- శీతాకాలపు మంచు తుఫానుతో కడగండ్లు
- 2000 విమాన సర్వీసుల రద్దు
- 9 లక్షల ఇళ్లకు నిలిచిపోయిన విద్యుత్
వాషింగ్టన్ : అమెరికా మరోమారు మంచులో చిక్కుకుపోయింది. వేలాది విమానాల రద్దు, విద్యుత్ నిలిపివేత, రహదారుల దిగ్బంధనంతో అక్కడి ప్రజానీకం కడగండ్లు ఎదుర్కొంటున్నారు. శీతాకాల మంచు తుఫాను గురువారం నాడు తీవ్రస్థాయి విరుచుకుపడింది. పశ్చిమ తీరం నుంచి గ్రేట్ లేక్స్ వరకు ఎడతెరిపి లేకుండా భారీగా మంచు కురుస్తోంది. దీంతో ఆరు రాష్ట్రాల్లో 9 లక్షల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కాగా 24 పైగా రాష్ట్రాల్లో 2.4 కోట్ల మంది ప్రజలు మంచు తుఫాను ప్రభావానికి గురైనట్లు సంబంధిత అధికారులు తెలపారు. ఒక మిచిగాన్ రాష్ట్రంలోనే 6.7 లక్షల ఇళ్లకు విద్యుత్ నిలిపేశారు. దాదాపు 2000 విమాన సర్వీసులు రద్దయ్యాయి. లాస్ఏంజెల్స్ సమీపంలో సాధారణంగా వెచ్చగా ఉండే ప్రాంతాలకు సైతం భారీ హిమపాతం హెచ్చరికలు జారీ అయ్యాయి. మిన్నెసోటాలో పరిస్థితులు తీవ్రమయ్యే అవకాశం ఉందని జాతీయ వాతావరణ సేవల విభాగం హెచ్చరించింది. గంటకు 55 నుంచి 70 కిలోమీటర్లతో వీచే గాలులతో కలిపి భారీగా మంచు కురిసే అవకాశం ఉందని తెలిపింది. డెన్వర్, సాల్ట్ లేక్ సిటీ, మినియాపొలిస్, సెయింట్ పాల్, వ్యోమింగ్లలోనూ పరిస్థితులు దారుణంగా మారాయి. ఇలా అమెరికా పశ్చిమ, ఉత్తర ప్రాంతాలు చలితో వణుకుతుంటే.. తూర్పు ప్రాంతాల్లో అసాధారణ ఉష్ణోగత్రలు నమోదవుతుండటం గమనార్హం. ముఖ్యంగా ఒహైయో వ్యాలీ, మధ్య అట్లాంటిక్లలో సగటు కంటే 40 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని జాతీయ వాతావరణ శాఖ తెలిపింది.