Sep 17,2023 07:22

ఒకే విషయాన్ని పదే పదే చెప్పడం.. జ్ఞాపకశక్తి తగ్గిపోవడం.. రోజువారీ విషయాల్నీ మరిచిపోవడం.. కుటుంబసభ్యులు, బాగా తెలిసినవారి పేర్లూ గుర్తుకురాకపోవడం.. వస్తువులు ఎక్కడపెట్టారో గుర్తుండకపోవడం.. ఏకాగ్రత పెట్టలేకపోవడం.. తీవ్రమైన గందరగోళం.. రాయడం, చదవడం, మాట్లాడేటప్పుడు ఇబ్బందిపడటం.. కొద్ది నిమిషాల ముందు జరిగిన విషయాల్నీ మర్చిపోవడం.. పట్టరాని భావోద్వేగాలు, వ్యక్తిగత మార్పులు రావడం.. ఈ లక్షణాలే అల్జీమర్స్‌.. దాదాపు 60 శాతం మంది వృద్ధులు ఎక్కువగా బాధపడుతున్న సమస్య ఇది. అల్జీమర్స్‌ అంటే మెదడు దెబ్బతినడం.. జ్ఞాపకశక్తిని ప్రభావితం చేసే వ్యాధి. అల్జీమర్స్‌ ఉన్న వ్యక్తికి రోజువారీ కార్యకలాపాలు నిర్వహించుకోవడం కూడా చాలా కష్టమవుతుంది. అలాంటి వారు సమస్య నుంచి బయటపడేందుకు చికిత్స తప్పనిసరి. ఈ నెల 21వ తేదీన ప్రపంచ అల్జీమర్స్‌ దినం సందర్భంగా ఈ ప్రత్యేక కథనం

1

ప్రతి ఏడాది సెప్టెంబర్‌ 21వ తేదీన 'ప్రపంచ అల్జీమర్స్‌ దినం' జరుపుకుంటాము. ఎందుకంటే ఈ వ్యాధి పట్ల ఉన్న భయాలను తొలగించడానికి, ఈ వ్యాధి గురించి అవగాహన పెంచడానికి ప్రపంచ వ్యాప్తంగా ఆ రోజు వివిధ మాధ్యమాల్లో ప్రచారం చేపడతారు. మానవ సమాజంలో జరిగిన అభివృద్ధి మూలంగా సగటు ఆయుష్షు పెరిగింది. పంతొమ్మిదవ శతాబ్దం వరకు కూడా మనిషి పుట్టినప్పుడు లైఫ్‌ ఎక్సపెక్టన్సీ ముప్పై ఐదు సంవత్సరాలకు మించి ఉండేది కాదు. అంటే చాలా మంది పిల్లలు సంవత్సరం వరకు కూడా బతికేవారు కాదు. అంటువ్యాధులు విపరీతంగా ఉండేవి. దాని మూలాన చిన్న వయసులో మరణాల రేటు విపరీతంగా ఉండేది. ఇరవై / ఇరవై ఒకటో శతాబ్దంలో శాస్త్ర విజ్ఞానంలో జరిగిన చారిత్రాత్మక మార్పుల వల్ల మన సగటు ఆయుష్షు ఎంతో పెరిగింది. అభివృద్ధి చెందిన జపాన్‌ వంటి దేశాల్లో ప్రస్తుతం జీవితకాలం 84 సంవత్సరాలు ఉండగా, మన దేశంలో 70 సంవత్సరాలు ఉంది. ఇలా పెరుగుతున్న వయసు వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు ముందు శతాబ్దంలో చూసిన సమస్యల కంటే భిన్నమైనవిగా ఉంటాయి. సమాజాభివృద్ధిలో జరిగిన మార్పులు, మన ఆరోగ్యంపైన కూడా ప్రభావం చూపుతాయి. మునుపు లేని, ఉన్నా మనకి తెలియని వ్యాధులు ఇప్పుడు కనబడుతున్నాయి. ఇదివరకు అంటువ్యాధులు ఎక్కువగా వుంటే, ఇప్పుడు దీర్ఘకాలిక వ్యాధులు (ఒకరి నుండి మరొకరికి సోకేవి) ఎక్కువగా కనబడుతున్నాయి.

దీర్ఘకాలిక వ్యాధి..

