Sep 02,2023 08:28

న్యూఢిల్లీ : చంద్రయాన్‌ -3 విజయవంతమైన తర్వాత ఇస్రో మరో ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఈసారి సూర్యునిపై ఇస్రో ప్రయోగం చేయనుంది. సూర్యుడిపై అధ్యయనం చేయడానికి అంతరిక్ష ఆధారిత తొలి భారతీయ అబ్జర్వేటరీ ఆదిత్య ఎల్‌ -1 ప్రయోగానికి 11.50కి పిఎస్‌ఎల్‌వి-సి57 ప్రయోగం ప్రారంభించనున్నట్లు ఇస్రో తెలిపింది. ఈ ప్రయోగానికి సంబంధించి లాంచ్‌ రిహార్సల్స్‌, వాహన అంతర్గత తనిఖీలు అన్నీ ఇప్పటికే పూర్తయ్యాయని ఇస్రో శుక్రవారం వెల్లడించింది. ఈ ప్రయోగంలో సూర్యుని వివరణాత్మక అధ్యయనం కోసం ఏడు వేర్వేరు పేలోడ్‌లను కలిగి ఉంటుంది. వీటిలో నాలుగు పేలోడ్‌లు సూర్యుని నుండి వచ్చే కాంతిని గమనిస్తాయి. మిగిలిన మూడు ప్లాస్మా మరియు అయస్కాంత క్షేత్రాలను కొలుస్తాయి. ఆదిత్య ఎల్‌-1లో అతిపెద్ద సాంకేతిక సవాల్‌గా ఉండే పేలోడ్‌ విజిబుల్‌ ఎమిషన్‌ లైన్‌ కరోనా గ్రాఫ్‌ (విఇఎల్‌సి) దీన్ని పరీక్షించినట్లు ఇస్రో తెలిపింది. భూమికి 1.5 మిలియన్‌ దూరంలో ఉన్న లాగ్రాంజియన్‌ పాయింట్‌ 1 (లేదా ఎల్‌1) చుట్టూ ఒక హాలో కక్ష్యలోకి ప్రయోగించబడుతుంది. ఈ కక్ష్య నుంచి సూర్యునికి చేరేందుకు సుమారు నాలుగు నెలలు సమయం పడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ ప్రయోగంలో అంతరిక్ష నౌక సౌర విస్పోటనం, సంఘటనలకు దారితీసే ప్రక్రియల క్రమాన్ని గుర్తించడంలో సహాయపడుతుంది. అంతరిక్ష వాతావరణంపై లోతైన అవగాహనకు ఈ ప్రయోగం దోహదం చేయనుందని ఇస్రో వెల్లడించింది. సోలార్‌ కరోనా యొక్క భౌతిక శాస్త్రం, దాని పని విధానం, సౌర గాలి, ఉష్ణోగ్రత, భూమికి సమీపంలోని అంతరిక్ష వాతావరణం వంటి విషయాలను తెలుసుకునే లక్ష్యాలుగా సన్‌ మిషన్‌ ప్రయోగం జరగనుందని ఇస్రో పేర్కొంది.