Jan 01,2023 08:40

ప్రకృతిలో అనేక వింతలు విశేషాలు దాగున్నాయి. ఎప్పటికప్పుడు కొత్త విషయాలు మనల్ని అబ్బురపరుస్తూనే ఉంటాయి. అలాంటి వాటిల్లో ఒకటి ట్రాన్స్‌పరెంట్‌ జీవులు. ఇవి చూడ్డానికే వింతగా ఉంటాయి. అదేంటి? ఒంట్లో ఏమీ ఉండవా? అంత ట్రాన్స్‌పరెంట్‌గా ఎలా ఉంటాయి? వంటి అనేక సందేహాలు ఈ జీవులను చూసినప్పుడు మనకు కలుగుతుంది. ఇటువంటి గుట్టునే తేల్చేపనిలో పడ్డారు శాస్త్రవేత్తలు. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం..!
సాధారణ కప్పలను మనం నిత్యం చూస్తూనే ఉంటాం. అయితే ఉష్ణమండల ప్రాంతాల్లో నివసించే గ్లాస్‌ ఫ్రాగ్‌ (గాజు కప్ప) ప్రకాశవంతమైన ఆకుపచ్చని ఆకులపై నిద్రిస్తూ కాలం గడుపుతుంది. తనకు శత్రువుల నుంచి ప్రమాదం ఉందనే సందేహం కలిగినప్పుడు పూర్తిగా ట్రాన్స్‌పరెంట్‌గా మారుతుంది. ఈ విషయం దశాబ్దాలుగా తెలిసిందే. కానీ ఇదెలా సాధ్యమన్న విషయాన్ని తాజాగా వివరించారు శాస్త్రవేత్తలు. దక్షిణ, మధ్య అమెరికాల్లో ఎక్కువగా కనిపించే గాజు కప్ప (గ్లాస్‌ ఫ్రాగ్‌) పారదర్శకత గుట్టును శాస్త్రవేత్తలు తొలిసారిగా వెలుగులోకి తెచ్చారు. నిద్రించే సమయంలో ఇది తన ఎర్రరక్త కణాలను ఎక్కడ దాస్తుందన్నది గుర్తించారు.
 

1

గ్లాస్‌ ఫ్రాగ్‌లకే ఈ సామర్థ్యం..
గ్లాస్‌ ఫ్రాగ్‌ రాత్రివేళల్లో చురుగ్గా ఉంటుంది. ఈ సమయంలో పచ్చగా ఉండే దాని శరీరం.. పరిసరాల్లోని ఆకులు, పొదల్లో కలిసిపోతుంటుంది. పగటివేళ నిద్రించే సమయంలో దాని కండరాలు, చర్మం పారదర్శకంగా మారిపోతాయి. వాటి ఎముకలు, కళ్లు, అంతర్గత అవయవాలు మాత్రమే కనిపిస్తుంటాయి. ఈ కప్పలు భారీ ఆకుల కింద విశ్రమిస్తాయి. అవి పారదర్శకంగా మారినప్పుడు.. చుట్టుపక్కల ఉన్న పచ్చదనంలో బాగా కలిసి పోతాయి. నేలమీద నివసించే వెన్నెముక జీవుల్లో గ్లాస్‌ ఫ్రాగ్‌లకే ఈ సామర్థ్యం ఉంది. రక్త ప్రసరణ వ్యవస్థలోని ఎర్రరక్త కణాల ఉనికి దృష్ట్యా ఇది కష్టమైన అంశం. ఇవి మొక్కల నుంచి పరావర్తనం చెందే పచ్చ కాంతిని శోషించుకొని, ప్రతిగా ఎర్రకాంతిని వెదజల్లుతాయి. ఫలితంగా రక్తం, ప్రసరణ వ్యవస్థ.. ప్రకాశవంతమైన పచ్చ ఆకుల మధ్య విస్పష్టంగా కనిపిస్తుంది. అయినా ఈ కప్ప దీన్ని అధిగమించి, పూర్తి పారదర్శకతను ఎలా సాధిస్తోందన్నది ఆసక్తికరంగా మారింది.