ఇలాంటి దీర్ఘకాలిక వ్యాధుల్లో ఒకటి అల్జీమర్స్‌ వ్యాధి. ఈ వ్యాధిని అలోయిస్‌ అల్జీమర్‌ అనే జర్మన్‌ వైద్యుడు 1906లో ఒక యాభై ఏళ్ళ మహిళలో కనుగొన్నారు. ఆ మహిళకి కనబడిన లక్షణాలు విచిత్రంగా ఉన్నాయని తన లక్షణాలు గమనిస్తూ, తనని పరీక్షిస్తూ, చికిత్స చేస్తూ ఉన్నారు. వ్యాధిని గుర్తించిన ఐదు సంవత్సరాలకి ఆవిడ మరణించాక పోస్ట్‌మార్టం చేసి, ఆమెకి వచ్చింది మెదడుకి సంబంధించిన ఒక కొత్త వ్యాధి అని ఆయన నిర్ధారించారు.
ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు నాలుగు కోట్ల మంది జ్ఞాపకశక్తి లోపంతో బాధపడుతూ వుంటే, అందులో పదో వంతు జపాన్‌లోనే ఉన్నారు. ఆ దేశంలో చాలా మంది వృద్ధులు ఉండటం ఒక కారణంగా అనుకోవచ్చు. మొత్తం ఉన్నకేసుల్లో అరవై శాతం అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాల్లోనే ఉన్నాయని ఒక అంచనా. మనదేశంలో నలభై లక్షల మంది జ్ఞాపకశక్తి లోపంతో బాధపడుతున్నారు. జ్ఞాపకశక్తి లోపం కలిగించే చాలా వ్యాధులలో ప్రధాన వ్యాధి మాత్రం అల్జీమర్స్‌. దీనివల్ల జ్ఞాపకశక్తి, ఆలోచన శక్తీ, మనం ప్రవర్తించే తీరులో మార్పులు వస్తాయి. ఇప్పటిదాకా మొత్తం అల్జీమర్స్‌ వచ్చిన వారిలో అరవై ఆరు శాతం మంది మహిళలే ఉన్నారు. మొదట్లో జ్ఞాపకశక్తి లోపం తక్కువగా ఉన్నా, మెల్లగా మెదడుకి సంబంధించిన లక్షణాలు పెరుగుతాయి. ఒక్కొక్కరిలో ఒక్కో స్థాయిలో మెదడు క్షీణిస్తూ వస్తోంది. చాలా మంది అల్జీమర్స్‌ వ్యాధిని గుర్తించాక, వారికి అందే సహాయాన్ని బట్టి ఎనిమిది నుండి పది సంవత్సరాలు జీవిస్తారు.

2

ప్రభావితం చేసే విధానం..

