Jun 18,2023 07:43

ఒక్కో నటుడి నటన ఒక్కో విధంగా ఉంటుంది. అలా వైవిధ్యమైన నట ప్రస్థానం కలిగిన నటుడు సిద్ధార్థ్‌. ప్రేమకథలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచి.. లవర్‌ బారు ఇమేజ్‌తో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేసుకున్నాడు. సిద్ధార్థ్‌ తమిళ ఇండిస్టీ నుంచి వచ్చినా చక్కగా తెలుగు నేర్చుకుని మరీ ఇక్కడి ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అయితే, చాలా కాలంగా తెలుగు ప్రేక్షకులకు దూరమైన సిద్ధార్థ్‌.. 2021లో 'మహాసముద్రం'తో రీఎంట్రీ ఇచ్చారు. తాజాగా 'టక్కర్‌' చిత్రంతో అందరినీ అలరిస్తున్నారు. ఈ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా పలు ఇంటర్వ్యూల్లో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆ విశేషాలు తెలుసుకుందాం..!

తమిళ నటుడు సిద్ధార్థ్‌కు తమిళంలోనే కాదు తెలుగు, హిందీలోనూ మంచి గుర్తింపు ఉంది. ఆయన హీరోగా కెరీర్‌ను ప్రారంభించి, ఇటీవలే 20 ఏళ్లు పూర్తయింది. దర్శకుడు శంకర్‌ డైరెక్షన్‌లో వచ్చిన 'బార్సు' సినిమాతో సిద్ధార్థ్‌ హీరోగా పరిచయమయ్యారు. ఆ తర్వాత వరుస సినిమాల్లో నటించి, స్టార్‌ హీరోగా ఎదిగాడు. తాజాగా అభిమానులతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సిద్ధార్థ్‌ మాట్లాడుతుండగా ఓ పెద్దావిడ ఎంట్రీ ఇచ్చారు.. వెంటనే సిద్దార్థ్‌ భావోద్వేగానికిలోనై ఆమె కాళ్లకు నమస్కరించి, పరిచయం చేశాడు. ఆమె పేరు 'సుజాత'. ఆమె లేకపోతే తన 20 ఏళ్ల కెరీర్‌ లేదని ఎమోషనల్‌ అయ్యాడు. 'తమిళ్‌లో ఎన్నో నవలలు, పుస్తకాలు రచించి, పలు సినిమాలకు రచయితగా పనిచేశారు సుజాత. కెరీర్‌ మొదట్లో మణిరత్నం వద్ద అసిస్టెంట్‌గా పనిచేసిన సమయంలో నన్ను శంకర్‌కి పరిచయం చేశారు సుజాత!' అని చెప్పారు.

2


కాగా 'నేను అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ఉన్న రోజుల్లో కేవలం రెండువేలు మాత్రమే జీతం. పెట్రోల్‌ బిల్లు రూ.160 కంటే తక్కువగా ఉండేది. నేను డబ్బు లేకపోయినా ఆనందాన్ని, సంతృప్తిని పొందగలను. నేను కోరుకున్నప్పుడల్లా ప్రశాంతంగా నిద్రపోతాను. కాలేజీ రోజుల నాటి బట్టలు ఇప్పటికీ వేసుకుంటాను. ఇదే మనస్తత్వం 'టక్కర్‌'లో నేను పోషించిన పాత్రలో కనిపిస్తుంది' అని సిద్ధార్థ్‌ చెప్పుకొచ్చారు.

  • ప్రేక్షకులతో బంధం అలానే ఉంది..

'నీకు తెలుగులో మంచి ఫాలోయింగ్‌ ఉంది కదా, అక్కడ ఎందుకు ఎక్కువ సినిమాలు చేయడం లేదని బయట పరిశ్రమల్లో నటిస్తున్నప్పుడు చాలా మంది అడుగుతుంటారు. మంచి సినిమా వచ్చినప్పుడు నేనెప్పుడూ నో చెప్పలేదు. ఎంతకాలమైనా నాకూ, తెలుగు ప్రేక్షకులకీ మధ్య బంధం మాత్రం అలాగే ఉంది. ఇక స్వతహాగా నేను సున్నిత మనస్కుడిని. ప్రస్తుతం కార్తీక్‌ క్రిష్‌తో సినిమా చేస్తున్నా. ''ఇండియన్‌2''తో పాటు, మాధవన్‌, నయనతారతో కలిసి ''టెస్ట్‌'' లోనూ చేస్తున్నా.

3
  • యాక్షన్‌ చేస్తే చూస్తారా అన్నారు..

'నా నట ప్రయాణంలో ''నువ్వు యాక్షన్‌ చేస్తే చూస్తారా?'' అన్నవాళ్లు కొందరైతే, ''నువ్వు పక్కింటి అబ్బాయిలానే ఉండిపో!'' అన్నవాళ్లు కొందరు. ఇలా కాదని... ఒక కథకి నాయకుడిగానూ, నిర్మాతగానూ నిలబడదాం అని ఓ ప్రొడక్షన్‌ కంపెనీని ప్రారంభించా. ఆ ప్రయత్నం మొదట ఇక్కడే చేశా. కానీ నాకు సరైన సహకారం లభించలేదు. తమిళంలో నిరూపించుకుని, మళ్లీ ఇప్పుడు నా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చా. నా సొంత నిర్మాణ సంస్థలోనే ''చిన్నా'' అనే సినిమా చేస్తున్నా!'

  • అప్పుడే ప్రభావం చూపగలను..

'నాదైన జీవితాన్ని గడిపినప్పుడే.. నటుడిగా ప్రభావం చూపించగలననేది నా అభిప్రాయం. పొద్దున లేచామా? ఇష్టమైన సినిమా కోసం పనిచేశామా? ఇలానే ఉంటాయి నా ఆలోచనలు. ఇక రచన అనేది నిరంతర ప్రక్రియ. ఎప్పుడూ రాస్తూనే ఉంటా. ''గృహం'' సినిమాకి కొనసాగింపుగా స్క్రిప్ట్‌లు సిద్ధం చేసుకున్నా. ఇక ప్రస్తుత తరానికి డబ్బు సంపాదించాలనే ఆశ ఎక్కువగా కనిపిస్తోంది. నేను పెరిగిన విధానం మాత్రం డబ్బు కంటే ఆనందానికి ఎక్కు ప్రాధాన్యత ఇవ్వాలనే నమ్మకాన్ని నాలో కలిగించింది' అని చెప్పారు.

3

పేరు : సిద్ధార్థ్‌ సూర్యనారాయణ
ఇతర పేర్లు : సిదీ
ప్రొఫెషన్‌ : యాక్టర్‌, ప్లేబ్యాక్‌ సింగర్‌, ప్రొడ్యూసర్‌
పుట్టిన తేదీ : ఏప్రిల్‌ 17, 1979
పుట్టిన ప్రాంతం: చెన్నరు
చదువు : ఎంబిఎ
తోబుట్టువులు : జయేంద్ర, సంధ్య
హాబీస్‌ : సింగింగ్‌, రీడింగ్‌, ట్రావెలింగ్‌