Jun 04,2023 08:13

'పోయి పోయి ఆ మూర్ఖుడితో పెట్టుకుంటున్నారేమిటీ?' అన్నాడు రామనాథం నిష్టూరంగా.
ఆయన వైఖరి అర్థంకాక అయోమయంగా చూశాను.
'అంకినీడు ఎవడో తెలుసా? కార్పొరేటర్‌ బామ్మర్ది.. చాలా పవర్‌ఫుల్‌ వ్యక్తి. అలాంటివాడి వ్యవహారంలో వేలుపెడితే..'
రామనాథం చెప్పటం పూర్తికాలేదు. నేను మధ్యలోనే అడ్డుకున్నాను. 'ఒకవైపు పిల్లలు చదువుకునే బడి.. ఇంకోవైపు భక్తులు ఇలవేల్పు పోచమ్మ గుడి. ఆ రెండింటికి మధ్యలో సారా దుకాణమా? దీనివల్ల అటు పిల్లలకు, ఇటు భక్తులకు ఎంత అసౌకర్యంగా ఉంటుంది? దీని గురించి మాట్లాడటం తప్పా? వెంటనే తొలగించమని పోలీసులకు ఫిర్యాదు చేయాలనుకోవటం నేరమా?' ఆవేశంగా ప్రశ్నించాను.
'ఏదో కాలనీ పెద్ద కదా అని మీ దగ్గరకొచ్చి సలహా అడిగితే, నాకు చేదోడువాదోడుగా ఉండటం మానేసి, నిరుత్సాహపరుస్తారేమిటి?' రామనాథంపైన అంతెత్తున లేచాను.
'మీరు ఈ ఏరియాకి కొత్త. వాడి విషయం మీకు తెలీదు' అనునయిస్తున్నట్టుగా అన్నాడాయన. ఎంత సీరియస్‌ వ్యవహారమైనా కొందరు ఆవేశపడరు. అదే ఆయనలో కనిపించింది.
'అంత మొనగాడా?'
'మగాడా? మొనగాడా అన్న విషయాలు పక్కన పెట్టండి. వాడిని రాక్షసుడు అనటం కరెక్టు. ఈ ఏరియాలో దందాలు చేస్తూంటాడు. ఎప్పుడూ పాతిక, ముప్పై మంది కుర్రాళ్లను పక్కనేసుకుని తిరుగుతూంటాడు. ఇక్కడ ఎవడు కొత్త షాపు పెట్టినా, ఇల్లు మొదలుపెట్టినా వాడికి లంచం ఇవ్వవలసిందే. వాడు చేసే ఆగడాలు అన్నీ ఇన్నీ కావు. వాడిని ఎదిరించి బతికి బట్టకట్టగల వాళ్లెవరూ లేరు.'
'సారా కొట్టు వల్ల న్యూసెన్స్‌ అన్న విషయాన్ని మీరు మరిచిపోతున్నారు.'
'కాదండీ.. తనకు మాలిన ధర్మం ఎందుకు అని..? అలాంటివాడితో పెట్టుకుని మనం..'
'పిల్లలకు సత్ప్రవర్తన, నీతినిజాయితీల గురించి, సమస్యలొచ్చినప్పుడు ధైర్యంగా పోరాడటం గురించి నేర్పే ప్రధానోపాధ్యాయుడిని. నేనే చేతులు ముడుచుకుని కూర్చుంటే ఎలా? వాళ్లకు నేనెలా ఆదర్శం అవుతాను?'
'అలాగని లేనిపోని సమస్యలు కొని తెచ్చుకుంటామా? పక్కనున్న స్కూలు వాళ్లు, గుడివాళ్లు సారా కొట్టు తొలగించటానికి చెయ్యని ప్రయత్నం లేదు. ఎంతోమంది అధికారులను, రాజకీయ నాయకులను కలిశారు. ఫలితం లేకపోయింది. చివరకు కాళ్లావేళ్లా పడి, అతన్ని బతిమాలారు. నేను ముందు సారా కొట్టు పెట్టుకున్నాను. ఎన్నో ఏళ్లుగా నడుస్తోంది. ఈ గుడి, బడి ఈ మధ్యనే వచ్చాయి. ఇష్టం లేకపోతే మీరు వేరేచోట చూసుకోండి అని వాదిస్తే చేసేది లేక తిరుగుముఖం పట్టారు..'