అల్జీమర్స్‌ మన మెదడుని ప్రభావితం చేసే విధానం ఎలా ఉంటుందంటే.. మన మెదడులో కనీసం పది లక్షల కోట్ల నాడీ కణాలు ఉంటాయి. అవి మెదడులోని భాగాల మధ్యలో, మెదడు నుండి అన్ని కండరాలకి, మన శరీరంలోని వివిధ భాగాలకు సమాచారం పంపుతూ ఉంటాయి. అల్జీమర్స్‌ వచ్చిన వ్యక్తులకు ఈ నాడీ సమాచార వ్యవస్థ ధ్వంసం అవుతుంది. అప్పుడు మెదడు నుండి సంకేతాలు సరిగ్గా అందక, శరీరంలోని వివిధ కణాలు మరణించడం జరుగుతుంది.
అల్జీమర్స్‌ను వృద్ధాప్యంలో భాగంగా వచ్చే సామాన్య సమస్యగా చూడకూడదు. మెదడులో వృద్ధ్యాప్యం వల్ల వచ్చే మార్పులకు, అల్జీమర్స్‌తో వచ్చే మార్పులకు చాలా తేడా ఉంటుంది. మామూలు వృద్ధ్యాప్యం వల్ల మెదడు మాత్రం కుంచించుకు పోతుంది. నాడీ కణాలు ఎక్కువగా దెబ్బతినవు. అదే అల్జీమర్స్‌లో చాలా నాడీకణాలు పనిచేయడం మానేస్తాయి. మిగతా నాడీ కణాలతో సంబంధం తెగిపోతుంది. సంకేతాలు పంపుకోలేవు. దెబ్బతిన్న కణాలను రిపేర్‌ కూడా చేసుకోలేవు. అల్జీమర్స్‌ వచ్చిన కొత్తలో మెదడులో జ్ఞాపకశక్తికి సంబంధించిన భాగం (హిప్పో క్యాంపస్‌) ప్రభావితం అవుతుంది. తర్వాత భాషకి సంబంధించిన భాగాలు, తార్కికంగా ఆలోచించే భాగాలు, సామాజిక ప్రవర్తనకి సంబంధించిన భాగాలు కూడా దెబ్బతింటాయి. రోజులు గడుస్తున్నా కొద్దీ మెదడులోని చాలా భాగాలు దెబ్బతింటాయి. చివరికి మనిషి తనకు తానుగా బతికే శక్తిని కోల్పోయి, వేరే వాళ్ళ పైన ఆధారపడాల్సి వచ్చి, చివరికి మరణిస్తాడు.
అల్జీమర్స్‌ వ్యాధిలో బీటా అమైలాయిడ్‌ అనే ప్రోటీన్‌ (ఒక రకం మాంసకత్తులు) నాడీ కణాల మధ్యలో జమవుతుంది. ఇవి ఒకదానికి ఒకటి అంటుకొని, మెదడులో ఫలకాల్లా ఏర్పడతాయి. ఇవే కాకుండా నాడీ కణాల లోపల కూడా ఒక రకం మాంసకృత్తులు (టౌ ప్రోటీన్‌) జమవడం వల్ల నాడీ కణాల లోపల చిక్కుముడులు (న్యూరోఫైబ్రిల్లరీ టాంగ్లెస్‌) ఏర్పడతాయి. దీనివల్ల కూడా నాడీ కణాలు ఒకదానితో మరొకటి సంభాషించుకోలేవు.
అల్జీమర్స్‌ వ్యాధి వల్ల మెదడులో జరిగే మార్పులు చాలా మట్టుకు మనకి సూక్ష్మంగా అర్థమైనప్పటికీ ఈ జబ్బు రావడానికి గల అసలు కారణాలు ఇంత వరకు కనుక్కోలేకపోయారు. అల్జీమర్స్‌ వ్యాధి మన జ్ఞాపకాలను, ఆలోచనలను, భాషను ప్రభావితం చేస్తుంది. ఈ జబ్బు మెల్ల మెల్లగా పెరుగుతుంది. జ్ఞాపకశక్తి క్షీణించడంతో మొదలయ్యి, ఎదుటి వ్యక్తితో సంభాషణలో పాల్గొన లేకపోవడం, పరిసరాలకు తగ్గట్టుగా స్పందించలేకపోవడం వంటివి జరుగుతాయి. వ్యక్తి యొక్క దైనందిక జీవితం కొనసాగటం చాలా కష్టం అయిపోతుంది.

ఈ ఏడాది థీమ్‌..

ప్రతి సంవత్సరం ప్రపంచ అల్జీమర్స్‌ డే కొన్ని ప్రత్యేక థీమ్‌లతో జరుపుతుంటారు. ప్రపంచ అల్జీమర్స్‌ దినోత్సవం 2023 థీమ్‌ ''ఎప్పుడూ చాలా తొందరా లేదు.. ఎప్పుడూ ఆలస్యమూ చేయొద్దు''. ఈ థీమ్‌ ప్రమాద కారకాలను గుర్తించడం, ప్రమాద తగ్గింపు చర్యలను అనుసరించడం లక్ష్యంగా పెట్టుకుంది. అల్జీమర్స్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలి.

3

ఎవరెవరికి.. కారణాలు..

