రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం మౌళికంగా చేపట్టాల్సిన విధానాలు, తక్షణం ప్రజలకు ఉపశమనం కలిగించే చర్యల కోసం సిపిఎం ప్రజా ప్రణాళిక రూపొందించింది. నిర్వాసితుల సమస్యలను పరిష్కరించి పోలవరం పూర్తి చేయడం, ప్రతి ఎకరాకు సాగునీరు ఇచ్చేందుకు ప్రణాళికలు, బడ్జెట్‌లో నిధుల కేటాయింపు, వ్యవసాయ పంపుసెట్లకు ఉచిత విద్యుత్ కొనసాగించడం, ప్రతి కౌలు రైతుకు గుర్తింపు కార్డుతో పాటు బ్యాంకు రుణం గ్యారంటీగా అమలు చేయడం, స్వామినాథన్, జయతీ ఘోష్, రాధాకృష్ణ కమిషన్‌ల సిఫార్సుల అమలు చేయడం ద్వారా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలి. భూమి లేని వ్యవసాయ కూలీలకు రెండు ఎకరాల భూమి, పరిశ్రమల పేరుతో సేకరించిన వేలాది ఎకరాల భూమి పడావుగా ఉంది. ఆ భూములను తిరిగి రైతులకు అప్పగించాలి. అటవీ సంరక్షణ చట్ట సవరణ రద్దు, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి.
ఒకనాటి రాష్ట్ర రాజకీయ రాజధాని విజయవాడ అరుణారుణం అవుతున్నది. ప్రజాశక్తికి ప్రతిరూపంగా అనేక సభలకు నిలయంగా భాసిల్లిన నాటి బెజవాడలో నేడు మరోసారి ప్రజాపోరు నగారా మోగనుంది. వేలాది శ్రమజీవులు స్వంత ఖర్చులతో, సద్దిమూటలతో, చంటిబిడ్డలతో ఎర్ర చొక్కాలు, ఎర్ర చీరలతో విజయవాడలో బారులు తీరనున్నారు. 'ఇంకెక్కడ కమ్యూనిస్టులు?' అన్న నోళ్ళు మూయించనున్నారు. ఆంధ్రదేశ రాజకీయ రాతలను మార్చిన నాటి పోరుగడ్డపై సిపిఎం ప్రజా రక్షణభేరి లాంగ్ మార్చ్ చేయనుంది. రాజకీయం అంటే ప్రజల జీవితాలను మార్చడమని, అసమానతలు లేని అభివృద్ధి సాధించడమని, కోట్లాది పీడిత, తాడిత జనావళి భవిష్యత్‌కు గ్యారంటీ ఇవ్వడమని చాటనుంది. అందుకు పరిష్కార మార్గం పోరాటమే అని గర్జించనుంది.
గాడి తప్పిన రాష్ట్ర రాజకీయం
రాష్ట్ర విభజన జరిగి సుమారు పది సంవత్సరాలు అవుతున్నది. ఈ కాలంలో రాష్ట్రంలోని రెండు ప్రధాన రాజకీయ పార్టీలు చెరో సగం కాలం పాలించాయి. నాడు విభజన భజన చేసి ప్రత్యేక హోదా, రాజధాని నిర్మా ణం అంటూ నాటకీయంగా కీర్తనలు ఆలపించిన నాటి బిజెపి ఈ కాలమంతటా దేశాన్ని పాలిస్తున్నది. ప్రపంచ రాజధాని, వరం లాంటి పోలవరం, పరుగు పందెంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి అంటూ రంకెలు వేసిన ఈ పాలకులంతా నాటి విభజనకు కారకులే. నేటికీ దిక్కుమొక్కు లేని రాజధాని, నిర్వాసితులకు శాపంగా మారిన పోలవరం, కేంద్ర గద్దలు మింగిన ప్రత్యేక హోదా, ఏడుకొండలు ఎక్కిన విభజన హామీల అమలు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి తీరని ఆటంకాలు. అందుకే రాష్ట్ర పునర్విభజన జరిగి దశాబ్దం గడచినా ప్రజానీకాన్ని వెంటాడుతున్న కరువులు, వలసలు, ఆత్మహత్యలు, నిరుద్యోగం, సామాజిక అణచివేతలు, ప్రాంతీయ అసమానతలు పెరిగాయే తప్ప తరగలేదు.
