Jun 12,2022 14:33

యూపీఎస్సీ పరీక్షా ఫలితాలు ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఢిల్లీకి చెందిన ఒక యువతి ఎలాంటి కోచింగ్‌ తీసుకోలేదు. అయినా టాప్‌ టెన్‌లో నిలిచారు. ఆమే ఇషితా రాఠీ. తన తల్లిదండ్రులు పోలీసు అధికారులుగా దేశానికి సేవ చేయడం పట్ల సంతృప్తిగా ఉండడం చూసి, తనకు ఐఏఎస్‌ కావాలనే తపన వచ్చిందని చెబుతున్నారు ఇషిత. దేశానికి సేవ చేయడానికి సివిల్‌ సర్వీసెస్‌ తనకు మంచి వేదిక అవుతుందని, అందుకు తన తల్లిదండ్రులు ఎంతో స్ఫూర్తిని ఇచ్చారని ఈ టాపర్‌ చెబుతున్నారు. ఐఏఎస్‌ ఆఫీసర్‌గా మహిళలు, పిల్లల సాధికారత కోసం పనిచేయాలనేదే తన లక్ష్యంగా ఇషిత చెబుతున్నారు.. ఆ వివరాలు..!'

suprti


ఉన్నత స్థానాల్లో నిలవాలని, ఉన్నత హోదా సంపాదించాలని, ఐఏఎస్‌ కావాలని అందరూ కలగంటారు. కానీ కొందరే ఆ లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. అందుకు ఎంతో శ్రమ, కఠోరమైన దీక్ష, పట్టుదల కూడా అవసరం. వీటన్నింటికీ తోడు ఎవరో ఒకరు స్ఫూర్తిగా ఉండాలి. ఇటీవల ఫలితాల్లో విజయం సాధించిన ఇషితా రాఠీ మాత్రం తన తల్లిదండ్రులనే స్ఫూర్తిగా తీసుకున్నారు. తాను అనుకున్న ఐఏఎస్‌ని సాధించారు. యూపీఎస్సీ సివిల్స్‌ ఎగ్జామ్‌ ఫలితాలు ఇటీవల విడుద లైన విషయం తెలిసిందే. ఈ ఫలితాల్లో ఢిల్లీకి చెందిన ఒక యువతి ఆలిండియా 8వ ర్యాంక్‌ సాధించారు. ఎలాంటి కోచింగ్‌ లేకుండానే ఆమె సివిల్స్‌లో టాప్‌ 10లో నిలిచారు. ఆమే ఇషితా రాఠీ. ఈమె తల్లిదండ్రులు ఇద్దరూ ఢిల్లీ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్నారు. సొంత ప్రిపరేషన్‌ టెక్నిక్స్‌తో సివిల్స్‌లో సక్సెస్‌ కావడం సంతోషంగా ఉందని చెబుతున్నారు ఇషితా. తన తల్లిదండ్రులను చూస్తూ దేశానికి సేవ చేయాలని కలలు కన్నానని ఆమె పేర్కొన్నారు. మూడో ప్రయత్నంలో యుపిఎస్సీలో ఉత్తీర్ణత సాధించిన ఈ 26 ఏళ్ల యువతి.. దేశంలో మహిళా సాధికారత కోసం కృషి చేయాలని అనుకుంటున్నానని చెబుతున్నారు.
టాప్‌ 10 లిస్ట్‌తో షాక్‌ అయ్యా..
యుపీఎస్సీ సిఎస్‌ఈ 2021 ఫలితాలను ప్రకటించిన తర్వాత.. టాప్‌ 10 లిస్ట్‌లో తన పేరు రావడంతో షాక్‌ అయ్యానని చెప్పారు ఇషితా. 'ఈ పరీక్షలో అనిశ్చితి ఉంటుంది. ప్రతి అటెమ్ట్‌, గత అటెమ్ట్‌కు భిన్నంగా ఉంటుంది. కాబట్టి ఫలితాలు వెలువడే వరకూ ఏ వ్యూహం పని చేసిందో, ఏది ఫలించలేదో తెలియదు. ఇతర ఆశావహుల మాదిరిగానే నా ప్రయాణం చాలా కఠినంగానే సాగింది. ఇంత మంచి ర్యాంక్‌ వస్తుందని ఊహించలేదు. మొదట్లో ఫైనల్‌కు చేరుకుంటానో లేదో కూడా నాకు కచ్చి తంగా తెలియలేదు. కానీ మొత్తానికి విజయం సాధించాను. ఇదంతా షాకింగ్‌గా ఉంది.' అని ఆమె చెబుతున్నారు.
