ప్రకృతిలో లభించే వాటిల్లో మధురమైనది కొబ్బరికాయ. కొబ్బరి నీళ్లు శరీరంలో వేడిని తగ్గించి, వ్యాధి నిరోధకశక్తిని పెంచుతాయి. అలాగే పచ్చికొబ్బరిలో అధిక మొత్తంలో యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలో నీటిశాతం తగ్గిపోకుండా కాపాడుతుంది. దీనిలో విటమిన్ ఎ,బి,సి, థయామిన్, రైబోప్లెవిన్, నియాసిన్, క్యాల్షియం, కార్బోహైడ్రేట్లు, ఐరన్ పుష్కలంగా లభిస్తాయి. తరుచుగా కొబ్బరిని ఆహారంలో తీసుకునేవారికి మలబద్దకం, థైరాయిడ్ సమస్యలు రావు. అయితే కొబ్బరితో ఎక్కువగా పచ్చడి, కొబ్బరి అన్నం, కొబ్బరి లౌజు, ఉండలు చేసుకోవటం తెలుసు. వాటితోపాటు మరిన్ని రకాల స్వీట్లు చేసుకోవచ్చు. అవి ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం..
జెల్లీ..
కావల్సినవి : కొబ్బరికాయలు - రెండు, చక్కెర- ఒకటిన్నర టేబుల్ స్పూను, అగర్ అగర్ పౌడర్ - టేబుల్ స్పూను, కప్స్- ఆరు.
తయారీ : కొబ్బరికాయలు పగలకొట్టి నీళ్లు తీసుకోవాలి. నలకలు, కొబ్బరి పలుకలు లేకుండా మరొక గిన్నెలోకి వడకట్టుకోవాలి. దాన్ని పొయ్యి మీద పెట్టి, చిన్న మంట మీద ఉంచాలి. తర్వాత చక్కెర వేసి కలపాలి. చక్కెర కరిగాక అగర్ అగర్ పౌడర్ వేసి తిప్పాలి. ఒక పొంగు వచ్చే వరకూ ఉంచి, దించి పక్కన బెట్టాలి. లేత పచ్చికొబ్బరికి వెనుక ఉండే పెళుసుభాగాన్ని తీసి, తెల్లగా ఉన్న కొబ్బరిని సన్నగా, పొడవుగా పలుకులుగా కట్ చేసుకోవాలి. దీన్ని అన్ని కప్పుల్లో కొంచెం కొంచెంగా వేసుకోవాలి. చల్లారిన కొబ్బరినీళ్ల మిశ్రమాన్ని అన్ని కప్పుల్లో పోసుకోవాలి. స్పూనుతో ఒకసారి కలపాలి. దాంతో అడుగున ఉన్న కొబ్బరి పలుకులు పైకి వస్తాయి. కప్పులన్నీ ఫ్రీజ్‌లో 15 నిమిషాలు పాటు ఉంచాలి. తర్వాత బయటకు తీయాలి. అంతే కొబ్బరి జెల్లీ రెడీ. ఇటీవల చాలా ఫంక్షన్స్‌లో పసందైన స్వీటు ఇది.
జున్ను..
కావల్సినవి : కొబ్బరికాయ-1, నీళ్లు- మూడు కప్పులు, బెల్లం- ముప్పావు కప్పు, బియ్యం పిండి- అరకప్పు, యాలకులు- మూడు.
తయారీ : చిప్పల్లో ఉన్న కొబ్బరిని తీయాలి. కొబ్బరి వెనుక బ్రౌన్‌కలర్‌లో ఉన్న పెళుసు భాగాన్ని తొలగించాలి. కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కోసి, మిక్సీజార్‌లో వేయాలి. కప్పు నీళ్లు పోసి, గ్రైండ్ చేయాలి. యాలకులు వేసి, మరొక కప్పు నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఒక గిన్నెపై మెత్తటి క్లాత్ వేసి, మిశ్రమాన్ని వడకట్టుకోవాలి. కొబ్బరిపాలు గిన్నెలోకి వస్తాయి. క్లాత్‌లో కొబ్బరిపొడి మిగులుతుంది. దీన్ని మరోసారి మిక్సీలో వేసి, కప్పు నీళ్లు పోసి గ్రైండ్ చేయాలి. దీన్నీ వడకట్టుకోవాలి. మిగిలిన కొబ్బరిపొడిని పారయకుండా కూరల్లో వాడుకోవచ్చు.
వచ్చిన కొబ్బరిపాలను మందపాటి గిన్నెలోకి తీసుకొని, పొయ్యి మీద పెట్టి. మరగనివ్వాలి. తర్వాత బెల్లం వేసి, కలపాలి. బియ్యంపిండిలో కొద్దిగా కొబ్బరిపాలు పోసి, కలపాలి. ఈ మిశ్రమాన్ని పొయ్యి మీద ఉన్న పాకంలో పోయాలి. ఈ మిశ్రమం చిక్కబడేంత వరకూ కలుపుతూ ఉండాలి. సుమారు అరగంట పడుతుంది. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని, రెండు గంటల పాటు ఆరనివ్వాలి. అంతే స్పాంజిలాంటి కొబ్బరి జున్ను రెడీ.
బర్ఫీ..
కావల్సినవి : కొబ్బరికాయ - పెద్దది ఒకటి, పాలు- అరలీటరు, పంచదార- ఒకటిన్నర కప్పు, నెయ్యి- నాలుగు టేబుల్‌స్పూన్లు,
తయారీ : చిప్పల్లో ఉన్న కొబ్బరిని తీయాలి. కొబ్బరి వెనుక బ్రౌన్‌కలర్‌లో ఉన్న పెళుసు భాగాన్ని తీసేయాలి. కొబ్బరిని చిన్నచిన్న ముక్కలుగా కోసి, మిక్సీజార్‌లో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. మందపాటి గిన్నె పొయ్యి మీద పెట్టి, పాలు పోయాలి. చిన్న మంట మీద వేడి చేసుకోవాలి. అందులో పంచదార వేసి కలపాలి. కరిగాక, కొబ్బరి మిశ్రమాన్ని వేసి కలపాలి. కొద్దిగా దగ్గరపడ్డాక, నెయ్యి వేసి, కలపాలి. పొంగుతున్నప్పుడు మంట తగ్గించుకుంటూ, పెంచుకుంటూ మిశ్రమాన్ని కలుపుతూ ఉండాలి. గిన్నె అడుగంటకుండా జాగ్రత్తగా కలుపుతూనే ఉండాలి. మూత పెట్టకూడదు. సుమారు ముప్పావు గంట తర్వాత మిశ్రమం మరింత దగ్గరపడుతుంది. దాన్ని నెయ్యి రాసిన ఒకప్లేట్‌లోకి తీసుకొని, సమాంతరంగా సర్దాలి. గంట చల్లారినివ్వాలి. అంతే మెత్తని పాలకోవాలాంటి కొబ్బరిబర్ఫీ రెడీ.