Oct 01,2023 13:26

వెలగపండు లో పోషకాలు, విటమిన్లు, ఫ్లేవనాయిడ్లు ఉండటం వలన యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. వెలగపండులో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఎక్కువగా తింటే కొన్ని సైడ్‌ ఎఫెక్ట్స్‌ వచ్చే అవకాశం ఉంది. అందుకని పరిమితంగానే తినాలి. ఇది వగరు, పులుపు, తీపి రుచుల మేళవింపు. దీనితో జామ్‌, పచ్చళ్ళు, రసాలు, జెల్లీలు తయారుచేస్తున్నారు. సీజనల్‌గా దొరుకుతుంది కాబట్టి దీని ఉపయోగాన్ని దృష్టిలో పెట్టుకుని, ఇందులో కొత్త రుచులూ మనుగడలో ఉన్నాయి. వాటిలో కొన్నింటిని ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం.

sweet

                                                                                  స్వీటు ..

కావలసినవి : వెలగపండు గుజ్జు-కప్పు, బెల్లం - 1/4 కేజీ, పచ్చికొబ్బరి - చిప్ప, నెయ్యి - స్పూను, యాలకుల పొడి - 1/4 స్పూను
తయారీ : వెలక్కాయ లోపలి గుజ్జును బరకగా మిక్సీ పట్టుకుని పక్కనుంచుకోవాలి. జార్‌లో తిరగటానికి కావలసినన్ని నీళ్ళుపోసుకోవచ్చు. అడుగు మందంగా ఉన్న వెడల్పు గిన్నెలో బెల్లం తీగ పాకం పట్టాలి. మిక్సీ పట్టిన గుజ్జును దానిలో వేసి బాగా కలుపుతూ ఐదు నిమిషాలు ఉడికించాలి. తర్వాత కొబ్బరి తురుము, యాలకుల పొడి వేసి కలుపుతూ మరో ఐదు నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత నెయ్యి వేసి బాగా కలపాలి. స్వీటు బాండీ నుండి విడిపోతున్నప్పుడు స్టౌ ఆపి, నెయ్యి రాసిన ప్లేటులోకి తీసుకోవాలి. పలుచగా తట్టి చాకుతో ముక్కలుగా కట్‌ చేసినట్లు గాట్లు పెట్టుకోవాలి. పూర్తిగా ఆరనిచ్చి, ముక్కలు తీసుకుని, సర్వ్‌ చేసుకోవడమే.

vadalu

                                                                                      వడలు ..

కావలసినవి : వెలగపండు గుజ్జు- కప్పు, మినపగుళ్ళు - కప్పు, శనగపప్పు - 1/2 కప్పు, పచ్చిమిర్చి - 4, ఉప్పు- రుచికి సరిపోయినంత, కరివేపాకు - 4 రెబ్బలు, అల్లం - చిన్నముక్క, జీలకర్ర - స్పూను, కొత్తిమీర - 2 స్పూన్లు, నూనె- డీప్‌ ఫ్రైకి సరిపోయినంత.
తయారీ : పప్పులను నాలుగు గంటలు నానబెట్టి, రుబ్బుకోవాలి. పిండి సగం నలిగిన తర్వాత వెలగపండు గుజ్జును కూడా వేసి, మెత్తగా రుబ్బుకోవాలి. దీనిని వెడల్పు గిన్నెలోకి తీసుకొని, సన్నగా తరిగిన అల్లం, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, ఉప్పు, సన్నగా తరిగిన కరివేపాకు, కొత్తిమీర వేసి బాగా కలపాలి. బాండీలో నూనె వేడిచేసి, పిండిని వడలుగా చేసి వేయించాలి. అంతే వెలగపండు వడలు రెడీ.

nilva pachadi

                                                                               నిల్వ పచ్చడి ..

కావలసినవి : వెలక్కాయ గుజ్జు - కప్పు, ఎండుమిర్చి- 15, ధనియాలు - స్పూను, జీలకర్ర- 11/2 స్పూను, ఉప్పు- తగినంత, వెల్లుల్లి - 6 రెబ్బలు
తాలింపుకు : నూనె - 4 స్పూన్లు, ఆవాలు - స్పూను, జీలకర్ర - స్పూను, వెల్లుల్లి రెబ్బలు - 3, ఇంగువ- చిటికెడు
తయారీ : పచ్చి వెలక్కాయ గుజ్జును ఒక గిన్నెలోకి తీసుకుని మెదిపి పక్కనుంచు కోవాలి. బాండీలో రెండు స్పూన్లు నూనె వేడిచేసి ధనియాలు, జీలకర్ర, తొడిమలు తీసిన ఎండుమిర్చి దోరగా వేయించి చల్లారనివ్వాలి. వీటిని జార్‌లోకి తీసుకుని ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు వేసి పొడి చేయాలి. ఈ పొడిని రోట్లోకి తీసుకొని, వెలక్కాయ గుజ్జు వేసి నూరుకోవాలి. బాండీలో నూనె వేడిచేసి తాలింపు పెట్టుకొని, వేగిన తర్వాత పచ్చడిని కూడా దానిలో వేసి ఐదు నిమిషాలపాటు వేయించాలి. అంతే ఘుమఘుమలాడే వెలక్కాయ పచ్చడి రెడీ. దీనిని శుభ్రమైన సీసాలో భద్రపరుచుకోవచ్చు. అంతే వెలక్కాయ నిల్వపచ్చడి రెడీ అయిపోయింది.