పిల్లలు చదవడం వినోదం కోసం, నేర్చుకోవడం కోసం అనుకుంటే ఇప్పుడు ఏది చేస్తున్నారనేది ప్రశ్న. ఒకనాటి బాల్యం గురించి కాక నేటి పిల్లలకు
ఏ బాలసాహిత్యం అందుబాటులో ఉంది? పెద్దలు రాసిన పిల్లల కథలు, పిల్లలు రాసిన పిల్లల కథలు నేడు ఉన్నాయి. కరోనా వల్ల పిల్లల్లో చదివే అలవాటు పెరిగిందనే చెప్పాలి. 'ఎగిరే గుర్రాలు, దేవకన్యలు, ఒంటి కన్ను రాక్షసుల' కథలతో బాటు 'మలాలా సాహసం, చంద్రయాన్, ఎవరెస్ట్ ట్రెక్కింగ్, ఈ తరం కుర్రాడు' లాంటి పుస్తకాలు నేటి పిల్లలు ఆసక్తిగా చదువుతున్నారు. చదివించడం తల్లితండ్రులు, టీచర్లదే బాధ్యత. వారానికి ఒక రోజు, ఒక గంట పిల్లలు సాహిత్య పఠనం చేయగలిగితే వారి దృక్పథంలో, భావ వ్యక్తీకరణలో, భాషా నైపుణ్యంలో గణనీయమైన మార్పు వస్తుంది. ఇది నేను అనుభవంతో చెబుతున్నాను. హింస, ఒత్తిడి, రకరకాల రీతిలో పిల్లలను మానసికంగా కుంగదీస్తున్న నేపథ్యంలో వారిని తేలిక పరిచే మాధ్యమం పుస్తకాలు చదవడమే! తరగతి గదిలోనూ, జీవితంలోనూ సమస్యలు సులువుగా పరిష్కరించుకోవాలన్నా, గ్రహణశక్తి పెరగాలన్నా,చక్కని మాట తీరు, రాసే పధ్ధతి రూపొందాలన్నా పిల్లలు చదవడంతోనే సాధ్యం. కథలు కష్టాలు ఎదుర్కొనడం నేర్పి, కన్నీరు తుడిచి సాంత్వన ఇస్తాయి. పిల్లల అక్షరాల ఊహలకు వేదిక కావాలి.
బాలల దినోత్సవం వేళ పిల్లల చేత పిల్లల కొరకు పిల్లల రచనలు అందించాలని.. 'ప్రజాశక్తి' చేస్తున్న ఈ ప్రయత్నంలో పాలు పంచుకున్న అందరికీ ధన్యవాదాలు. పిల్లలు తమ కలం బలం, కుంచె విసురు ఎంత విలువైనవో మనకు చూపుతున్నారు. శుభాకాంక్షలు చెబుదాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన పత్రిక వారికీ, ముఖ్యంగా శాంతికీ కృతజ్ఞతలు.
- ముంజులూరి కృష్ణకుమారి,
గెస్ట్ ఎడిటర్,
బాల సాహిత్యవేత్త,
ఆలిండియా రేడియో మాజీ డైరెక్టర్.