మహేంద్రగిరి అడవిలో నివాసం ఉంటున్న జంతువుల యోగక్షేమాలు తెలుసుకోవడానికి మృగరాజు, మంత్రి కుందేలు అడవిలోకి బయలుదేరాయి. అలా అడవిలోని జంతువులతో మాట్లాడుతూ, వాటి యోగ క్షేమాలు తెలుసుకుంటూ ముందుకు వెళుతున్నాయి. మృగరాజుతో జంతువులు బయలుదేరితే.. 'నాతో రావద్దు... మీ పనులు మీరు చేసుకోండి' అంటూ ముందుకు వెళ్లాయి. ఒక తోడేలు మాత్రం మృగరాజు వద్దన్నా వాటిని అనుసరిస్తూ వెళ్ళింది. మధ్యాహ్న సమయం అయింది. మృగరాజుకు దాహం వేసింది. దగ్గరలో ఒక కొలను కనిపిస్తే, అక్కడ ఆగాయి.
'నేను దాహం తీర్చుకొని వస్తాను.. మీరు చెట్టు నీడలో ఉండండి' అని కుందేలుకు తోడేలుకు చెప్పి నీరు తాగడానికి కొలనులో దిగింది. దిగిన ప్రాంతం కాస్త లోతుగా ఉండడం వలన సింహం కొలను ఊబిలో చిక్కుకుంది. బయటకు రావడానికి ప్రయత్నం చేసినా సరైన ఆసరా దొరకక రాలేకపోతున్నది. 'రక్షించండి! రక్షించండి!!' అని మృగరాజు అరిచింది.
అరుపులు విన్న తోడేలు మృగరాజు ఊబిలో చిక్కుకున్నారని గమనించి, సమీపంలో కనిపించిన ఏనుగుని పిలుచుకొని వచ్చింది. కుందేలు మృగరాజుకు ధైర్యం చెప్పింది.
మృగరాజు పరిస్థితి గమనించి, మెల్లగా కొలనులోకి అడుగుపెట్టి.. ఏనుగు తన తొండముతో మృగరాజును బయటకు తీసుకువచ్చింది. ఏనుగుకు కృతజ్ఞతలు చెప్పి.. 'నీ సహాయము మరువలేనిది. నా ప్రాణాలను కాపాడావు. నీ రుణం తీర్చలేనిది. నీకేం కావాలో కోరుకో' అని అడిగింది.ఏనుగు 'మగరాజా! ఆపదలో ఉన్న మిమ్మల్ని రక్షించడం నా బాధ్యత. మీరు సురక్షితంగా బయటపడ్డారు. అదే నాకు చాలు. నాకు ఇంకేమీ కోరికలు లేవు' అని అంది.
మృగరాజు దగ్గర సెలవు తీసుకుని తన స్థావరం వైపు వెళ్లిపోయింది.
మృగరాజు తోడేలు వైపు చూసి 'ఆ సమయంలో నువ్వు నన్ను రక్షించడానికి ఏనుగును పిలుచుకొని వచ్చావు. నీ మేలు కూడా మరువలేనిది. నీకేం కావాలో కోరుకో' అని అన్నారు. అప్పుడు తోడేలు 'మృగరాజా! నన్ను మా తోడేళ్లు జాతికి నాయకుడిని చేయాలి!' అని కోరింది. మగరాజు 'సరే' అని తోడేళ్ల తండాకు తీసుకు వెళ్లి, అక్కడ నివాసం ఉంటున్న తోడేళ్లతో 'ఈ రోజు నుండి మీకు నాయకుడిగా ఈ తోడేలు ఉంటుంది. దాని ఆజ్ఞలు పాటిస్తూ, మీకేమైనా నా ద్వారా సహాయం కావాలంటే ఈ తోడేలు ద్వారా నాకు తెలియజేయండి' అని చెప్పి మృగరాజు, కుందేలు అక్కడి నుంచి బయలుదేరాయి.
మంత్రి కుందేలు మృగరాజుతో 'ఒక జాతికి నాయకుడిగా ఉండాలంటే మంచి చేయాలనే తపన, తన జాతిని రక్షించుకోవాలనే సంకల్పం ఉండాలి. అవి ఈ తోడేల్లో ఉన్నాయో లేవో గమనించకుండా మీరు దానిని నాయకుడిగా నియమించారు. సరైన నిర్ణయం కాదేమో?' అంది.