అరవై ఐదేళ్లు పైబడిన వాళ్ళు.. వయసు మీద పడటమే అల్జీమర్స్‌కు ఒక పెద్ద ప్రమాదకారకం. అరవై ఐదేళ్లు దాటిన ప్రతీ ఐదు సంవత్సరాలకు అల్జీమర్స్‌ వచ్చే అవకాశం రెండింతలు ఎక్కువగా ఉంటుంది.
రక్తపోటు ఎక్కువగా ఉన్నవాళ్లు, షుగర్‌ వ్యాధి ఉన్నవారు ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పొగ తాగే వారికి, ఎక్కువ మోతదులో మందు తాగే వారికి కూడా అల్జీమర్స్‌ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీరందరికీ కూడా మెదడులో రక్త ప్రసరణ సక్రమంగా జరగదు. అందువల్ల వీరికి అల్జీమర్స్‌ వచ్చే అవకాశం ఉండొచ్చని భావిస్తున్నారు. మెదడుకి రక్తం సరఫరా సరిగ్గా జరగాలంటే గుండె బాగా పనిచేయాలి. అందుకని హృద్రోగులలో కూడా అల్జీమర్స్‌ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
శారీరక శ్రమ లేకుండా, వ్యాయామం చేయకుండా ఉండేవారు కూడా ఈ వ్యాధి బారిన పడతారు. ఒంటరిగా జీవించేవారు, డిప్రెషన్‌లో ఉన్న వారు కూడా అల్జీమర్స్‌తో బాధపడే అవకాశం ఉంటుంది. ఇంట్లో అమ్మా నాన్నలకు, అక్కాచెల్లెళ్లకు, అన్నాతమ్ముళ్లకు ఈ వ్యాధి వుంటే.. మనకి కూడా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ జన్యుపరమైన మార్పులు వచ్చి, అల్జీమర్స్‌ రావడం అనేది కేవలం పావు వంతు మందిలోనే చూస్తాము.
తక్కువ చదువుకున్నవాళ్ళు / అసలు చదువురాని వాళ్లకి కూడా అల్జీమర్స్‌ ఎక్కువగా వస్తుందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. బాగా చదువుకున్న వారికి నాడీకణాల మధ్యలో సంబంధాలు ఎక్కువగా ఏర్పడతాయని, అందువల్ల వాళ్ళకి అల్జీమర్స్‌ వచ్చినా లక్షణాలు కనబడే స్థాయిలో రాదని శాస్త్రజ్ఞులు అనుకుంటున్నారు. కొంత మంది తలకు తీవ్రమైన గాయాలు అయినా కూడా అల్జీమర్స్‌ వ్యాధి రావడానికి కారణం అవుతుంది
జ్ఞాపకశక్తి క్షీణించడం అల్జీమర్స్‌లో కనబడే మొట్టమొదటి లక్షణం. ఇంటికి లేదా ఆఫీసుకి దారి మరచిపోవడం, సరుకుల దుకాణాలకు దారి మరచిపోవడం లాంటివి మాములుగా వచ్చే వృద్ధాప్య సమస్యలు కావు. అవి జ్ఞాపకశక్తీ క్షీణించడం వల్ల వచ్చాయని గుర్తించాలి.

4

ఈ లక్షణాలుంటే.. వైద్యుల్ని సంప్రదించాలి..

  • రోజువారీ పనులను కూడా చేసుకోలేనంతగా మతి మరుపు.. ముఖ్యమైన కార్యక్రమాలను మరచిపోవడం, చిన్న చిన్న వాటికి అలారం లేదా నోట్‌ప్యాడ్‌ పెట్టుకోవాల్సి రావడం.
  • ప్రణాళిక వేయలేకపోవడం, చిన్న సమస్యలను పరిష్కరించలేకపోవడం.. బిల్లులను సమయానికి కట్టకపోవడం, బాగా వచ్చిన వంటకం ఎలా చేయాలో మరచిపోవడం. ఇదివరకు బాగా ఆడగలిగిన ఆట ఆడలేకపోవడం.
  •  బాగా తెల్సిన/ చేయగలిగిన పనులు చేయలేకపోవడం.. చేయడానికి ఇబ్బంది పడటం. వంట చేయలేకపోవడం. ఫోను ఎలా వాడాలో తెలియకపోవడం. సరుకులు తెచ్చుకోలేకపోవడం.
  •  పరిసరాలు అర్థంకాకుండా ఉండటం.. నిలకడగా ఒకచోట ఉండలేకపోవటం.. మాటి మాటికీ (చాలా ఎక్కువసార్లు) వస్తువులు జారవిడుస్తూ ఉండటం.
  •  వస్తువుల పేర్లు / పదాలు మరచిపోతూ ఉండటం.. చాలా కష్టంగా గుర్తు తెచ్చుకోవడం. ఉదా: గడియారం అనే పదం గుర్తు రాక, సమయం చూసుకునే వస్తువు అని అనడం.
  •  వస్తువులను అర్థం లేని చోట్లలో పెట్టడం.. తాళంచెవులు ఫ్రిడ్జ్‌లో పెట్టడం. వాచ్‌ని వాషింగ్‌మెషిన్‌పై పెట్టడం.. లాంటివి.
  • పరిస్థితులను సరిగా అంచనా వేయలేకపోవడం.. ఊరికే మోసపోవడం. తనని తాను శుభ్రంగా ఉంచుకోలేకపోవడం.
  •  ఇదివరకు ఇష్టంగా పాల్గొనే సామాజిక కార్యక్రమాల నుండి (గుడి, మసీదు, చర్చి, ఫంక్షన్‌లు, మీటింగులు, ఆటలు, తదితరాలు) వంటి వాటికి దూరంగా ఉండటం.
  •  చిన్న చిన్న విషయాలకు చిరాకు పడటం. భయపడటం. దగ్గరి వ్యక్తులపైన అనుమాన పడటం.
  • సమయం, తేదీలు సరిగ్గా అర్థం కాకుండా ఉండటం. ఎక్కడికైనా వెళ్ళాక, ఎందుకు వెళ్లారో గుర్తురాక తికమక పడటం.

