చిత్ర పరిశ్రమలో రీ ఎంట్రీలు కామనే.. అయితే అందరికీ ఒకేలాంటి ఎంట్రీ ఉండదు.. ఇందులో ఒక్కొక్కరిదీ ఒక్కోటైపు.. సుమారు పాతికేళ్ల విరామం తర్వాత వెండితెర వేదికగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు నటి వాసుకి. పవన్ కల్యాణ్ నటించిన 'తొలిప్రేమ' తర్వాత వెండితెరకు దూరంగా ఉన్న ఆమె ఇప్పుడు నందినిరెడ్డి దర్శకత్వం వహిస్తోన్న 'అన్నీ మంచి శకునములే' తో కెమెరా ముందుకు వచ్చారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల పలు ఇంటర్వ్యూల్లో పాల్గొన్నారు వాసుకి.. ఆ సందర్భంగా ఆమె పలు ఆసక్తికర అంశాలను పంచుకున్నారు.. అవేంటో తెలుసుకుందాం..
వాసుకి తమిళ నటి అయినప్పటికీ తెలుగులో ఈ రేంజ్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ రావడానికి ఆమెకు ఒక్క 'తొలిప్రేమ' సినిమా మాత్రమే కారణం అయ్యింది. 13 ఏళ్ల వయస్సు(1992) లో అనుకోకుండానే టీవీ సీరియళ్లలో నటించడం మొదలుపెట్టారు. కేవలం ఐదేళ్లలోనే 20కి పైగా సీరియళ్లలో నటించారు. తమిళంలో 'ఆలుమగలు' అనే సీరియల్‌లో ఆమె నటన చూసిన కరుణాకరన్ 1998లో 'తొలిప్రేమ'లో అవకాశం ఇచ్చారు. అంతకుముందు తమిళ సినిమాల్లో, సీరియల్స్‌లో చాలా ఏళ్ళ పాటు సపోర్టింగ్ పాత్రలో నటించిన వాసుకి తెలుగులో మాత్రం చాలా తక్కువ సినిమాల్లోనే కనిపించారు. ఆ తర్వాత ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్‌సాయిని ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు. వాసుకి పెళ్లి అయ్యి పిల్లలు పుట్టాక మళ్లీ నటించలేదు. ఆమె పిల్లలతో బిజీగా ఉన్న టైంలో ఎన్ని అవకాశాలొచ్చినా రిజెక్ట్ చేశారు.
- ఇన్నేళ్లకు సమయం కుదిరింది..
''తొలిప్రేమ' తర్వాత నాకు చాలా అవకాశాలు వచ్చాయి. కానీ ఫ్యామిలీ వర్క్‌లో బిజీగా ఉండటంతో చేయడం కుదరలేదు. ఎందుకంటే నేను మల్టీ టాస్కర్ కాదు. అన్ని పనులూ ఒకేసారి చేయలేను. ముందు పిల్లలు, వాళ్ళ చదువులు. ఇప్పుడు ఇద్దరు పిల్లలు యూకేలో చదువుతున్నారు. పాప మెడిసిన్ ఫోర్త్ ఇయర్, బాబు సెకండ్ ఇయర్ ఆర్కిటెక్చెర్. ఆనంద్‌సాయి తన పనిలో బిజీగా ఉన్నారు. ఇప్పుడు ఏదైనా చేయడానికి నాకు సమయం కుదిరింది. ఇలాంటి టైమ్‌లోనే నందినిరెడ్డి చెప్పిన కథ బాగా నచ్చింది. పైగా స్వప్న కూడా ఎప్పుడూ సినిమా చేయమని అడుగుతుండేది. ఫైనల్‌గా ఈ కథ కుదిరింది.' అని చెప్పుకొచ్చారు.
- పాత్రను బట్టే మరిన్ని సినిమాలు..
''తొలిప్రేమ'ను దృష్టిలో పెట్టుకునే ఇందులో నటించా. చాలా క్యూట్ సిస్టర్ క్యారెక్టర్‌లో కనిపిస్తా. బ్రదర్ అండ్ సిస్టర్ ఎమోషన్‌కు ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. ఈ మధ్య చాలా వైలెన్స్ సినిమాలు, డిస్టర్బ్ చేసే సినిమాలే వస్తున్నాయి. హాయిగా ప్రశాంతంగా చూసే సినిమా ఇది. సీనియర్స్‌తో నటించడం హెల్దీగా అనిపించింది. ఒక మార్క్ క్రియేట్ చేసేలా పాత్రలు వస్తే మరిన్ని సినిమాలు చేస్తాను. ప్రస్తుతం సినిమాలతో పాటు చదువుపై కూడా దృష్టి పెట్టాను. సైకాలజీలో పీహెచ్‌డి చేస్తున్నా'. అని తెలిపారు.
- కంఫర్ట్ జోన్ ముఖ్యం..
యాక్టింగ్ కెరీర్‌ని ఎందుకు సీరియస్‌గా తీసుకోలేదు? అని అడిగిన ప్రశ్నకు 'యాక్టింగ్ కాదు.. నేను దేన్నీ సీరియస్‌గా తీసుకోను. ఇదే మన దారి.. ఇదే చేయాలని అనుకోను. అది నా తత్త్వం. ఇక విరామం తర్వాత మళ్ళీ సినిమా చేస్తున్నామంటే మన కంఫర్ట్‌జోన్ ముఖ్యం. తొలిప్రేమ చేసినప్పుడు నాకు 18 ఏళ్ళు. అప్పుడు డైలాగ్ రాకపోయినా, తెలుగు రాకపోయినా, కొత్త స్థలమైనా.. ఒక ధైర్యంతో ముందుకు వెళ్ళిపోయా. ఈ ఏజ్‌లో రీఎంట్రీ అంటే మాత్రం ఒక సేఫ్ అండ్ కంఫర్ట్ జోన్ చూస్తాం. కథ విన్న వింటనే సేఫ్ అండ్ కంఫర్ట్ జోన్ ఫీలయ్యాను. నిజానికి నాకు బ్రదర్స్ లేరు. ఆ ఎమోషన్ నాకు పర్శనల్‌గా కనెక్ట్ కాదు. నిజానికి కథ బావుంటే తల్లి పాత్ర చేయడానికి కూడా రెడీనే' అని చెప్పారు.
పేరు : వాసుకి ఆనంద్
పుట్టిన ప్రాంతం : చెన్నయ్
నివాస ప్రాంతం : హైదరాబాద్
వృత్తి : నటన, గూగుల్‌లో ఉద్యోగం
చదువు : సైకాలజీలో పీహెచ్‌డీ చేస్తున్నారు
జీవిత భాగస్వామి : ఆనంద్‌సాయి
పిల్లలు : హర్ష, సందీప్
హాబీస్ : లిజనింగ్ మ్యూజిక్, డ్యాన్సింగ్