రాష్ట్రానికి ద్రోహం చేసిన కేంద్రానికి రాష్ట్ర పాలక పార్టీలు దాసోహం అంటూ మరింత వెనుకబాటుకు కారణం అవుతున్నాయి. చట్ట ప్రకారం సాధించాల్సిన వాటిని చుట్టరికంతో తాకట్టు పెడుతున్నాయి. అన్ని బొమ్మలను ఒకడే ఆడించే తోలుబొమ్మలాట లాగా రాష్ట్రంలోని అన్ని పాలక పార్టీలను కేంద్ర బిజెపి ఆడిస్తున్నది. రాజధర్మం ప్రకారం చేయాల్సిన పనులు, ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకపోగా కృష్ణాజలాల పున:పంపిణీ లాంటి సున్నిత అంశాలను తిరగదోడి దశాబ్దం క్రితం నాటి ప్రాంతీయ గాయాలను మరల రగిలించేందుకు ప్రయత్నిస్తున్నది. ఈ పది సంవత్సరాల కాలంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న బిజెపి నేడు హఠాత్తుగా అవినీతి, ఇసుక, మద్యం గురించి మాట్లాడుతున్నది. దొంగే దొంగ దొంగ అంటే ఏమో అనుకున్నాం. ఇదేనన్నమాట !
ఇక మన రాష్ట్రంలోని వైసిపి, టిడిపిల పరిస్థితి ఆంధ్ర రాష్ట్ర రాజకీయ చరిత్రకే మచ్చ తెచ్చాయి. ఢిల్లీ పెత్తనాన్ని ప్రశ్నించి తెలుగు ఆత్మగౌరవాన్ని చాటి ప్రజాదరణ పొందిన నాయకుల వారసులుగా చెప్పుకునే వైసిపి, టిడిపిలు తమ స్వార్థ రాజకీయాల కోసం ఢిల్లీలో తమ రాజకీయ విధానాన్ని పదేపదే తాకట్టు పెట్టుకుంటున్నాయి. మతోన్మాదం గురించి భీకరంగా మాట్లాడిన వారే నేడు ఆ ఉన్మాదుల దర్శనభాగ్యం దొరకడంతో తన్మయత్వం చెందుతున్నారు. నా ఎస్.సిలు, నా మైనారిటీలు అని రాగాలాపన చేస్తున్న వారు ఆ ఎస్.సి లను, ఆ మైనారిటీలను అణచివేస్తున్న ఉన్మాదుల పక్షాన నిలబడి చిద్విలాసం చేస్తున్నారు. ప్రజలపై వేసే భారాలను, ప్రజల ఐక్యతను విచ్ఛిన్నం చేసే వినాశకర విధానాలను పోటీలు పడి పార్లమెంట్‌లో ఆమోదిస్తున్నారు. ప్రశ్నిస్తానంటూ వచ్చిన పవన్ గాలికంటే వేగంగా విధానాలను మార్చుకుంటూ నిలకడలేని నేతగా మిగిలిపోయారు. పురాణాల్లోని ధృతరాష్ట్ర కౌగిలి ఏమిటోగాని...నేడు కేంద్ర నేతల ఆలింగనం ప్రాంతీయ పార్టీల అంతానికి ఆరంభం అన్నది వర్తమాన సత్యం.
కపటపు విధానాల నుండి ప్రజల దృష్టి మళ్లించేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ శక్తి మేరకు ఆంధ్ర రాజకీయాలను కుల రాజకీయాలుగా, విద్వేష రాజకీయాలుగా మారుస్తున్నారు. ప్రజల సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి చోటే లేని అసభ్య విమర్శలు, అనాగరిక ప్రవర్తనలు, బూతు పురాణాలకు తెగబడుతున్నారు. రాజకీయమంటే ప్రజల జీవితాలను మార్చడం, నిజాయితీగా ప్రజలకు సేవలు అందించి నిన్నటి కంటే నేడు, నేటి కంటే రేపు మెరుగు చేయడమనే అర్థం మారిపోయింది. నిన్నటి కంటే నేడు, నేటి కంటే రేపు మరింతగా దోచుకోవడం, దాచుకోవడం, ప్రజలను చీల్చడం, స్వార్థం కోసం రాష్ట్రాన్ని బలిపెట్టడం నేటి రాజకీయంగా మారింది. అందుకే ఆంధ్ర రాష్ట్రం అధోగతికి చేరుకున్నది. దీన్ని మార్చాలి. వ్యక్తిగత విమర్శల చుట్టూ, పదవుల పందేరాల చుట్టూ కాదు చర్చలు జరగాల్సింది. విధానాల గురించి చర్చ జరగాలి. ప్రత్యామ్నాయ విధానాల కోసం పోరాటాలు సాగాలి. ఆ పోరాటాలే ప్రజల జీవితాలను మార్చాలి. అందుకే సిపిఎం అసమానతలు లేని అభివృద్ధి కోసం ప్రజా రక్షణభేరి చేపట్టి తన రాజకీయ విశిష్టతను చాటింది. నెలన్నర రోజులుగా రాష్ట్రం నలుచెరుగుల లక్షలాది జనాన్ని కలిసింది, ప్రజా ప్రణాళిక గురించి విస్తృతంగా వివరించింది. పోరుకు కదిలి రమ్మని పిలుపునిచ్చింది.
