Nov 11,2023 10:13

తోటి పిల్లలు చిరిగిన బట్టలు ఎందుకు ధరిస్తున్నారో, అమ్మానాన్నకు దూరంగా ఊరి చివర ఏర్పాటుచేసిన ప్రత్యేక ఇంటిలో ఎందుకు ఉంటున్నారో అర్థం చేసుకోలేని ఓ పిల్లవాడు పెరిగి పెద్దై ఆ పిల్లల బాగు కోసం పరితపిస్తున్నాడు. అతడేమీ ధనవంతుడు కాదు, కానీ సాయం చేయాలన్న మనసు బలంగా ఉన్నవాడు. అందుకే వెల్డింగ్‌ పనులు చేసుకుంటూ పొట్టపోసుకున్న అతను అనాథపిల్లలకు సాయం చేయాలని పార్ట్‌ టైం జాబ్‌గా మరుగుదొడ్లు కడిగాడు. ఈ పని చేస్తున్నందుకు, కుటుంబం ఉన్నా, వెల్డర్‌ పని చేస్తున్నా 25 ఏళ్లు ఒంటరి జీవితం గడిపాడు. అంతలా వివక్ష ఎదుర్కొన్నా సాయం చేయడం మాత్రం ఆపలేదు. ఆ పెద్దాయన తమిళనాడు వెళ్లూరుకు చెందిన లోకనాథం.

లోకనాథానికి పదేళ్ల వయసున్నప్పుడు కోయంబత్తూరు పొదనూర్‌ రైల్వే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తండ్రిని చూసేందుకు రోజూ నంజుందపురం నుండి ప్రయాణం చేసేవాడు. దారిలో అతనికి ఒక అనాథాశ్రయం కనిపించింది. అక్కడ పిల్లలు చిరిగిన దుస్తులతో ఉన్నారు. వాళ్లు అక్కడ ఎందుకున్నారో.. అలా ఎందుకున్నారో అతనికి అర్థమయ్యేది కాదు. అర్థంకాని వయసులో మొదలైన ఆ ప్రశ్న మాత్రం అతన్ని జీవితకాలం వెంటాడింది. అనారోగ్యంతో తండ్రి మరణించాక లోకనాథం 5వ తరగతితో చదువు ఆపేశాడు. కూలీ పనులు చేసుకునే అమ్మకు సాయంగా కొబ్బరిబొండాలు అమ్మాడు.
          'అమ్మకు సాయంగా కలెక్టరేట్‌ దగ్గర కొబ్బరినీళ్లు అమ్ముతున్నా ఆ చిరిగిన బట్టలు వేసుకున్న పిల్లలే కళ్లల్లో మెదిలేవారు. వారంతా నా తోటివారే. అదే నన్ను బాగా కలచివేసింది. వాళ్లకు ఎలాగైనా సాయం చేయాలని ముందు వాళ్ల కోసం బట్టలు సేకరించాలని అనుకున్నాను. ఇంటింటికీ తిరిగాను. దాతలు ఇచ్చిన బట్టలను స్వయంగా ఉతికి, చిరిగితే కుట్టి ఆ పిల్లలకు ఇచ్చేవాడిని. వారంతా అమ్మానాన్న లేని అనాథలని నిదానంగా తెలిసింది. అప్పటినుండి వారిపై మరింత ప్రేమ పెరిగింది. నాకు 18 ఏళ్లు వచ్చేసరికి వెల్డర్‌ పనివాడిగా స్థిరపడ్డాను. రోజుకు రూ.13.50 వచ్చేది. కంపెనీ వాళ్లు ఇచ్చిన రెండు జతల యూనిఫామ్‌లో ఒకదాన్ని ఆ అనాథాశ్రమానికి ఇచ్చేశాను. ఆ వయసులో కూడా ఆ పిల్లల కోసం ఇంటింటికీ వెళ్లి ఆహారం సేకరించేవాడ్ని. జనాలు నన్ను యాచకుడిగా చూసేవారు. అయినా సిగ్గుపడలేదు' అని తన సేవా ప్రస్థానం మొదలైన రోజులను గుర్తుచేసుకున్నాడు లోకనాథం.
           పెళ్లి, పిల్లలతో కుటుంబం పెరిగినా తన సేవను మాత్రం ఆపలేదు. వెల్డింగ్‌ పనిలో వచ్చే డబ్బులు చాలక సాయంత్రాలు ప్రైవేటు సంస్థల్లో మరుగుదొడ్లు కడిగే పనిని చేశాడు. ఆ ఆదాయంతోనే అనాథ పిల్లలకు అవసరమైన పుస్తకాలు, బ్యాగులు, ఆహారం వంటివి సరఫరా చేసేవాడు. ఏడాదికి ఒకసారి కలెక్టర్‌ ద్వారా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే అనాథాశ్రమాలకు రూ.10 వేల సొమ్ము విరాళంగా ఇస్తున్నాడు.
           'మరుగుదొడ్లు కడుగుతున్నానని కంపెనీలో, ఇంట్లో అందరూ నన్ను దూరం పెట్టారు. నాతో కలసి భోజనం చేసేవారు కాదు. మాట్లాడేవారు కాదు. అలా 25 ఏళ్లు గడిపేశాను. ఆ పని చేస్తున్నందుకు నేను సిగ్గుపడలేదు. పైగా ఆ పని వల్ల వచ్చిన ఆదాయంతో పేదపిల్లలను చదివిస్తున్నాను. అలా చదువుకున్న పిల్లలు స్కూలు విద్య పూర్తయి, ఇప్పుడు కాలేజీలకు వెళుతున్నారు' అంటున్న లోకనాథం 1998 నుండి ఇప్పటివరకు 1500 అనాథపిల్లల విద్య కోసం సాయం చేశాడు. అతని నిస్వార్థ సేవకు గుర్తింపుగా 49 అవార్డులు దక్కాయి. గత నెల 15వ తేదీన కేరళ రోటరీ క్లబ్‌ రియల్‌ హీరో కార్యక్రమంలో అతన్ని గౌరవంగా సత్కరించి రూ.50 వేల నగదు బహుమతి అందించారు. ఆ మొత్తం కూడా అతను పేద పిల్లల విద్య కోసం ఇచ్చేశాడు.
           'నా గురించి తెలిసిన ఓ వీధి వ్యాపారి తన ప్రాంతంలో అనాథ పిల్లలకు ఆహారం సేకరించి ఇస్తున్నానని చెప్పాడు. అప్పుడు నాకు చాలా సంతోషమేసింది. నేను కోరుకున్నది కూడా ఇదే. నా తరువాత నా పిల్లలు ఈ సేవా కార్యక్రమం కొనసాగిస్తారని అనుకున్నాను. అంతకంటే ముందే తోటివారు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. మొదట్లో అభ్యంతరం పెట్టిన వాళ్లంతా ఇప్పుడు నా పనిని గౌరవిస్తున్నారు. నాతో పాటు ప్రయాణిస్తున్నారు' అంటున్న లోకనాథం నిస్వార్థ సేవకు మరో రూపం.