Aug 13,2023 15:53

ఆ రోజు ఆగస్టు 15 వ తేదీ. అది రామాపురంలోని మండల ప్రజా పరిషత్‌ ప్రాథమిక పాఠశాల ప్రాంగణం. అక్కడ ఒకటి నుండి ఐదు తరగతుల వరకూ సుధీర్‌ ఒక్కరే టీచర్‌. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బడి అంతా పండుగ వాతావరణం నెలకొని ఉంది. పిల్లలంతా ఎంతో అందంగా అలంకరించిన తమ తరగతి గదులను చూసి, ఉత్సాహంతో కేరింతలు కొడుతున్నారు. అప్పుడే సుధీర్‌ జెండా కడుతూ, స్కూల్‌ లీడర్‌ సుభాష్‌ను పిలిచారు. 'సార్‌! జెండా మధ్యలో వేయడానికి మీరు తీసుకురమ్మన్న పూలన్నీ తెచ్చేసాం' అంటూ గులాబీ, చామంతి, బంతి వంటి పూలన్నింటినీ సుధీర్‌ ముందుంచాడు సుభాష్‌.
వాటిని చూస్తూ, 'శభాష్‌ సుభాష్‌' అంటూ పూలను జెండా మధ్యలో ఉంచారు. పిల్లలందరూ జెండా కడుతున్న విధానాన్ని పరిశీలిస్తున్నారు.
'సార్‌, జెండాలోని మూడు రంగుల్లో కాషాయం రంగు పైన ఉంటుంది. అంతే కదా!' సుభాష్‌ అన్నాడు.
'త్యాగానికి గుర్తు అయిన కాషాయం పైన ఉంటుంది. శాంతికి చిహ్నంగా తెలుపు రంగు మధ్యలో ఉంటుంది. పాడి పంటలకు ప్రతీక అయిన ఆకుపచ్చ రంగు కింద ఉంటుంది. న్యాయానికి గుర్తుగా నడుమ ధర్మ చక్రం ఉంటుంది' వివరించి, 'మీకు జెండా గురించి, వాటి నియమాల గురించి చెప్పాను కదా' సుధీర్‌ చిన్నగా నవ్వుతూ అన్నాడు.
'జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య గారని, జెండా పొడవు, వెడల్పుల నిష్పత్తి మూడు ఈష్టు రెండు అని కూడా చెప్పారు. రాజు ఆకుపచ్చ రంగు జెండాకు పైన ఉంటుందేమోనని నాతో అంటే కాదని చెబుతూ మిమ్మల్ని అడిగాను సార్‌' సుభాష్‌ సమాధానం ఇచ్చాడు.
'సరే' అంటూ కట్టిన జెండాను బడి ముందు గల వాకిట్లో జాగ్రత్తగా నిలబెట్టారు సుధీర్‌.
'పిల్లలూ, జెండా ఎగుర వేయడానికి మన సర్పంచ్‌ భూషణంగారు వచ్చే సమయం అయింది.
మీరంతా మీకూడా తెచ్చుకున్న ఆ చిన్ని, చిన్ని జెండాలను పట్టుకుని, ఎగుర వేయబోయే జెండాకు అటూ, ఇటూ వరుస క్రమంలో నిలబడండి!' సుధీర్‌ చెప్పడంతో పిల్లలందరినీ ఒక వరుస క్రమంలో నిలబెట్టాడు సుభాష్‌.
పిల్లలంతా తెచ్చుకున్న జెండాలను చూస్తూ హుషారుగా ఉన్నారు. అప్పుడే ఒకరి చేతిలో ఉన్న జెండా జారి, కింద పడింది. అది గమనించిన సుభాష్‌ ఆ జెండాను తీసి పిల్లాడికి ఇస్తూ, జెండాను గౌరవిస్తే మన బాధ్యతను గుర్తించినట్టే. గాంధీ, నెహ్రూ, సర్దార్‌ వల్లభారుపటేల్‌, అల్లూరి సీతారామరాజు వంటి ఎందరో వీరుల త్యాగఫలం. మన నేటి స్వేచ్ఛకే మూల ధనం. అందుకు స్వేచ్ఛగా ఎగిరే జెండానే నిదర్శనం.
'దేశం మనదే.. తేజం మనదే.. ఎగురుతున్న జెండా మనదే..! అంత గొప్ప జెండాను కింద పడనీయకూడదు. అర్థమైందా?' అంటూ సుభాష్‌ చెప్పిన మాటలన్నీ పిల్లలంతా ఎంతో శ్రద్ధగా విన్నారు.
