Mar 05,2023 07:59

ఎన్నో ఔషధ గుణాలు, పోషకాలు ఉన్న అరటి మన పెరట్లో పెరిగే మొక్క. హైబ్రిడ్‌ అరటిలో అనేక రకాలున్నాయి. వాటి రంగులు, ఆకతుల్లో మార్పులతో నయనానంద పరుస్తున్నాయి. ఆహా! అనిపించే అరటి గురించి ఈ వారం తెలుసుకుందాం..

  • బారు గెల..
1

చిన్న అరటికాయలతో, ఒక్కో గెల ఐదు నుంచి పది అడుగుల పొడవు ఉంటుంది ఈ రకం. దీని శాస్త్రీయ నామం ముసా-పారడైసీకా. ఇది థాయిలాండ్‌ వెరైటీ. చెట్టు రెండేళ్ళు పెరుగుతుంది. గెల పువ్వు వేసిన తర్వాత ఏడాది పెరుగుతుంది.

  • డ్వార్ఫ్‌..

డ్వార్ఫ్‌ బనానా తెలుపు, గోధుమ చారల కలబోతతో ఉంటాయి. కాయలు పొడుగ్గా, తియ్యగా ఉంటాయి. ఈ అరటి చెట్టు ఆకులు కూడా రెండు రంగుల చారలు, డిజైయిన్‌తో ఉంటుంది. చెట్టు చాలా నెమ్మదిగా ఎదుగుతుంది. ముసా అక్యూమిలాటా కొల్ల దీని శాస్త్రీయనామం.

  • ఎర్ర బొంత..
1

కాయలు చింతపిక్క రంగు ఎరుపుగా ఉంటాయి. ముసా వెలుటునా దీని శాస్త్రీయ నామం. ఎంత ముగ్గినా, పండు కాస్త వగరుగానే ఉంటుంది. నాటిన ఏడాదిలోపే కాస్తుంది. ముగ్గినా అదే రంగు ఉంటుంది.

  • సిల్వర్‌..

కూర అరటి జాతికి చెందిన రకం సిల్వర్‌ అరటి. గెలలో కాయలు వెండి రంగులో ఉంటాయి. కాయలు తాకితే బూడిదలాగా రంగు చేతులకు అంటుకుంటుంది. సాధారణ కాయలతో పోలిస్తే కాయల సైజు చిన్నగానే ఉంటుంది. కూర అరటే అయినప్పటికీ ముగ్గితే ఈ పండ్లు చాలా తియ్యగా ఉంటాయి. దీనిని లైట్‌ బ్లూ జావా బనానా అని కూడా పిలుస్తారు.

  • పింక్‌..

ఈ గెల అరటిపండ్లు చూడచక్కగా ముదురు పింకు రంగులో ఉంటాయి. ముసా బాల్బీసియానా జాతికి చెందిన ఈ అరటి శీతల ప్రాంతాల్లో బాగా పెరుగుతుంది.

  • బర్ఫీ..
1

బనానా బర్ఫీ కాయలు సన్నగా కోలాగా ఉంటాయి. ఇది ఏడాది లోపే కాపుకు వస్తుంది. తేనెలొలుకు తియ్యదనం ఈ అరటి పండ్లు ప్రత్యేకత.

  • అంటింపు..
1

కూర అరటి రకానికి చెందిన ఈ అరటి గెలలో అస్తం అంతా కలిసి ఉంటుంది. అస్తంలో కాయలు అడుగు భాగంలో కలిసిపోయి ఉంటాయి. గెలకు తక్కువ అస్తాలుంటాయి.

  • రంగుల..
1

చాలా అరుదుగా లభించే అరటి మొక్క ఇది. గెల చాలా పొడవుగా ఉంటుంది. కాయలు వందల సంఖ్యల్లో కాస్తాయి. దేశవాళీ కర్పూరం కాయలను పోలి ఉంటాయి. ఒకే గెలలో కాయలు రంగు రంగులుగా ఉండటం ఈ రకం అరటి విశిష్టత. ఇది పూర్తి పరిపక్వత రావడానికి కనీసం రెండేళ్లు పడుతుంది.

  • బ్లూ..
blue

మరో అరుదైన రకం అరటి బ్లూ బనానా. ఇది కూడా కూర అరటి రకమే. కాయలు నీలంగా ఉండి ఆకర్షణీయంగా ఉంటాయి. కాయలు సైజు సమానంగా ఉంటాయి. గెల చిన్నగా ఉంటుంది. ఇవి కూడా శీతల దేశానికి చెందిన హైబ్రిడ్‌ వెరైటీ. వీటిని పెద్ద పెద్ద కుండీల్లో పెంచుకోవచ్చు.

  • ఊర్ద్వముఖ..
1

ఊర్ద్వముఖ అరటి వెలుటినా రకానికి చెందినది. చెట్టుకు గెల, పువ్వు అన్నీ ఊర్ద్వముఖంగా అంటే ఆకాశం వైపు పైకి వేస్తాయి. గెలకు చాలా తక్కువ కాయలు కాస్తాయి. పండ్లు ఎర్రగా ఉంటాయి. చెట్టు పొట్టిగా ఐదడుగులలోపే పెరుగుతుంది. ఆకులు చిన్నగా ఉంటాయి. వీటిని కుండీల్లో కూడా పెంచుకోవచ్చు.

  • వెరిగేట..
1

మొక్క చిన్నగానే ఉండి చాలా చాలా పువ్వులు, గెలలు, పళ్ళు కాస్తుంది. పెద్దగా తినడానికి ఉపయోగపడవు ఈ పళ్ళు. చూడ్డానికి ఆకర్షణగా ఉంటుంది. కుండీల్లో కూడా పెంచుకోవచ్చు. ధర చాలా ఎక్కువ.

- చిలుకూరి శ్రీనివాసరావు, 8985945506