'నాకు ఆపదలో ఆ తోడేలు సాయం చేసింది. అందుకే నియమించాను. ఇంకేమీ ఆలోచించలేదు' అని మృగరాజు అంది.
కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు ఆ తోడేలు మృగరాజు దగ్గరికి వచ్చి, నమస్కరించింది.
'ఏమిటి ఇలా వచ్చావు? నీకు ఇచ్చిన పదవితో తృప్తిగా ఉన్నావు కదా! ఇంకేమైనా కావాలా?' అని మాట వరుసకు అడిగింది. పక్కనే మంత్రి కుందేలు కూడా ఉంది.
'మృగరాజ! నాకు మీ దగ్గర మంత్రిగా పనిచేయాలని కోరికగా ఉంది' అని మనసులో మాట తోడేలు చెప్పింది.
మృగరాజు ఆలోచించి 'ఎంతైనా నాకు ఆపదలో కాపాడింది. ఈ తోడేలు కోరిక తీర్చాలి' అని అనుకొని 'అలాగే, ఈ రోజు నుంచి నువ్వు కుందేలుకు సహాయమంత్రిగా ఉండు!' అని అంది. మృగరాజు నిర్ణయానికి కుందేలు ఆశ్చర్యపోయింది.
తోడేలు లేని సమయంలో 'మృగరాజా! ఆశకు అంతుండదు. మీరు అడిగినప్పుడల్లా తోడేలు కోరికలను కోరుతూనే ఉంటుంది. ఈ తోడేలు ప్రవర్తన గురించి తెలుసుకున్నాను. తాను నాయకుడయ్యాక తనకు నచ్చినట్లు నిర్ణయాలు చేసి, తోటి తోడేళ్లకు చాలా ఇబ్బందులు పెట్టింది. అవన్నీ ఒక్కసారి దాడి చేయడంతో మీ దగ్గరకు ఆ విషయం చెప్పుకోవాలని వచ్చింది. కానీ తాను మంత్రి పదవి అడగ్గానే ఇచ్చారు. మనం ఈ తోడేలుతో తగు జాగ్రత్తగా ఉండాలి' అని చెప్పింది. అప్పుడు కూడా మృగరాజు 'ఆపదలో సహాయం చేసింది కదా! అందుకే అవకాశం ఇచ్చాను' అని అంది.
కుందేలుకు సహాయమంత్రిగా తోడేలు ఉంటూ అడవిలో జంతువులపై పెత్తనం చెలాయించ సాగింది. ఆ విషయం మృగరాజుకు తెలిసి, తోడేలుకు రమ్మని కబురు పెట్టింది.
తోడేలు మృగరాజు దగ్గరకు వచ్చింది. తోడేలుతో 'సహాయ మంత్రిగా ఆనందంగా ఉన్నావు కదా! ఇంకేమైనా కావాలా?' అని తోడేలును అడగాలనే అడిగింది. అదే అవకాశంగా తోడేలు తీసుకుని 'మృగరాజా! కుందేలుకు సహాయమంత్రిగా కాకుండా, నేనే ఈ అడవికి మంత్రిగా ఉండాలని కోరుకుంటున్నా' అని తన దురాశను బయట పెట్టింది.
ఇంతలో మంత్రి కుందేలు కూడా అక్కడికి వచ్చింది. తోడేలు మాటలు విని మృగరాజు ఆశ్చర్యపోయింది. 'ఇంతకీ నిన్ను ఇక్కడికి ఎందుకు రమ్మని పిలిచానో తెలుసా?, నువ్వు నాకు సాయం చేశావనే ఉద్దేశంతో నీకు పదవులు కట్టబెట్టాను. కానీ అర్హులు కాని వారికి, దురాశపరులకు పదవులు ఇస్తే ఎలా ఉంటుందో నాకు తెలిసి వచ్చేటట్లు చేశావు. నీకు వచ్చిన పదవితో పదిమందికి మేలు చేయాలి. కానీ నీవు పదవి ఉందని పెత్తనం చెలాయిస్తూ, జంతువుల్ని ఇబ్బందులు పెడుతున్నావు. ఆశకు అంతులేదని నిరూపించావు. ఇక ఎప్పుడూ నాకు కనబడకు' అని మందలించి, తోడేలును తరిమేసింది. తోడేలు 'బతుకు జీవుడా!' అని అనుకొని అక్కడి నుంచి నిష్క్రమించింది. మంత్రి కుందేలు మృగరాజు నిర్ణయం విని చాలా సంతోషించింది.
- మొర్రి గోపి
88978 82202