Jul 16,2023 09:06

ఇటీవల వివాదాస్పద చిత్రంగా పేరు తెచ్చుకున్న 'ఆదిపురుష్‌'లో శూర్పణఖ పాత్రలో నటించింది తేజస్విని పండిట్‌. ఇప్పుడు గూగుల్‌లో అందరూ 'ఎవరీ శూర్పణఖ?' అని వెతుకుతుంటే తనకు చాలా సంతోషంగా ఉందంటోంది తేజస్విని. ఆమె మరాఠీలో 2004లో తెరంగేట్రం చేసిన తేజస్విని నెగిటివ్‌ పాత్రతో ముందుకొచ్చారు. ఆ తర్వాత థియేటర్‌ ఆర్టిస్ట్‌గా చేశారు. ఆమె చాలా దుర్భరమైన జీవితాన్ని అనుభవించినట్లు చెప్పుకొచ్చారు. ఆమె గురించిన మరిన్ని విశేషాలు తెలుసుకుందాం.
ఇప్పుడు వివాదాస్పద చిత్రంగా పేరొందిన 'ఆదిపురుష్‌' చిత్రంలో శూర్పణఖ పాత్రధారి తేజస్విని గురించి నెటిజన్లు గూగుల్‌లో సెర్చ్‌ చేస్తున్నారు. ఇటీవల ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 'నా గురించి గూగుల్‌లో ఎవరీ శూర్పణఖ.. అంటూ వెతుకుతున్నారు చాలామంది. ఇదెంతో సంతోషకరమైన విషయం. శూర్పణఖ పాత్ర అంటే కొందరిలో ఓ ఆలోచన ఉంటుంది. అయితే ఈ స్టయిలిష్‌ చిత్రంలో అందంగా కనపడటం కొందరికి నచ్చలేదు. ముఖ్యంగా ఇన్‌స్టాలో నా వెస్టర్న్‌ అవుట్‌ఫిట్స్‌ చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. ఇలాంటప్పుడు నేనేమీ చేయలేను. నా వరకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నానంతే!' అన్నారు

మరాఠీలో క్రేజ్‌..

'తొలి ప్యాన్‌ ఇండియా చిత్రం 'ఆదిపురుష్‌' కావటం మర్చిపోలేని విషయం. ఇక నా కెరీర్‌ విషయానికొస్తే 2004లో మరాఠీ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టా. తొలి చిత్రంలోనే నెగిటివ్‌ పాత్ర చేశా. ఆ తర్వాత థియేటర్‌ ప్లేలు చేసి నటనలో మెరుగయ్యాను. నటనలో సీరియస్‌గా ముందుకెళ్లాను. మంచి పేరు కూడా వచ్చింది. మరాఠీలో పంతొమ్మిది చిత్రాల్లో నటించాను. అలా పాపులరయ్యాను. రాష్ట్ర స్థాయిలో చాలా అవార్డులు వచ్చాయి. టెలివిజన్‌లోనూ కొన్ని సీరియల్స్‌లో నటించాను. ఓటీటీలో '100 డేస్‌' అనే వెబ్‌ సిరీస్‌లో నటించాను. దీంతో మరాఠీ చిత్ర పరిశ్రమలో నాకు మంచి గుర్తింపు దక్కింది' అని ఆనందంగా తన కెరీర్‌కు సంగతులను పంచుకున్నారు తేజస్విని.

ఎన్నో బాధలు పడ్డాను..

'పూణెలో పుట్టి పెరిగాను. టీ మాన్యుఫ్యాక్చరింగ్‌ సంస్థలో మా నాన్న ఉద్యోగం చేశారు. అమ్మ పేరు జ్యోతి చందేకర్‌. ఆమె నటి కూడా. మేము ఇద్దరం అక్కచెల్లెళ్లం. మధ్యతరగతి కంటే ఘోరమైన కష్టాలు పడ్డాం. ఇంట్లో తినటానికి తిండి కూడా ఉండేది కాదు. డబ్బులుండేవి కావు. రాత్రిపూట కరెంటు ఉండేది కాదు. అప్పులే ఎక్కువ ఉండేవి. కొన్ని రాత్రుల్లో పిండిని బిస్కెట్లలా కాల్చుకుని, తిన్న రోజులు ఉన్నాయి. ఇవన్నీ నాకు గుర్తున్నాయి. అవన్నీ తల్చుకుంటే ఇప్పుడు చాలా బాధేస్తుంది. అయితే ఎక్కడా ఆ బాధలకు భయపడి, ఆగలేదు. మా చిన్నప్పటి పాఠశాల స్నేహితుడు భూషణ్‌తో 2012లో నాకు వివాహం జరిగింది. కొన్ని కారణాల వల్ల మేం విడిపోయాం. బిజినెస్‌ మ్యాన్‌ కొడుకును పెళ్లిచేసుకున్నప్పుడు వార్తల్లో నిలిచినట్లే.. విడిపోయాక కూడా నిలిచాను. అయినా అవేమీ నేను పట్టించుకోలేదు. నటనతో పాటు ఇటీవలే ఓ వెబ్‌సిరీస్‌ నిర్మాతగా కూడా పనిచేశాను. నాకు సినిమాలంటే అంత ఇష్టం.' అంటూ తన జీవితంలోని ఒడిదుడుకులను చెప్పారు తేజస్విని.
'ఆదిపురుష్‌' లాంటి చిత్రం వివాదాస్పదం కావడం మీద నేనేమీ అనలేనన్నారు. అయితే ఈ సినిమాలో నటించటం ఆనందంగానే ఉందని అన్నారు. సినిమా విడుదల అనంతరం ఫలితాలు ఎలా ఉన్నా.. తన పాత్రకి పాజిటివ్‌ రెస్పాన్స్‌ వచ్చిందని ఆమె అంటున్నారు.