'శభాష్‌ సుభాష్‌. చాలా చక్కగా చెప్పావు. అంతే కాదు, చిరిగి పోయిన, పాడైపోయిన జెండాను నేల మీద పాత వస్తువును పడేసినట్టు పడవేయరాదు. గొయ్యి తీసి కప్పెట్టాలి. లేకపోతే అగ్గితో అంటించాలి. జెండా మన కాలికి తగలకూడదు'. మరికొన్ని జెండా నియమాలు సార్‌ చెప్పడంతో పిల్లలంతా మరింత శ్రద్ధగా విన్నారు. సమయం ఉదయం తొమ్మిది గంటలు కావస్తోంది. ఎండ క్రమక్రమంగా పెరుగుతోంది.
'సార్‌, కాళ్ళు లాగుతున్నాయి' మూడో తరగతి పిల్లాడు రాజు అనడంతో వాడిని లోపల కూర్చోబెట్టారు.
కొంత సేపటికి 'సార్‌, కళ్ళు తిరిగేలా ఉన్నాయ'ని రెండో తరగతి చదువుతున్న బేగం అనడంతో బేగాన్ని కూడా తరగతి గదిలో కూర్చోబెట్టారు.
ఆలస్యం అయితే పసి పిల్లలు ఇబ్బంది పడతారన్న ఆలోచనతో సర్పంచ్‌ భూషణానికి ఫోన్‌ చేశాడు సుధీర్‌.
ఫోన్‌ స్పీకర్‌ మోడ్‌లో పెడుతూ, 'సార్‌ జెండా ఎగుర వేయడానికి ఎనిమిదిన్నరకు వస్తానని మీరు నిన్న మాతో అన్నారు. ఇప్పుడు తొమ్మిది దాటింది. మీరు వస్తే..' అంటూ భూషణం ఇచ్చే సమాధానం కోసం ఆగాడు సుధీర్‌.
'ఇదిగో మాస్టారూ! మా కార్యకర్తలు ముందు మీ బడికి దగ్గరలో ఉన్న మన పంచాయితీ కాడ, జెండా ఎగుర వేయమన్నారు. మీకు పిల్లలెంత ముఖ్యమో, నాకు నా కార్యకర్తలూ అంతే ముఖ్యం. ఆళ్ళని కాదంటే కష్టం. ఇనబడిందా సార్‌?' అన్నారు సర్పంచ్‌.
'పసి పిల్లలు అప్పుడే విరబూసిన పువ్వుల వంటివారు సార్‌. వాడిపోనంత వరకూ పువ్వులు తాజాగా ఉంటాయి. ఉత్సాహం తగ్గనంత వరకే పిల్లలు హుషారుగా ఉంటారు. కనుక ముందు మన బడి వద్దనే జెండా ఎగురవేయండి సార్‌' బతిమాలే ధోరణిలో అన్నాడు సుధీర్‌.
'కుదరదయ్యా పంతులు. నేను పంచాయితీ కాడనే ఉన్నా. కార్యకర్తలందరూ కూడా వచ్చేసినారు. లైన్లో నిలబెట్టిన పిలకాయల్ని కొంతసేపు లోపల కూకో బెట్టండి. అన్నట్టు మరో మాట. జెండా ఎగుర వేశాకా.. జెండా పాటలు బాగా పాడే నలుగురు పిలకాయల్ని కూడా పంచాయితీ కాడకు పంపండి' అంటూ ఫోన్‌ కట్‌ చేశాడు.
భూషణం మాటలు పిల్లలందరి చెవుల్లో పడ్డాయి. సుధీర్‌ పిల్లలందరినీ నిర్లిప్తంగా చూస్తూ.. అందరూ గదిలోకి వెళ్లి కూర్చోండి. మళ్ళీ పిలుస్తాను. 'సుభాష్‌! సరిత, దేవి, హారికలతో కలిసి పంచాయితీ కార్యాలయం వద్దకు వెళ్ళు. నేను నేర్పిన జెండా పాటలను అందంగా పాడి రండి' అని చెప్పి, పిల్లలతో బాటు సుధీర్‌ కూడా గదిలోకి వెళ్లారు.
సుభాష్‌, తన మిత్రురాళ్ళతో కలిసి జెండా పాటలను పాడటానికి పంచాయితీ వద్దకు వెళ్లాడు. సర్పంచ్‌ వెనకాలే కార్యకర్తలు ఉన్నారు. ఎగుర వేయాల్సిన జెండా, కర్రకు పైన కట్టి ఉంది. సుభాష్‌ అది గమనించాడు. అప్పుడే జెండా ఎగుర వేయడానికి సిద్ధమైన సర్పంచ్‌ భూషణంతో.. 'సార్‌, జెండాను పైకి కట్టి ఉంచారు. రిపబ్లిక్‌ దినోత్సవం నాడు మాత్రమే అలా కడతారు. ఈ ఆగష్టు 15న మాత్రం జెండాను కింద నుండి పైకి పంపి, ఎగుర వేస్తారు. అలా చేయడం జెండా నియమం సార్‌' వినయంగా చెప్పాడు.