నేను ఆయన చెప్పేది ఆసక్తిగా వినసాగాను.
'ఆ మధ్య కుర్ర జర్నలిస్టు ఒకడు దూకుడుగా వెళ్లాడు. సారా కొట్టుకు వ్యతిరేకంగా పత్రికలో చిన్న కథనం ప్రచురించాడు. అంతే అంకినీడు మనుషులు రెచ్చిపోయారు. అందరూ చూస్తుండగానే పట్టపగలు నడిరోడ్డు మీద అతన్ని కొట్టుకుంటూ తీసికెళ్లారు. ఒక్కడు స్పందిస్తే ఒట్టు. వాళ్లు కొట్టిన దెబ్బలకు పాపం ఆ అబ్బాయి రెహ్మాన్‌ ఆరునెలల పైనే మంచం మీద ఉన్నాడు. అంకినీడు అతన్ని వదలలేదు. అతనిపైన ఆరోపణలు చేశాడు. పత్రికలో కథనం రాయకుండా ఉండేందుకు లక్ష రూపాయలు డిమాండ్‌ చేశాడని, తను అంగీకరించక పోవటంతోనే పత్రికలో వార్త వేశాడని, పత్రిక యాజమాన్యాన్ని సులువుగా నమ్మించాడు. దాంతో అతని ఉద్యోగం కూడా పోయింది. మా జోలికొస్తే ఎవరికయినా ఇదే గతి పడుతుందని హెచ్చరికలు చేయాలన్న ఉద్దేశ్యం కాబోలు అతన్ని నానా రకాలుగా హింసపెట్టారు. దాంతో కాలనీలో రెహ్మాన్‌ తలెత్తుకోలేకపోయాడు. కుర్రాళ్లను కొందరిని పోగు చేసి, నిరాహారదీక్ష చేయిస్తాను. సారా కొట్టు ఇక్కడ నుంచి తొలగించేదాకా పోరాడతాను' అని ఆవేశంగా మాట్లాడిన వ్యక్తి రాత్రికి రాత్రే కాలనీ వదిలేసి, ఎక్కడో ఊరవతల కాపురం ఉంటున్నాడు' భారంగా నిట్టూరుస్తూ గతాన్ని నా ముందు పరిచాడు రామనాథం.
'మనం నాగరిక ప్రపంచంలో ఉన్నామా? ఆటవిక యుగంలో ఉన్నామా? నాకు అర్థం కావటం లేదు' అన్నాను ఆవేశపడుతూనే.
'ఆ విషయాలు తర్వాత తేల్చుకోవచ్చుగానీ, ముందు ఆ ఫిర్యాదు కాపీని ఇటివ్వండి' అని నా చేతిలో ఉన్న కాగితాన్ని గబుక్కుని లాక్కుని, చించి పక్కనున్న బుట్టలో వేశాడు.
నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. 'బలవంతుల్ని ఎదుర్కొనే పద్ధతి ఇది కాదండీ' అన్నాడు చిరునవ్వుతో. చేసేది లేక కాసేపు అక్కడ ఉండి వచ్చేశాను.
ఇది జరిగి నెలరోజులు కూడా కాలేదు.
అంకినీడు సారా కొట్టు తీసేశాడని, పక్కనున్న గోడౌన్‌ కూడా ఖాళీ చేశాడనే విషయం కాలనీలో ఒక్కసారిగా గుప్పుమంది. ఇది ఎనిమిదో వింతగా అంతా చెప్పుకున్నారు. నమ్మకం కుదరక కొందరు స్వయంగా ఆ ప్రదేశానికి వెళ్లి, చూసొచ్చి అది వాస్తవమే అని నిర్ధారించారు.
'అసలేమయ్యింది. ఇంతకాలం దాని జోలికి వస్తే ఊరుకోని పెద్ద మనిషి మనసు ఎలా మారింది?' నాకు అంతుచిక్కలేదు. రామనాథాన్ని కలవటానికి ఆయన ఇంటికి వెళ్లాను.
