న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై అసత్య, తప్పుడు వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా, ఆప్ నాయకులు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మంగళవారం ఎన్నికల కమిషన్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ప్రధానమంత్రిపై చేసిన ఆరోపణలపై గురువారం రాత్రి 8 గంటలలోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఇటీవల మధ్యప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో ప్రియాంక గాంధీ మోడీపై తప్పుడు ఆరోపణలు చేశారని బిజెపి నాయకులు ఫిర్యాదు చేశారు. అలాగే సోషల్ మీడియాను వేదికగా చేసుకుని మోడీకి వ్యతిరేకంగా ఆమోదయోగ్యం కానీ, అనైతిక వీడియో క్లిప్‌లతో ఆప్ ప్రచారం చేస్తుందని బిజెపి నాయకులు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. 'సోషల్ మీడియాలో చేసిన ఆరోపణలు, వ్యాఖ్యలుపై వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. అలాగే, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంగించినందుకు ఎందుకు తగిన చర్యలు తీసుకోకూడదో సమాధానం ఇవ్వవల్సిందిగా కోరుతున్నాం' అని ఆప్‌కు జారీ చేసిన షోకాజ్ నోటీసుల్లో ఇసి పేర్కొంది.
150 స్థానాలు గెలుస్తాం : మధ్యప్రదేశ్‌పై రాహుల్ విశ్వాసం
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 150 స్థానాల వరకూ విజయం సాధిస్తామని కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. ఐదేళ్ల క్రితం ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బిజెపి కూల్చివేసిందని ఆరోపించారు. రాష్ట్ర రాజధాని భోపాల్‌కు 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న విదిషాలో మంగళవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడారు. 'కాంగ్రెస్‌కు అనుకూలంగా తుపాను రాబోతోంది. 145 నుంచి 150 స్థానాలను కాంగ్రెస్ గెలుచుకోనుంది. ఐదేళ్ల క్రితం మీరు (మధ్యప్రదేశ్ ప్రజలు) కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. బిజెపి నాయకులు మోడీ, అమిత్ షా, శివరాజ్ సింగ్ చౌహాన్లు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి మీ ప్రభుత్వాన్ని కూల్చివేశారు' అని రాహుల్ తెలిపారు. సుమారు 15 నెలల పాటు అధికారంలో ఉన్న కమల్‌నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 27 లక్షల మంది రైతులకు వ్యవసాయ రుణాలను మాఫీ చేసిందని రాహుల్ గుర్తు చేశారు. కమల్‌నాథ్ ప్రభుత్వాన్ని పడగొట్టడం ద్వారా కార్మికులు, రైతులు, చిరు వ్యాపారులు, నిరుద్యోగులను బిజెపి మోసం చేసిందని రాహుల్ విమర్శించారు. మధ్యప్రదేశ్‌లో ఈ నెల 17న ఎన్నికలు జరగనున్నాయి.