'ఎలా కడితే మాత్రం ఏం..? ఏ జెండా అయినా గాలిలోనే కదా ఎగిరేది?' ఒక కార్యకర్త వెటకారంగా అన్నాడు.
'కావచ్చు సార్‌.. కానీ జెండా నియమం అందరూ పాటించాలి. మన జాతీయ జెండాను గౌరవించడం మన బాధ్యత. తప్పదు సార్‌. ఇలా కట్టడం తప్పు సార్‌!''
సుభాష్‌ మాటలతో కార్యకర్తల్లో కోపం పెరిగింది. 'పిల్లాడు మనకు పాఠాలు చెప్పడం ఏమిటి? పాటలు పాడటానికి వచ్చిన వాళ్ళు పాటలు పాడాలి కానీ, మాటలు చెప్పడం ఏమిటి? అలా నిలబడి చూస్తారేం? జెండా ఎగుర వేయండి, సర్పంచ్‌ గారూ' పార్టీ కార్యకర్తలందరూ ఒక్కటిగా అన్నారు.
'పిల్లలు చెప్పినా, పెద్దలు చెప్పినా రెండు రెళ్లు ఎప్పుడూ నాలుగే. జెండా నియమాలు అందరూ పాటించాల్సిందే. మళ్ళీ చెబుతున్నాను. జెండాని గౌరవించడం మనందరి బాధ్యత. క్షమించండి. బాధ్యత లేనిచోట జెండా పాటలు కూడా పాడలేము' అంటూ సుభాష్‌ తన మిత్రురాళ్ళను కలుపుకుని, వెనుతిరిగి బడికి వచ్చేశాడు.
భూషణంతో సహా కార్యకర్తలందరూ నోరెళ్ళబెడుతూ చూడసాగారు. సుధీర్‌కు జరిగిన విషయం సుభాష్‌ ద్వారా తెలిసింది.
'నీ తప్పు లేదు. మన బాధ్యత గురించి, చెప్పా'వంటూ సుభాష్‌ను మెచ్చుకోలుగా చూసారు సుధీర్‌.
అంతలోనే సర్పంచ్‌ గారు, కార్యకర్తలు కలసి, బడి ఆవరణలోకి వచ్చారు.
'జెండా నియమాలు ప్రతి ఒక్కరూ పాటించాలి. ఆ ఉద్దేశ్యంతోనే సుభాష్‌ మీతో అలా చెప్పాడే కానీ వాడిది తొందరపాటు కాదు. అర్థం చేసుకోగలరు' భూషణంతో సహా అక్కడకు వచ్చిన కార్యకర్తలందరితో నెమ్మదిగా చెప్పాడు సుధీర్‌.
అప్పుడే భూషణం సుభాష్‌ను పిలిచారు.
సుభాష్‌ లేచాడు. 'తప్పు చేయనప్పుడు భయం దేనికి?' అని మనసులో అనుకుంటూ భూషణం వద్దకు వెళ్లి నిల్చొన్నాడు.
భూషణం సుభాష్‌ను దగ్గరకు తీసుకుంటూ.. 'వీడి తప్పు లేదు. అర్థం చేసుకున్నాం. సుభాష్‌ చెప్పకపోతే తప్పు జరిగేదే.. వీడి మాటలతో మాలో ఆవేశం తగ్గింది. ఆలోచన మొదలైంది. మావాళ్ళు జెండాను తిరిగి, సరిగా కట్టారు. హుషారుగా వచ్చిన పిల్లల్ని బాధ పెట్టకూడదనుకున్నాం. ముందు బడిలో జెండా ఎగుర వేశాకే పంచాయితీలో ఎగుర వేస్తాను. అందుకే వచ్చాను' భూషణం మాటలతో సుధీర్‌కు చాలా ఆనందం వేసింది.
'థ్యాంక్స్‌ సార్‌!' భూషణంతో సుధీర్‌ నవ్వుతూ అన్నాడు. అప్పుడు భూషణం సుధీర్‌కేసి ఆత్మీయంగా చూస్తూ, 'మా పెంపకం వలన నా మనవడిలో ఒకప్పుడు తెలియని గర్వం ఉండేది. కానీ మీ పాఠాల ద్వారా వాడిలో దేశభక్తి చిగురించింది. వాడికి మేము పెట్టిన పేరుకు సార్ధకత చేకూరింది. పిల్లల భవిష్యత్‌ మాత్రమే కాదు, వారిలో బాధ్యత కూడా తరగతి గదిలోనే నిర్ణయించబడుతుందని మొదటిసారిగా తెలుసుకున్నాను!' అంటూ భూషణం సుభాష్‌కేసి మెచ్చుకోలుగా చూశాడు.

కొక్కెరగడ్డ లక్ష్మిరావు
[email protected]