ఢిల్లీ : రోడ్డు ప్రమాదానికి గురైన టీమ్‌ఇండియా యువ బ్యాటర్ రిషభ్ పంత్ దెహ్రాదూన్ ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు. ఈ ప్రమాదంపై భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ స్పందించారు. ఈ క్రమంలో ఆటగాళ్లకు కీలక సూచనలు చేశారు. 'ఇదొక పాఠం. నేను కూడా కెరీర్ మొదట్లో బైక్ ప్రమాదానికి గురయ్యాను. ఆ రోజు నుంచి నా సోదరుడు నన్ను బైక్‌ను ముట్టనివ్వలేదు. రిషబ్ పంత్ క్షేమంగా బయటపడినందుకు దేవుడికి ధన్యవాదాలు. నీకు మంచి కారు ఉంది. దానిపై వేగంగా దూసుకుపోవచ్చు. కానీ, జాగ్రత్తగా ఉండాలి. ఓ డ్రైవర్‌ను నియమించుకోవడం నీకు భారం కాదు. నీవు సొంతంగా కారును నడపకూడదు. ఎవరికైనా ఈ తరహా కోరికలు ఉంటాయని నేను అర్థం చేసుకోగలను. ఆ వయసులో ఉన్న వారికి ఇలాంటి కోరికలు ఉండడం సహజమే. కానీ, నీకంటూ బాధ్యతలు ఉన్నాయి. నీ గురించి నీవే జాగ్రత్తలు తీసుకోగలవు. నీ గురించి నీవు నిర్ణయం తీసుకోవాలి' అంటూ కపిల్ దేవ్ సూచించారు.