'మానవమాత్రులం మనం ఏం చేయగలమండీ? అదంతా పోచమ్మ తల్లి దయ. అంతా ఆమే చేయించుకుంది!' అన్నాడు అభావంగా.
ఈ సమాధానాన్ని నేను ఊహించలేదు. ఆయనకు తెర వెనుక ఏం జరిగి ఉంటుందో తెలిసి ఉంటుందన్న నా అంచనా తప్పింది. అదే రోజు సాయంత్రం మా ఆవిడ కూడా ఇదే విషయంపైన మాట్లాడింది.
'పోచమ్మ తల్లి జాతరలో.. ఎవరో ఒకావిడ మీదకు పోచమ్మ తల్లి పూనిందట. సారా కొట్టు వల్ల అరిష్టం దాపురిస్తుంది అని హెచ్చరించిందట. అంకినీడు భార్యకు ఈ నమ్మకాలు ఎక్కువ కావటంతో మర్నాడు జ్యోతిష్కుడిని కలిసి అతని జాతకం చూపించిందట. జనఘోష ఎక్కువగా ఉందని, అది పోగొట్టుకుంటే 'రాజయోగం' సిద్ధిస్తుందని చెప్పారట. దాంతో సారా కొట్టు అక్కడ నుంచి తీసేశారట'.. ఇలా 'ట' ల కథనం చెవిన వేసింది.
ఇందులో నిజానిజాలేమిటో నాకు అర్థం కాలేదు.
రెండు మూడు రోజుల తర్వాత 'యువజన నేత అంకినీడు' పేరుతో ఊరి నిండా రకరకాల పోస్టర్లు వెలిశాయి. అది ఎవరు వేయించారో తెలియలేదు. కాలనీలో సందడి ఎక్కువయ్యింది. మైకులతో రోడ్లు హోరెక్కుతున్నాయి. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ టిక్కెట్‌ కార్పొరేటర్‌కి వస్తోందని, ఆయన బావమరిది అంకినీడు కాబోయే కార్పొరేటర్‌ అన్న ప్రచారమూ సాగింది.
సారా కొట్టు విషయం సీఎం దాకా వెళ్లిందని, ఆయన చేసిన హెచ్చరికలతో కార్పొరేటర్‌ కదిలి, బావమరిదికి చెప్పి, షాపు తీయించాడని కూడా చెప్పుకున్నారు. సిటీలో.. ఓ కాలనీలో ఉండే చిన్న సారా దుకాణం గురించి సీఎం స్థాయిలో వ్యక్తి పట్టించుకుంటారా అనిపించినా.. స్కూలు పిల్లలు నేరుగా ముఖ్యమంత్రికి ఫిర్యాదు పంపితే, అది సంభవం కావచ్చని నాకు నేనే సమాధాన పడ్డాను.
అయితే అంకినీడుపైన ఏ శక్తి పనిచేసిందో తెలుసుకోవాలన్న ఆరాటం నాకు పోలేదు.
ఓ రోజున జర్నలిస్టు రెహ్మాన్‌ కనిపిస్తే రోడ్డు మీద ఆపి అడిగాను. 'ఇందులో ఏది నిజం?'
'ఇవన్నీ నిజాలు కావచ్చు. ఏదీ నిజం కాకపోవచ్చు' అన్నాడు తాత్త్వికంగా.
'అదేంటి?' అనడిగాను.
'బలవంతుడయిన శత్రువు కూలటానికి చాలా అంశాలు దోహదపడతాయి!' అన్నాడు నర్మగర్భంగా.
మళ్లీ అంతలోనే..
'సారా కొట్టు పీడ విరగడయిందని సంతోషించక ఈ ఆలోచనలేమిటి గురుగారూ?' అనేసి మెరుపులా అక్కడ నుంచి మాయమయ్యాడు.
అంకినీడు దెబ్బతిన్నాడన్న ఆనందం అతని ముఖంలో లీలగా కనిపించింది. నా మనసులో అనుమానాలు మరింత ఎక్కువయ్యాయి. అలా ఆలోచిస్తూ అక్కడే ఉండిపోయాను.

డాక్టర్‌ పార్థసారథి చిరువోలు
99088 92065