార్చడానికే ప్రయత్నిస్తోంది. ఇప్పుడు ఆ పథకంలో అవినీతి చోటు చేసుకుంటోందన్న సాకుతో దానిని దెబ్బ తీయడానికి పూనుకుంటోంది. నిరుద్యోగం పెరగడం అనే వాస్తవాన్నే కాకుండా, నిరుద్యోగ సమస్య పట్ల బిజెపి ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరి ఎంత అర్ధరహితమో దానినీ మనం చూడాలి.

( స్వేచ్ఛానుసరణ )
ప్రభాత్‌ పట్నాయక్‌

prabhat patnaik