విధానాల మార్పు కోసం సిపిఎం
రాష్ట్ర రాజకీయాలు ఎన్నికల చుట్టూ తిరుగుతున్నాయి. జైలయినా, బెయిలైనా, పాద యాత్రైనా, బస్సు యాత్రైనా ఎన్నికల కోసమే. మాట్లాడినా, మాట్లాడకున్నా ఎన్నికల కోసమే. ఎన్నికలే సర్వస్వం. మరోసారి ప్రజలను దగా చేసి అధికారాన్ని కబ్జా చేయడం కోసం పోటాపోటీలు, సినిమా డైలాగులు, ప్రచార హోర్డింగ్‌లు. ఈ పోరులో నలిగేది, కుమిలేది పేదలే. అందుకే ఆ పేదల, కష్టజీవుల బతుకుల గురించి, ఆంధ్ర రాష్ట్రాభివృద్ధి గురించి సిపిఎం పోరాడుతోంది. భూ సేకరణ అక్రమాలపై, సెజ్‌ల అరాచాకలపై, కార్మిక, కర్షక సమస్యలపై నిరంతర ఉద్యమాలు నిర్వహిస్తున్నది. ప్రజాసమస్యల చుట్టూ రాజకీయ చర్చ జరగాలి, ప్రజా సమస్యలపై అన్ని రాజకీయ పార్టీలు మాట్లాడేటట్లు చేయాలి. అందరూ నడిచే దారిలో నడవడానికి ఏ కష్టం అక్కరలేదు. సరైన మార్గం వైపు నడవాలంటే స్పష్టమైన విధానాలు, అంతకు మించిన సైద్ధాంతిక పటుత్వం ఉండాలి. అ బాధ్యతను సిపిఎం తీసుకుంది. అందుకోసం ప్రజామార్గం ఎన్నుకుంది.
ఇటీవల పోలవరం నిర్వాసితుల సమస్యపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వేలాది గిరిజనులు విజయవాడ వరకు పాదయాత్ర నిర్వహించారు. కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, అనంతపురం, కృష్ణా మొదలగు అనేక జిల్లాల్లో జిల్లా సమగ్రాభివృద్ధి కోసం నిర్దిష్ట ప్రత్యామ్నాయాలతో పాదయాత్రలు, స్కూటర్ యాత్రలు చేపట్టి లక్షలాది ప్రజానీకాన్ని సిపిఎం శ్రేణులు కలిశాయి. రాష్ట్రవ్యాప్త సమస్యలపై ఒక్కో జిల్లాల్లో ఒక్కో అంశంపై 19 జిల్లాలో రాష్ట్ర సదస్సులు నిర్వహించాయి. ఇందులో వామపక్ష పార్టీలు, మేధావులు, వివిధ రంగాల నిపుణులు పాల్గొని ఆ యా అంశాలపై చర్చించి ప్రతిపాదనలు రూపొందించారు. అక్టోబర్ 7,8 తేదీలలో విజయవాడలో రాష్ట్ర స్థాయి సెమినార్ నిర్వహించి ప్రజాప్రణాళికకు తుది రూపం ఇచ్చింది. అక్టోబర్ 30 నుండి రాష్ట్రంలో మూడు ప్రాంతాల నుండి బస్సుయాత్రలు బయలుదేరాయి. రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న ద్రోహాన్ని, రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీల అవకాశవాద వైఖరులను వివరిస్తూ రాష్ట్ర నలుమూలల జరిగిన వందలాది సభల్లో జాతీయ, రాష్ట్ర నాయకులు ప్రజలకు వివరించారు.