పారదర్శకత ఇలా..
ఈ కప్పలు పారదర్శకంగా మారినప్పుడు ఎర్రరక్త కణాలు.. రక్త ప్రసరణ వ్యవస్థ నుంచి అదృశ్యం కావడాన్ని శాస్త్రవేత్తలు మొదట గమనించారు. మెలకువగా ఉన్నప్పుడు మాత్రం తిరిగి ప్రత్యక్షమవుతున్నాయని తేల్చారు. మత్తుమందుతో వాటిని నిద్రలోకి తీసుకెళ్లినా ఎర్ర రక్త కణాలు కనిపిస్తున్నాయని పేర్కొ న్నారు. ఈ కప్పలు తమంతట తాము నిద్రలోకి జారిపోయినప్పుడే ఆ కణాలు అదృశ్యమవుతున్నట్లు గుర్తించామని తెలిపారు. ఈ నేపథ్యంలో ఫొటోఅకౌస్టిక్‌ మైక్రోస్కొపీ (ఫామ్‌) విధానాన్ని ఉపయోగించి, ఈ గుట్టును విప్పారు. నిద్రించే సమయంలో ఈ కప్పలు తమ ఎర్రరక్త కణాలను కాలేయాల్లో దాచుకుంటున్నట్లు గమనించారు. వేరే జీవులు తమను వేటాడకుండా అవి ఈ జాగ్రత్తను పాటిస్తున్నట్లు తేల్చారు.

Image removed.


పూల్‌ బ్లడ్‌ అంటే..?
శరీరంలోని రక్తాన్ని ఒకే దగ్గరికి తీసుకురావడం (పూల్‌ బ్లడ్‌) ద్వారా ఇలా చేయగలదని నిర్ధారించారు. సాధారణంగా మానవుల్లో ప్రవహించే బ్లడ్‌ క్లాట్‌ అయితే సీరియస్‌ కండిషన్‌ ఏర్పడుతుంది. కానీ కొన్ని జంతువులు తమ బ్లడ్‌ను పూల్‌ చేసే సామర్థ్యం మూలంగా, తమని తాము రక్షించుకుంటాయి. మాంసాహారుల దృష్టిని మరలించేందుకు ఈ జీవి ఆకుపై మారువేషంలో 61% వరకు పారదర్శకంగా మారుతుంది. ఈ 'సూపర్‌ పవర్‌'.. వివిధ దశల్లో కాంతి యొక్క వివిధ తరంగదైర్ఘ్యాలను ప్రకాశింపజేయగల సామర్థ్యం నుంచి వస్తుందని పరిశోధకులు కనుగొన్నారు. ఎర్ర రక్తకణాలను కాలేయంలో ప్యాక్‌ చేయడం ద్వారా ప్లాస్మా నుంచి రిమూవ్‌ చేయబడతాయని, అయినప్పటికీ ప్లాస్మాను సర్క్యులేట్‌ చేస్తాయని తెలిపారు. మొత్తానికి తమ కాలేయంలోకి రక్తాన్ని చేరవేసే గ్లాస్‌ ఫ్రాగ్స్‌.. భారీగా రక్తం గడ్డకట్టకుండా జాగ్రత్త పడతాయన్నారు. అయితే రక్త కణాలు దాదాపు 89 శాతం వరకూ ప్యాక్‌ చేయబడటం ద్వారా కాలేయం పరిమాణం దాదాపు రెట్టింపు అవుతుంది. కప్ప పారదర్శకంగా మారడానికి అనుమతిస్తుంది. రాత్రి సమయంలో వేటాడాలని లేదా జతకట్టాలని అనుకున్నప్పుడు.. ఎర్ర రక్త కణాలను తిరిగి ప్రసరణలోకి విడుదల చేస్తుంది. దీంతో కాలేయం పరిమాణం మళ్లీ తగ్గిపోతుంది. కాగా ఈ పరిశోధనలు మానవులలో బ్లడ్‌ క్లాటింగ్‌ గురించి తెలుసుకునేందుకు మరింత సహాయం అవుతాయని పరిశోధకులు తెలిపారు.

3