పైన పేర్కొన్న లక్షణాలన్నీ కచ్చితంగా ప్రతి అల్జీమర్స్‌ వచ్చిన వ్యక్తిలో చూడము. కానీ వ్యాధి ముదురుతున్న కొద్దీ చాలా లక్షణాలు బయటపడొచ్చు.

6

వైద్యులు ఎలా గుర్తిస్తారు..

దీన్ని గుర్తించడానికి తేలికపాటి పరీక్షలేవీ ప్రస్తుతం అందుబాటులో లేవు. మొత్తం కుటుంబ ఆరోగ్యచరిత్ర, పూర్తి మానసిక, నాడీవ్యవస్థ యొక్క పనితీరు పరీక్ష. జ్ఞాపకశక్తి ఎంతుందో పరీక్ష చేయడం. రకరకాల రక్త పరీక్షలు (ఏ పోషకాహార లోపం వల్ల రావడం లేదు అని నిర్ధారించుకోవడానికి), మెదడు స్కానింగ్‌ - వీటన్నింటినీ ఉపయోగించి వైద్యులు ఒక నిర్ణయానికి వస్తారు. జ్ఞాపకశక్తి లోపాన్ని ముందుగానే కనుక్కోవడానికి రకరకాల టెస్టులు అందుబాటులో ఉన్నాయి. అందులో మినికాగ్‌ టెస్ట్‌ ఒకటి. ఈ టెస్టులో మనం పరిష్కరించాల్సిన సమస్యలు ఉంటాయి. అవి పరిష్కరించడానికి ఎంత సమయం పడుతుందనే దాన్నిబట్టి జ్ఞాపకశక్తి లోపం ఉందో, లేదో తెలుసుకోవచ్చు.
ఉదాహరణకు మన దేశ జనాభాకి తగ్గ ఒక జ్ఞాపకశక్తి పరీక్షలో కింది అంశాలు ఉన్నాయి. మొదట.. సంబంధం లేని ఒక మూడు పదాలను (ఏనుగు, కాగితం, బాటిల్‌ లాంటి పదాలు) చెబుతారు. వాటిని వెంటనే అప్పజెప్పాల్సి ఉంటుంది. రెండు.. ఒక్క నిమిషంలో ఎన్ని రకాల కూరగాయల పేర్లు చెప్పగలుగుతారో చూస్తారు. మూడు.. ఒక సమయం చెప్పి గడియారం ముల్లులను గీయమంటారు. చివరిగా మొదట చెప్పిన సంబంధం లేని పదాలను తిరిగి చెప్పమంటారు. ఇలా పైప్రశ్నలని ఎలా పరిష్కరిస్తున్నారు అనే దాన్నిబట్టి వారికి జ్ఞాపకశక్తి లోపం ఉందో లేదో చెప్పవచ్చు.
ఇప్పటివరకు అల్జీమర్స్‌ వ్యాధికి చికిత్స అనేది లేదు. కొన్ని రకాల మందులు వాడితే తాత్కాలిక ఉపశమనం లభించొచ్చు. ఈ వ్యాధి వచ్చిన వారికి మనం అందించగలిగే సహాయం వారికి సహాయకులుగా ఉండటమే. చిన్న చిన్న పనులు వాళ్ళకి వాళ్లే చేసుకునేలాగా ప్రోత్సహించడం. మిగతా వ్యాధులకు సరైన చికిత్స అందించడం వంటివి చేయాలి.