నిపుణుల సలహాలే..
మద్రాస్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ నుంచి ఎకనామిక్స్‌లో పీజీ పూర్తి చేసిన ఇషిత, సివిల్స్‌ కోసం ఎలాంటి కోచింగ్‌ తీసుకోలేదు. ప్రిపరేషన్‌ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'నేను ఎలాంటి కోచింగ్‌ తీసుకోలేదు, కానీ నా ఆప్షనల్‌ సబ్జెక్ట్‌ అయిన ఎకనామిక్స్‌ కోసం నిపుణుల సలహాలు తీసుకున్నాను. సిలబస్‌ చూసిన తర్వాత టాపిక్స్‌ను సొంతంగా కవర్‌ చేయవచ్చని గ్రహించాను. ప్రస్తుతం సొంతంగా పరీక్షకు సిద్ధం కావడానికి ఉచిత మెటీరియల్‌ కూడా అందుబాటులో ఉంది. నాకు ఇలాంటివన్నీ ఉపయోగపడ్డాయి' అని ఇషిత వివరించారు.
టాపర్స్‌ సూచనలే వ్యూహాలు..
గత సంవత్సరాల టాపర్స్‌ సూచనల ఆధారంగా వ్యూహాలను రూపొందించుకున్నా. 'జాగ్రఫీ, పాలిటీ వంటి కొన్ని సబ్జెక్టులకు ఎన్‌సిఇఆర్‌టి బుక్స్‌ సరిపోతాయి. న్యూస్‌ పేపర్‌, కరెంట్‌ అఫైర్స్‌ చదవడం కూడా ఉపయోగపడుతుంది. నేను పాలిటీ కోసం లక్ష్మీకాంత్‌, హిస్టరీ కోసం స్పెక్ట్రమ్‌తో సహా ప్రముఖ యుపిఎస్సీ ప్రిపరేషన్‌ పుస్తకాలు ప్రిపేర్‌ అయ్యాను. గత టాపర్స్‌ సూచించిన బుక్స్‌ ఫాలో అయ్యాను. రివిజన్స్‌, సొంతంగా రాసుకున్న నోట్స్‌ కూడా ఎంతో ఉపయోగపడ్డాయి' అని చెప్పారు.
టార్గెటెడ్‌ స్టడీ అవసరం..
ప్రిపరేషన్‌ టిప్స్‌ గురించి ఇషిత మాట్లాడుతూ.. యూపీఎస్సీ అభ్యర్థులు టార్గెటెడ్‌ స్టడీస్‌పై దృష్టి పెట్టాలని, అన్ని సబ్జెక్టులపైనా అవగాహన పెంచుకోవాలని సూచించారు. కొన్ని గంటలపాటు చదువుతూ, ఆ తర్వాత బ్రేక్‌ తీసుకున్నానని తెలిపారు. 'నేను ఒక మార్నింగ్‌ పర్సన్‌ను. ఉదయం త్వరగా నిద్ర లేస్తాను. అయితే సమయాన్ని మనసులో పెట్టుకొని చదవలేదు. కానీ నాకు నేనే సొంతంగా టార్గెట్స్‌ పెట్టుకునేదాన్ని. కొన్నిసార్లు ఆ టార్గెట్స్‌ నేను అనుకున్న సమయం కంటే ముందే పూర్తయ్యేవి. మరికొన్ని సార్లు 10 గంటల కంటే ఎక్కువ సమయం పట్టేది. యుపీఎస్సీ అభ్యర్థులకు లాస్ట్‌ మినిట్‌ టిప్స్‌ ఇవ్వమంటే.. ఆత్మవిశ్వాసంతో ఉండాలని, పాజిటివ్‌ పర్సన్స్‌తో ఉంటూ ఎగ్జామ్‌ క్లియర్‌ చేస్తారని మీకు మీరే హామీ ఇచ్చుకోవాలని చెప్తాను. ప్రస్తుతం ప్రిలిమ్స్‌ ఎగ్జామ్స్‌ సబ్జెక్టివ్‌గా మారుతున్నాయి. వీటిని క్లియర్‌ చేయాలంటే లాజిక్స్‌ అవసరం. ఎగ్జామ్‌ హాల్‌లో మీ లాజిక్స్‌ విజయం దిశగా నడిపిస్తాయి' అని ఇషిత వివరించారు.