సిపిఎం ప్రజా ప్రణాళిక
రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం మౌళికంగా చేపట్టాల్సిన విధానాలు, తక్షణం ప్రజలకు ఉపశమనం కలిగించే చర్యల కోసం సిపిఎం ప్రజా ప్రణాళిక రూపొందించింది. నిర్వాసితుల సమస్యలను పరిష్కరించి పోలవరం పూర్తి చేయడం, ప్రతి ఎకరాకు సాగునీరు ఇచ్చేందుకు ప్రణాళికలు, బడ్జెట్‌లో నిధుల కేటాయింపు, వ్యవసాయ పంపుసెట్లకు ఉచిత విద్యుత్ కొనసాగించడం, ప్రతి కౌలు రైతుకు గుర్తింపు కార్డుతో పాటు బ్యాంకు రుణం గ్యారంటీగా అమలు చేయడం, స్వామినాథన్, జయతీ ఘోష్, రాధాకృష్ణ కమిషన్‌ల సిఫార్సుల అమలు చేయడం ద్వారా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలి. భూమి లేని వ్యవసాయ కూలీలకు రెండు ఎకరాల భూమి, పరిశ్రమల పేరుతో సేకరించిన వేలాది ఎకరాల భూమి పడావుగా ఉంది. ఆ భూములను తిరిగి రైతులకు అప్పగించాలి. అటవీ సంరక్షణ చట్ట సవరణ రద్దు, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి.
విశాఖ ఉక్కు పరిశ్రమను రక్షించడం, కడప ఉక్కు పరిశ్రమను స్థాపించడం, అమరావతిలోనే రాజధాని నిర్మాణం పూర్తి చేయడం, ఐ.టి, ఫార్మా, టైక్స్‌టైల్స్, జూట్, పేపర్, అగ్రి, సినీ పరిశ్రమల అభివృద్ధికి నిర్దిష్ట కాలపరిమితితో చర్యలు చేపట్టాలి. స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు కల్పించాలి. చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించి ఉపాధి అవకాశాలు కల్పించాలి. ప్రభుత్వ రంగాన్ని బలోపేతం చేయాలి. సహకార వ్యవస్థను పటిష్టం చేయాలి. మెగా మాల్స్‌పై ఆంక్షలు విధించి చిన్న వ్యాపారులను రక్షించడం, అసంఘటిత రంగ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇచ్చి, కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజేషన్ చేయాలి. స్కీం వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. ఓపిఎస్ పునరుద్ధరణ చేయాలి. 40 వేల టీచర్ల పోస్టులను, ఖాళీగా ఉన్న 2 లక్షల 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలి. నిరుద్యోగులకు నెలకు రూ.5 వేలు భృతి ఇవ్వాలి. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు, కులగణన, ఎస్.సి. ఎస్.టి, మైనారిటీ సబ్‌ప్లాన్ అమలుకు జనాభా ప్రాతిపదికన నిధుల కేటాయింపు చేయాలి. వృత్తుల రక్షణకు చర్యలు చేపట్టాలి. బి.సిల అభివృద్ధికి సబ్‌ప్లాన్ అమలు చేయాలి.
వెనుకబడిన ప్రాంతాలకు నిర్దిష్ట కాల పరిమితితో లక్ష కోట్లతో ప్రత్యేక ప్యాకేజి, అభివృద్ధి చర్యలు చేపట్టాలి. ప్రభుత్వ రంగంలో విద్య, వైద్యం అందించి, కార్పొరేట్ వ్యాపారాన్ని అరికట్టాలి. వైద్య రంగంలో సుజాతారావు కమిటీ సిఫార్సులు అమలు చేయాలి. కరెంట్ యూనిట్ రూపాయికే ఇవ్వాలి. పేదలకు 300 యూనిట్ల వరకు ఉచితంగా ఇవ్వాలి. స్మార్ట్‌మీటర్లు, ట్రూఅప్ చార్జీలు రద్దు చేయాలి. పవన, సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో కార్పొరేట్ కంపెనీలను నియంత్రించాలి. రూ.400 కు గ్యాస్, రూ. 60 కు లీటర్ పెట్రోల్, డీజల్ ఇవ్వాలి. ప్రతి మనిషికి నెలకు 10 కేజీల బియ్యాన్ని ఉచితంగా ఇవ్వాలి. నిత్యావసర సరుకులను ప్రజాపంపిణీ ద్వారా అందచేయాలి. 2 సెంట్ల ఇళ్ళు, రూ. 5 లక్షల ఆర్థిక సాయం చేయాలి. అన్ని రకాల పెన్షన్లు రూ. 5 వేలు ఇవ్వాలి. ఈ ప్రజా ప్రణాళిక అమలుకు నవంబర్ 15న (బుధవారం) విజయవాడలో జరుగుతున్న ప్రజారక్షణ భేరి సభ మూలమలుపుగా నిలిచితీరుతుంది.
/ వ్యాసకర్త సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు /
వి. రాంభూపాల్