5

అరికట్టగలమా?

ఈ వ్యాధి గురించి ఇంకా మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంది. దీనిపైన జరుగుతున్న పరిశోధనల బట్టి, మంచి ఆరోగ్య అలవాట్లు ఉంటే జ్ఞాపకశక్తి లోపాలు రాకుండా ఉంటాయి అని తెలుస్తుంది. గుండె సంబంధిత జబ్బులను తగ్గించుకోవడానికి, షుగర్‌ వ్యాధిని తగ్గించుకోవడానికి మనం ఏ అలవాట్లు చేసుకుంటామో.. అవి అల్జీమర్స్‌ రాకుండా కూడా కాపాడతాయని అనుకోవచ్చు. రోజూ వ్యాయామం చేయడం, పొగ తాగకుండా ఉండటం, మద్యంసేవించకుండా ఉండటం, బీపీ, షుగర్‌ కంట్రోల్‌లో ఉంచుకోవడం, మిగితా వ్యాధులకు సరైన మందులు వాడటం.. ఇలాంటివి ఇతర దీర్ఘకాలిక సమస్యలతో పాటు అల్జీమర్స్‌ను కూడా నివారించడానికి చాలా ఉపయోగపడతాయి. తలకు దెబ్బలు తగలకుండా జాగ్రత్త పడటం, అంటే వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్లు, సీట్‌ బెల్టులు పెట్టుకోవడం వంటివి చేయాలి. ఆస్బెస్టాస్‌, సీసం, పాదరసం వంటి భారీ లోహాల వల్ల కూడా అల్జీమర్స్‌ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది.
ఆయుష్షు పెరగడం అనేది మనందరికీ ఎంత ముఖ్యమో, మానసికంగా ఆరోగ్యంగా ఉండటం కూడా అంతే ముఖ్యం. ప్రభుత్వాలు కూడా ప్రజలకు వృద్ధాప్యంలో వచ్చే మానసిక సమస్యలకు, జ్ఞాపకశక్తి సమస్యలకు సరైన ఆరోగ్యపరమైన చర్యలు తీసుకొని, రిహాబిలిటేషన్‌ సెంటర్లు నిర్వహించాలి.
అల్జీమర్స్‌ వ్యాధి వచ్చినవారు.. వారి కుటుంబసభ్యులపైన చాలా ఆధారపడే అవసరం వస్తుంది. కుటుంబసభ్యులకు అల్జీమర్స్‌ వ్యాధిగ్రస్తులను ఎలా చూసుకోవాలో అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది. వ్యాధిగ్రస్తులకు బట్టలు వేసుకోవడం దగ్గర నుండి, వాళ్ళ స్నానం, ఆహారం, మల, మూత్ర విసర్జనలో సహాయం చేయవలసి వస్తుంది. మందులు సరైన సమయానికి వేయడం, వారికి డబ్బులు ఉపయోగించుకోవడంలో సహాయ పడటం వంటివి చేయాలి. అల్జీమర్స్‌ వ్యాధి వచ్చిన వాళ్లకి సహాయం చేసే వారందరూ ఒక సపోర్ట్‌ గ్రూప్‌గా ఏర్పడితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

మానవ హక్కుల ఉల్లంఘన..

ఇతర మానసిక సమస్యలున్న వారిలాగే జ్ఞాపకశక్తి లోపాలున్న చాలా మంది వ్యక్తుల విషయంలో ప్రాథమిక హక్కులు ఉల్లంఘించబడతాయి. వారిని ఇళ్లల్లో, వద్ధాశ్రమాలలో, ఆసుపత్రుల్లో శారీరకంగా / మత్తు మందులు ఉపయోగించి, అరికట్టడం జరుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు కలిసి వీరికి సంబంధించిన చట్టాలు చేసుకొని, అమలు చేయాల్సిన అవసరం ఎంతో ఉంది.

dr pr

 

 

 

 

డాక్టర్‌ దేశం పి.ఆర్‌. ఎంబిబిఎస్‌, ఎండి, ప్రజారోగ్య నిపుణులు.