Nov 15,2023 10:10

మండే ఎండ, చుట్టూ దుమ్ముతో నిండిన గాలి, కాళ్లకు చెప్పులు లేవు, అయినా ఆ పిల్లవాడు తన శక్తికి మించి ఆ ఇటుకబట్టీలో పనిచేస్తున్నాడు. అతనికి చదువంటే వల్లమాలిన అభిమానం. కానీ కుటుంబ పరిస్థితులు అతన్ని చదువుకు దూరం చేసి బాల కార్మికునిగా మార్చాయి. పట్టుమని 16 ఏళ్లు కూడా లేని అతడు, అప్పుడే నిర్ణయించుకున్నాడు. తనలా చదువుపై ప్రేమ ఉన్న మరెవ్వరూ విద్యకు దూరం కాకూడదని. ఇదంతా 27 ఏళ్ల క్రితం నాటి సంగతి. ఇప్పుడు అతడు పెరిగి పెద్దయి చిన్ననాడు తను కన్న కలను సాకారం చేసే దిశగా అడుగులు వేస్తున్నాడు. తమిళనాడు విల్లుపురానికి చెందిన అతని పేరు దామోదరన్‌. ఉన్నత విద్యావంతుడిగా మెరుగైన ఉపాధి మార్గం పొందే అవకాశం ఉన్నా గ్రామీణ ప్రాంతాల చిన్నారుల భవిష్యత్తు కోసం పరితపిస్తున్నాడు. బాలకార్మికునిగా ఇటుకల బట్టీలో పనిచేసిన దామోదరన్‌ ప్రస్తుతం లాభాపేక్ష లేని స్వచ్ఛంద సంస్థ 'ఎయిడ్‌ ఇండియా' ద్వారా 25 లక్షల పైచిలుకు చిన్నారుల జీవితాలను తీర్చిదిద్దారు. 'ఎర్రని ఎండలో నెత్తిన బరువుపెట్టుకుని ఆ ఇటుకల బట్టీలో పనిచేయడం నాకు ఇంకా గుర్తే. మా గ్రామాల్లో చాలామంది పిల్లలు తెల్లవారేసరికి ఇటుకల బట్టీలకు వెళ్లే ట్రాక్టరులో ఉండేవారు. రోజంతా పనిచేసి సాయంత్రానికి బయటపడ్డామని ఊపిరి పీల్చుకునేవారు. కానీ మరుసటి రోజు నిద్రలేచే సరికి మళ్లీ అదే ట్రక్కులో పనికి వెళ్లాల్సి వచ్చేది. నేను కొన్ని రోజులు స్కూలుకు వెళ్లిన తరువాత బట్టీలో పనికి కుదిరాను. కానీ చాలామంది పిల్లలు అసలు స్కూలు ముఖం కూడా చూడకుండా ఇటుకలబట్టీల వైపు నడిచారు' అంటూ తనకెదురైన చేదు అనుభవాలను దామోదర్‌ గుర్తుచేసుకున్నారు.
         రెండేళ్లపాటు ఇటుకల బట్టీలో పనిచేసిన దామోదరన్‌ ఆ తరువాత తన జీవితంలో పెద్ద మార్పు వైపు అడుగులు వేశారు. గ్రామాన్ని విడిచిపెట్టి చెన్నరు నగరానికి వచ్చేశాడు. అక్కడే కాలేజీ విద్యనభ్యసించారు. సైన్స్‌ విద్యార్థిగా మెరుగైన ప్రతిభతో రాణించారు. తారామణి ప్రాంతంలో నివసిస్తున్న దామోదరన్‌కు అక్కడే ఉన్న 'ఎయిడ్‌ ఇండియా' సంస్థ గురించి తెలిసి అందులో వాలంటీర్‌గా చేరారు. చుట్టుపక్కల ఉన్న మురికివాడల పిల్లలకు చదువుచెప్పేందుకు ప్రతిరోజూ అక్కడికి వెళ్లేవాడు. సేవామార్గంలో పయనిస్తూనే తన విద్యాభ్యాసం కొనసాగించారు. మద్రాస్‌ యూనివర్శిటీలో ఆంత్రోపాలజీలో మాస్టర్స్‌ చేశారు. ఆ తరువాత ఎంఫిల్‌, పిహెచ్‌డి పూర్తిచేశారు.
       ఇరులర్‌ ఆదివాసీ పిల్లల అభ్యసనా లోపాలపై పిహెచ్‌డి సమర్పించిన దామోదరన్‌ ఆ పిల్లల బాగు కోసం ఏళ్లతరబడి కృషి చేస్తున్నారు. ఎంతోమంది పిల్లలను ఎయిడ్‌ ఇండియా చెంతకు చేర్చి విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు. ఇప్పుడా పిల్లలు బాలకార్మికులుగా మారకుండా బడి బాట పట్టారు. 'ఉన్నత విద్య అభ్యసించినా, మెరుగైన ఉపాధి అవకాశాలున్నా ఎప్పుడూ ఆ దిశగా ఆలోచించలేదు. ఈ పిల్లలకు చదువు నేర్పించడంలోనే ఎక్కువ సంతోషపడతాను.
        మారుమూల గ్రామాలకు వెళ్లి చదువుకు దూరమైన, వెనుకబడిన తరగతులు, ఎస్‌సి, ఎస్‌టి పిల్లలను గుర్తించి వాళ్లందరికీ విద్యకు దగ్గర చేస్తున్నాను. అలా ఇప్పటివరకు 25 లక్షలకు పైగా చిన్నారులు స్కూలుకు వెళుతున్నారు. ఇదంతా ఒక్క రోజులో జరగలేదు. ఇంకా ఎంతోమంది బడి ఈడు పిల్లలు, బాలకార్మికులుగా జీవిస్తున్నారు. వారంతా చదువు మార్గం పడితేనే నాలాంటి వారు సంతోషపడతారు. ఆ రోజు కోసం ఎదురు చూడకుండా నావంతు బాధ్యతగా ఇదంతా చేస్తున్నాను' అంటున్నారు దామోదర్‌ ఎంతో సంతోషంగా.